పన్నుల ఆదాయమే దిక్కు
eenadu telugu news
Published : 27/09/2021 03:15 IST

పన్నుల ఆదాయమే దిక్కు

బిల్‌ కలెక్టర్లు, ఆర్వోలకు రోజువారీ లక్ష్యాలు

ఈనాడు, అమరావతి

కేంద్ర, రాష్ట్రాల నుంచి ఆయా గ్రాంట్ల రూపేణా నగర, పురపాలికలకు గతంలో నిధులు దండిగా వచ్చేవి. ఆ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టేవి. ప్రస్తుతం ఆర్థిక సంఘం నిధులు మినహా ఇతరత్రా గ్రాంట్లు రావడం లేదు. ఈ ప్రభావం పురపాలికలపై బాగా పడింది. ఆర్థిక సంఘం నుంచి వచ్చే కొద్దిపాటి నిధులతో కాల్వలు, డ్రెయిన్లు, పార్కుల నిర్మాణం తప్ప నగర, పురపాలికలను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి అవి ఏమూలకు సరిపోవడం లేదు. సాధారణ నిధులతో పనులు చేపడదామంటే వాటిని ఇప్పటికే పాత బకాయిలకు వెచ్చించారు. దీంతో జిల్లాలో నగర, పురపాలికల్లో చిల్లిగవ్వ లేని పరిస్థితి నెలకొంది.

గుంటూరు నగరపాలక సంస్థ సైతం నిధుల సమస్యను ఎదుర్కొంటోంది. ఇక్కడైతే ఏరోజుకారోజు ఆస్తిపన్ను, భవన అనుమతుల ఫీజులు ఎంత వచ్చాయో నిర్ధారించుకుని గుత్తేదారులకు చెల్లింపులు చేయడం కనిపిస్తోంది. నగర, పురపాలికల ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా ఉందని తెలుసుకుని ఆయా పనుల నిర్వహణకు టెండర్లు పిలుస్తున్నా గుత్తేదారులు మాత్రం పాల్గొనడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులే జోక్యం చేసుకుని కొందరు గుత్తేదారులతో బలవంతంగా పనులు చేయిస్తున్నారు. ఇప్పటికే చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారులు పనుల నిర్వహణకు ముందుకు రావడం లేదని ఇంజినీరింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. పేరుకుపోయిన బిల్లులు చెల్లించాలని పట్టుబడుతున్నారని అధికారులు గుర్తు చేస్తున్నారు.

ప్రస్తుతం ఇక్కడ ఏ రోజుకారోజు పన్నుల ఆదాయం వస్తే తప్ప అభివృద్ధి పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొందని నగరపాలక వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగానే మేయర్‌, కమిషనర్లు, ఆర్వోలు పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి కింది స్థాయి యంత్రాంగానికి దిశా నిర్దేశం చేస్తున్నారు. ఈ వచ్చే ఆదాయంతోనే చాలా వరకు రోజువారీ వ్యయాలు అధిగమించడం పురపాలికల తీరుగా ఉంటోంది. ప్రస్తుతం అన్ని పురపాలికల్లో సీజనల్‌ వ్యాధులను అరికట్టడానికి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఫాగింగ్‌, యాంటీలార్వా ప్రయోగాలు చేస్తున్నారు. వీటికి వాహనాలు అవసరం. ఆ వాహనాల్లో ఇంధనానికి బడ్జెట్‌ లేక పొన్నూరు తదితర పురపాలికల్లో కనీసం ఆటోలు బయటకు తీయడం లేదు. దీన్ని బట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్ఛు తెనాలి పురపాలికలోనూ పారిశుద్ధ్య పనుల నిర్వహణకు నిధులు లేక సరిగా ఫాగింగ్‌, యాంటీలార్వా వంటి పనులు నిర్వహించకపోవడం వల్లే దోమలు పెరిగి కేసులు పెరుగుతున్నాయి. నరసరావుపేట, చిలకలూరిపేట, మాచర్ల పురపాలికల్లోనూ ఇదే పరిస్థితి. అక్కడా నిధుల సమస్యతో మొక్కుబడిగా ఫాగింగ్‌ చేస్తూ మమ అనిపిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తెనాలిలో మున్సిపల్‌ కమిషనర్‌ రోజువారీ లక్ష్యాలు విధించి ఆస్తి పన్ను వసూళ్లకు ప్రాధాన్యమిస్తున్నారని చెబుతున్నారు.


రూ.50 కోట్లకు పైగా బకాయిలు!

జిల్లా వ్యాప్తంగా నగర, పురపాలికల్లో రూ.50కోట్లకు పైగా గుత్తేదారులకు చెల్లింపులు చేయాల్సి ఉంటుందని తెలిసింది. ఇంత పెద్ద మొత్తంలో బకాయిలు ఉండడంతో గుత్తేదారులు ప్రస్తుతం పనుల నిర్వహణకు ఆసక్తి చూపని మాట వాస్తవమేనని గుంటూరుకు చెందిన క్లాస్‌-1 కాంట్రాక్టర్‌ ఒకరు తెలిపారు. గుంటూరు, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థలతో సహా తెనాలి, పొన్నూరు, సత్తెనపల్లి, బాపట్ల, రేపల్లె, నరసరావుపేట, చిలకలూరిపేట, మాచర్ల, వినుకొండ, పిడుగురాళ్ల అన్ని మున్సిపాల్టీల్లో నిధులకు కటకట ఏర్పడింది. దీంతో కమిషనర్లు, పాలకులు ప్రస్తుతం ఆస్తి పన్ను వసూళ్లకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. తరచూ బిల్‌ కలెక్టర్లు, ఆర్వోలతో సమావేశాలు పెడుతూ పన్ను వసూళ్లకు లక్ష్యాలు విధిస్తున్నారు. వాస్తవంగా ఆస్తిపన్ను ఏకమొత్తంలో ఒకేసారి చెల్లింపులు చేసి 5 శాతం పన్ను రాయితీ పొందటానికి ఏప్రిల్‌లోనే అవకాశం ఇస్తారు. అప్పుడు చెల్లించనివారు మొదటి ఆర్నెల్ల పన్నులు చెల్లించటానికి తుది గడువు సెప్టెంబరులో గడువిస్తారు. అప్పుడు చెల్లించని వారు వడ్డీతో సహా మార్చిలోపు చెల్లిస్తారు. అయితే ప్రస్తుతం రోజువారీ, వారానికి, పది హేనురోజులకు లక్ష్యాలు విధించి ప్రతి అధికారిని వసూళ్ల లక్ష్యాలు అధిగమించాల్సిందేనని పట్టుబడుతున్నారని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. నగరపాలకలో గతంలో ఎప్పుడు చూసినా రిజర్వు ఫండ్స్‌ బాగా ఉండేవి.


అత్యవసర పనులే...

నిధుల సమస్యతో ప్రస్తుతం పట్టణాల్లో అత్యవసర పనులు తప్ప మిగిలినవి నిర్వహించడం లేదు. ఇటీవల గుంటూరు నగరం తూర్పు నియోజకవర్గంలో ఆక్రమణలు తొలగించడానికి దళం బండిని పంపాలని కోరితే దానికి ఇంధనం లేదని 2గంటలు ఆలస్యంగా పంపారు. మరోవైపు పెట్రోలు బంకులకు భారీగా బకాయిలు పేరుకుపోవడంతో వారు వెంటనే ఇంధనం పోయడం లేదు. ఇలాంటి సమస్యలు అన్ని పురపాలికల్లో ఉన్నాయని తెలుస్తోంది. చాలా వరకు సాధారణ నిధులు ఖర్చయిపోవడంతో ప్రస్తుతం ఆస్తి పన్నుల ఆదాయంతోనే రోజువారీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని పురపాలక కమిషనర్‌ ఒకరు తెలిపారు. దీంతో అత్యవసర పనులు మినహా మిగిలిన వాటి జోలికి వెళ్లడం లేదన్నారు. ‘అన్నిచోట్లా ఇదే పరిస్థితి ఉంది. ఉన్న నిధులు పాత బకాయిలకు సర్దుబాటు చేయటం.. మరోవైపు కేంద్ర, రాష్ట్రాల నుంచి గ్రాంట్లు తగ్గడంతో పురపాలికల్లో ఏ అభివృద్ధి పనులు చేపట్టాలన్నా తొలుత నిధుల కోసం వెతుక్కోవాల్సి వస్తోందని’ పురపాలికల్లో నెలకొన్న పరిస్థితిని ఆయన వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని