డీఎడ్‌ నాలుగో విడత కౌన్సెలింగ్‌
eenadu telugu news
Published : 27/09/2021 03:15 IST

డీఎడ్‌ నాలుగో విడత కౌన్సెలింగ్‌

అంగలూరు( గుడ్లవల్లేరు), న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ డైట్‌ కళాశాలల్లో డీఎడ్‌ 2020-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం చివరి కౌన్సెలింగ్‌ ప్రక్రియను ఆదివారం చేపట్టారు. విద్యార్థులకు సీట్ల కేటాయింపు కోసం గతేడాది డిసెంబరులో ఒక సారి కౌన్సెలింగ్‌ నిర్వహించి నాలుగు నెలలపాటు ప్రత్యక్షంగా, తర్వాత ఆన్‌లైన్‌ విద్యాబోధన జరిగింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్‌ డైట్‌ కళాశాలలను ప్రభుత్వం రద్దు చేయడంతో ఆ కళాశాలలకు చెందిన విద్యార్థులకు ప్రస్తుతం మళ్లీ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. వాస్తవంగా ఏ విద్యాసంవత్సరానికైనా మూడు కౌన్సెలింగ్‌లతో ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా నేడు నాలుగో విడత నిర్వహించడం గమనార్హం. అలాగే నెలలో పూర్తికావాల్సిన కౌన్సెలింగ్‌ను రెండు నెలలుగా నిర్వహిస్తున్నారు. వివిధ ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 725 ప్రైవేట్‌ డైట్‌ కళాశాల్లో 650 కళాశాలలను ప్రభుత్వం రద్దు చేసింది(కృష్ణా జిల్లాలో 30 కళాశాలల్లో 25 రద్దు చేశారు). కేవలం 75 మాత్రమే మిగిలాయి. రద్దయిన కళాశాలలకు చెందిన విద్యార్థులను మిగిలిన 75 ప్రైవేట్‌, 14 ప్రభుత్వ డైట్‌లలో చేర్చేందుకు కసరత్తు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ డైట్‌లలో ప్రస్తుతం ఉన్న 100 సీట్లకు అదనంగా 50 సీట్లను పెంచింది. రద్దయిన కళాశాలల్లోని విద్యార్థులకు, ఇతర విద్యార్థులకు స్లైడింగ్‌(కళాశాలల మార్పు) సీట్ల సర్దుబాటును చేసి ఆగస్టులో 1, 2 విడతల కౌన్సెలింగ్‌ జరిపారు. సెప్టెంబరులో మూడోది చేశారు. చివరిగా శనివారం నుంచి ఈ నెల 29 వరకూ షెడ్యూల్‌ ఇచ్చారు. కృష్ణా జిల్లాకు ఆదివారం కౌన్సెలింగ్‌ తేదీ ఇవ్వగా కేటాయించిన 15 మందిలో 10 మంది వచ్చి ధ్రువీకరణపత్రాలు పరిశీలన చేయించుకొని సీట్ల కేటాయింపు పత్రాలను అందుకున్నారు. ప్రిన్సిపల్‌ లక్ష్మీనారాయణ, సీనియర్‌ అధ్యాపకులు వినయ్‌కుమార్‌ పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని