ప్రదర్శనశాల.. ఖ్యాతి తగ్గించేలా..!
eenadu telugu news
Published : 27/09/2021 03:15 IST

ప్రదర్శనశాల.. ఖ్యాతి తగ్గించేలా..!

ప్రాంగణంలో ప్రైవేటు ఎగ్జిబిషన్ల స్టాళ్లు

ఈనాడు, అమరావతి

 


మ్యూజియం ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాళ్లు (పాతచిత్రం)

విజయవాడలోని బందరు రోడ్డులో ఉన్న ప్రతిష్ఠాత్మకమైన బాపూ మ్యూజియం విలువను తగ్గించేలా అధికారుల చర్యలు ఉంటున్నాయి. అత్యంత విలువైన పురాతన వస్తు సంపద ఉన్న ప్రాంగణంలో ప్రైవేటు ఎగ్జిబిషన్‌ స్టాళ్లను ఏర్పాటు చేయడానికి అనుమతి ఇస్తున్నారు. దుస్తులు, చేనేత, పింగాణీ కప్పులు, ఇతర వస్తువులు, బజ్జీ స్టాళ్లను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తున్నారు. పురాతన వారసత్వ కట్టడం, అధునాతన నూతన భవనం ముందు, చుట్టూ అంతా ఈ దుకాణ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా ఈ నెల 19తో ఒక ప్రదర్శన ముగిసింది. ప్రస్తుతం మళ్లీ మరో ప్రదర్శన ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇచ్చే ప్రక్రియ నడుస్తున్నట్లు సమాచారం. విలువ కట్టలేనంత ప్రాచీన సంపదకు నిలయమైన మ్యూజియం ప్రాంగణంలో ఇలాంటి ప్రైవేటు ప్రదర్శనలు ఏర్పాటు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విక్టోరియా మ్యూజియం పేరును గత ప్రభుత్వ హయాంలో బాపూ గుర్తుగా ఆయన పేరును పెట్టారు. మ్యూజియంలో ఒకటో శతాబ్దం నుంచి 19వ శతాబ్దం మధ్యలోని విలువైన వస్తు సంపద కొలువుదీరి ఉంది. ఆదిమానవులు వినియోగించిన వస్తువుల నుంచి రెడ్డి రాజుల కాలంలోని ఆయుధాలు, నాణేలు, బౌద్ధ, ఇతర దేవతా విగ్రహాలు అనేకం ఉన్నాయి. వీటన్నింటినీ పరిరక్షించేందుకు రూ.కోట్లు ఖర్చు పెట్టి అధునాతన భవనాన్ని నిర్మించారు. ఆ భవనంలో వస్తు సంపదకు ఆధునిక హంగులను అద్దారు. ఒకప్పుడు విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించే కేంద్రంగా ఉన్న మ్యూజియాన్ని దాదాపు పదేళ్లు మూసేశారు. పాత భవనం మరమ్మతులు, కొత్త భవనం నిర్మించేందుకు సుదీర్ఘ సమయం తీసుకున్నారు. ఎట్టకేలకు మ్యూజియం అన్ని హంగులతో అందుబాటులోకి వచ్చినా దానిని ఓ అపురూప సంపదగా భావించి.. భావితరాలకు విజ్ఞానాన్ని అందించే కేంద్రంగా చూడకుండా.. ఆదాయం కోసం ప్రైవేటు స్టాళ్లను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నారు.

రూ.13 కోట్ల వరకు ఖర్చుపెట్టి..

రాష్ట్ర విభజన తర్వాత రూ.5 కోట్లతో నూతన భవనాన్ని మ్యూజియం ప్రాంగణంలో నిర్మించారు. అధునాతనంగా భవన నిర్మాణం పూర్తయ్యాక లోపల వస్తువుల ప్రదర్శన, ఇతర ఆధునిక సాంకేతికతను జోడించడానికి మరో రూ.8 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. వేల ఏళ్ల క్రితం వాడిన వస్తువులు కూడా మ్యూజియం ప్రాంగణంలో ఉన్నాయి. పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించిన స్థలం ఇది. అందుకే మ్యూజియంలో ఉన్న వస్తు సంపదకు ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ(ఏఆర్‌)ని జోడించారు. స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని.. మ్యూజియంలోని ఆయా వస్తువులను స్కాన్‌ చేస్తే.. వెంటనే ఆ వస్తువు ఏ కాలానికి చెందినవి, వాటి ప్రాధాన్యత ఏంటనేవి వాటికి అవే చెప్పుకునేలా ఏర్పాటు చేశారు. ఇవన్నీ పూర్తి చేయడానికి కనీసం ఐదారేళ్లకు పైగా సమయం పట్టింది. అంతకుముందు కూడా చాలాకాలం మ్యూజియం మూసేసి ఉంచారు. పాత వారసత్వ కట్టడం శిథిలావస్థకు రావడంతో దాని మరమ్మతుల కోసం మూసేశారు. ఈ పనులన్నీ పూర్తవ్వడంతో 2020లో ముఖ్యమంత్రి జగన్‌ అట్టహాసంగా మ్యూజియంను ప్రారంభించారు.


జనానికి అవగాహన పెంచకే..

మ్యూజియంను అద్భుతంగా తీర్చిదిద్దినప్పటికీ దానిని ప్రజలకు చేరువ చేయడంలో అధికారులు విఫలమయ్యారు. అపురూప సంపదకు నిలయమైన మ్యూజియంను ప్రస్తుతం రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్లకు ఎగ్జిబిషన్లను పెట్టుకునేందుకు అప్పగిస్తున్నారు. లోపల ఏర్పాటు చేసే స్టాళ్ల వల్ల మ్యూజియం ప్రాంగణం ఓ వాణిజ్య సముదాయంగా మారిపోతోంది. ఈ స్టాళ్లకు ఇబ్బంది లేకుండా మ్యూజియం టిక్కెట్‌ కౌంటర్‌ను కూడా గేటు దగ్గర నుంచి తీసుకెళ్లి.. కొత్త భవనం వద్ద ఏర్పాటు చేశారు. గతంలో మ్యూజియం ప్రాంగణంలోకి అడుగుపెట్టాలంటే టిక్కెట్‌ తీసుకుని వెళ్లేవారు. కానీ ఇప్పుడు లోపల ఉన్న భవనం వద్దకు మార్చేశారు. ప్రస్తుతం జనానికి ఎగ్జిబిషన్ల హడావుడే తప్ప మ్యూజియం కనిపించే పరిస్థితి లేదు. ఒకవేళ ఎవరైనా వెళ్లాలన్నా స్టాళ్లను దాటి వెళ్లి మ్యూజియం చూడాలి. రాత్రి సమయంలోనూ ఈ స్టాళ్లకు చెందిన వాళ్లు మ్యూజియం ప్రాంగణంలోని తమ దుకాణాల్లోనే ఉంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పురాతన వస్తు సంపద ఉన్న మ్యూజియంను ప్రజలకు వైజ్ఞానిక ప్రదర్శన కేంద్రానికి చేరువ చేసేందుకు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని