అధికారం ఉంది.. ఆదాయమే లేదు..!
eenadu telugu news
Published : 27/09/2021 03:15 IST

అధికారం ఉంది.. ఆదాయమే లేదు..!

జడ్పీ కొత్త పాలకవర్గానికి సవాళ్లు ఎన్నో..

ఈనాడు, అమరావతి

ఈ చిత్రం పరిశీలించారా..! ఇది జిల్లా పరిషత్తు ప్రధాన రహదారి తీరు. ఏడాదిగా ఈ రహదారిపై తట్ట మట్టి పోసిన సందర్భం లేదు. కంకిపాడు నుంచి గుడవర్రు వెళ్లే ఈ రహదారి జిల్లా పరిషత్తు నిర్వహణలో ఉంది. పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి స్థానికులు ఎన్నిసార్లు వినతలు ఇచ్చినా ఒకటే సమాధానం నిధులు లేవ్‌..!

-ఇదే కాదు జిల్లాలో దాదాపు 2వేల కి.మీ రోడ్ల పరిస్థితి ఇంచుమించుగా ఇలాగే ఉంది. ఈ రోడ్లపై జనాలు వెన్నుపూసలు ఇరగదీసుకుంటున్నారు.

సొంత ఆదాయం అంతంతమాత్రమే. రాష్ట్రం నుంచి అందే నిధులు, గ్రాంట్లు లేవు. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఒక్కటే. వాటితోనే జిల్లా సమగ్ర అభివృద్ధి అంటే మిధే! ప్రస్తుతం జిల్లా పరిషత్తు కొత్త పాలక వర్గం కొలువుదీరింది. జిల్లా పరిషత్తు అంటే.. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి ముడిపడి ఉంటుందని భావిస్తారు. రాష్ట్రంలో ఎన్ని మంత్రిత్వ శాఖలు ఉన్నాయో.. అన్నింటిపై జిల్లా పరిషత్తుకు హక్కులు ఉన్నాయి. కానీ నిధులే లేవు. చట్ట ప్రకారం రావాల్సిన నిధులు రాక చతికిల పడుతోంది. ఇక జడ్పీటీసీల పదవులు అలంకారప్రాయంగానే మారనున్నాయి. జడ్పీ ఛైర్మన్‌ పదవి రాష్ట్ర మంత్రి (కేబినెట్‌ హోదా) ప్రొటోకాల్‌తో సమానం. కేవలం మర్యాదకు మాత్రమే. ప్రజల సమస్యల పరిష్కారానికి మాత్రం అంతంతే అన్నట్లు ఉంది.

సాధారణ నిధులే..!

జిల్లా పరిషత్తుకు సాధారణ నిధులే దిక్కు. ఇవి కూడా కార్యాలయాల నిర్వహణ, ఇతరత్రా ఖర్చులకు సరిపోతున్నాయి. కృష్ణా జిల్లా పరిషత్తుకు ఏడాదికి సాధారణ నిధులు రూ.10కోట్ల వరకు ఉన్నాయి. వీటితోనే నిర్వహణ, తాగునీటి పథకాల నిర్వహణ, జిల్లా పరిషత్తు రహదారుల నిర్వహణ, పాఠశాలలకు నిధులు కేటాయించాల్సి ఉంది. ఇవి కాకుండా 15వ ఆర్థిక సంఘం నిధులు అందుతున్నాయి. రాష్ట్రం నుంచి రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు అందాల్సి ఉంది. రెండేళ్లుగా ఇవి అందడం లేదు. ఏడాదికి కనీసం రూ.200 కోట్లు వరకు అందాల్సి ఉందని చెబుతున్నారు. నరేగా నిధులు కేంద్రం నుంచి వచ్చినా జడ్పీతో సంబంధం లేకుండానే ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే. జడ్పీ పాఠశాలలకు నరేగా నిధులు కేటాయించి నాడు-నేడు పనులు చేస్తున్నారు. తాగునీటి పథకాలు పంచాయతీల నిర్వహణలో ఉంటాయి. సీపీడూబ్ల్యూఎస్‌ఎస్‌లు జిల్లా పరిషత్తు నిర్వహణలో పని చేస్తాయి. వీటికి సక్రమంగా నిధులు అందడం లేదు. నిధులే లేనప్పుడు బాధ్యతలు ఎలా..? కానీ జిల్లా పరిషత్తుకు ప్రజల ప్రతి సమస్యను తీర్చాల్సిన బాధ్యత ఉంది. జడ్పీ పాఠశాలలతో పాటు, వైద్యం, గ్రామీణ రహదారుల నిర్మాణం నిర్వహణ, తాగునీరు, సాగునీరు వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లోనూ బాధ్యతలు ఉన్నాయి. నిధుల లేమితో చతికిల పడ్డాయి. అన్ని శాఖల ప్రగతిని సమీక్షించే అధికారం జడ్పీ పాలక వర్గానికి ఉంది.

రాష్ట్ర ఖజానాకే.. సాధారణంగా జిల్లా పరిషత్తులకు స్థానిక ఆదాయం గనుల సీనరేజి. సహజ వనరుల ద్వారా లభించే సీనరేజి జిల్లా పరిషత్తులకే లభిస్తుంది. పంచాయతీలకు 50శాతం, మండల పరిషత్తులకు 25 శాతం, జిల్లా పరిషత్తులకు 25 శాతం ఇవ్వాల్సి ఉంది. గతంలో జడ్పీ ఇసుక రేవులకు వేలం నిర్వహించేది. వీటిని ప్రభుత్వాలు లాక్కొన్నాయి. స్థానిక సంస్థలకు జడ్పీకి సీనరేజి మాటే లేదు. ఒక్క ఇసుక మీద జిల్లా జడ్పీకి రూ.50 కోట్ల ఆదాయం ఏడాదికి వచ్చేది. ప్రస్తుతం లేకుండా పోయింది. ఇతర గనుల సీనరేజీ లభించడం లేదు. కొంత శాతం జిల్లా మినరల్‌ ఫండ్‌ పేరుతో కలెక్టర్‌ ఖాతాకు వెళుతోంది. ప్రధానంగా నిధులు ఉంటే.. గ్రామీణ రహదారుల నిర్వహణ సులభతరంగా ఉండేది. గతంలో ఆర్‌ఆర్‌ఎం నిధులు అందేవి. అవీ రావడం లేదు. ఏదైనా ఎస్సీ, ఎస్టీ కాంపొనెంట్‌ నిధులు వచ్చినా ప్రత్యేకంగా కలెక్టర్‌ ఆదేశాలతో వాటిని ఆయా ప్రాంతాల్లో ఖర్చు చేస్తున్నారు. జిల్లాలో దాదాపు 2వేల కి.మీ రహదారులు దారుణంగా తయారయ్యాయి. వీటిని అత్యవసరంగా మరమ్మతులు చేయాల్సి ఉంది. తాగునీటి పథకాలు పూర్తి చేసి ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్‌ నెరవేర్చాల్సి ఉంది. గ్రామాల్లో పారిశుద్ధ్యం దారుణంగా తయారైంది.


ఆస్తులు అన్యాక్రాంతం..

జిల్లా పరిషత్తు ఆస్తులు చాలా వరకు అన్యాక్రాంతం అయ్యాయి. విజయవాడ నగరంలోనే పలు ఆస్తులు ధారాదత్తం చేశారు. గత పాలక వర్గంలో ఆస్తులను గుర్తించి వెబ్‌ల్యాండ్‌లో చేర్పించారు. గతంలో పాఠశాలలకు, ఇతర ప్రజా అవసరాల కోసం జిల్లా పరిషత్తుకు విరాళంగా ఇచ్చిన ఆస్తులను సైతం వెనక్కి తీసుకుంటున్నారు. వాటి విలువ పెరగడంతో వాటికి అడ్డం తిరుగుతున్నారు. తమ పూర్వీకులకు సంబంధించిన ఆస్తులుగా వ్యాజ్యాలు వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఆస్తులు సైతం పోకుండా కాపాడాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా జడ్పీ పాఠశాలలకు దాతలు ఇచ్చిన ఎకరాల కొద్ది స్థలాలు అన్యాక్రాంతానికి గురవుతున్నాయి. ప్రస్తుతం కొత్తపాలక వర్గం ముందు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంత పెద్దమొత్తంలో గ్రాంట్లు, ప్రత్యేక నిధులు సాధించుకుంటేనే అంత ప్రగతి సాధ్యమవుతుంది. లేకపోతే సాధారణ నిధులతో జడ్పీ నిర్వహణ భారంగా మారనుంది.


రూ.100 కోట్లతో అభివృద్ది: గద్దె అనురాధ, జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్‌

మా హయాంలో ప్రత్యేకంగా రూ.100 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేశాం. రోడ్లు వేశాం. అంగన్‌వాడీ భవనాల నిర్మాణం చేశాం. మహిళా చైతన్య కార్యక్రమాలు చేపట్టాం. జడ్పీకి ఎంతో అవకాశం ఉంది. వాటిని అందిపుచ్చుకుని జిల్లా సమగ్ర అభివృద్ధికి రూపకల్పన చేయాల్సి ఉంది. మా హయాంలో 14వ ఆర్థిక సంఘం నిధులు బాగా అందాయి. వాటిని సద్వినియోగం చేశాం. వైద్య కార్యక్రమాల్లోనూ చొరవ తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు తెచ్చుకుంటే అభివృద్ధి అంతగా చేయవచ్ఛు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని