విహారం.. వినోదం
eenadu telugu news
Published : 27/09/2021 04:04 IST

విహారం.. వినోదం

నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం

అమరావతి పరిసరాల్లో ఎన్నో పర్యాటక స్థలాలు.. ప్రభుత్వం దృష్టిసారిస్తే ప్రయోజనం

భవానీపురం, న్యూస్‌టుడే

పర్యాటకులను ఆకర్షించే ఎన్నో సుందరమైన ప్రదేశాలు అమరావతి ప్రాంతంలో నెలకొన్నాయి. టెంపుల్‌, బీచ్‌, ఎకో టూరిజం, ఇలా...అనేక విధాలుగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదు. అడపాదడపా ప్రజాప్రతినిధులు వచ్చి పర్యాటకరంగం అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పి వెళ్లిపోతున్నారు తప్పితే క్షేత్ర స్థాయిలో ఆ దిశగా అడుగులు పడడం లేదు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తే వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి అమరావతికి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగి, ఈ రంగం ప్రగతికి దోహదపడే అవకాశముంది.


సహజ సిద్ధ భవానీ ద్వీపం

కృష్ణానది మధ్యలో సహజసిద్ధంగా ఏర్పడిన భవానీద్వీపాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు గతంలో నిర్ణయించారు. ఇందుకోసం భవానీ ఐలాండ్‌ టూరిజం కార్పొరేషన్‌(బీఐటీసీ)ని ఏర్పాటు చేశారు. దీంతో పాటు కృష్ణానది మధ్యలో ఉన్న మరికొన్ని ద్వీపాలను కలిపి అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. సింగపూర్‌ ప్రతినిధులు ఈ ద్వీపాలను చూసి.. ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక్కడ రూ.12 కోట్లతో మ్యూజికల్‌ ఫౌంటేన్‌ నిర్మాణాన్ని గత ప్రభుత్వ హయాంలో చేపట్టారు. రెండేళ్లగా వచ్చిన వరదలకు అది మూలనపడింది. దానిని ఎవరూ పట్టించుకోవడం లేదు.


అమరావతి టూరిజం సర్య్కూట్‌ ఎక్కడ...?

అమరావతి

అమరావతి పరిధిలోని పర్యాటక ప్రదేశాలను కలుపుతూ వాటిని అభివృద్ధి చేసే ప్రణాళికలను గత ప్రభుత్వ హయాంలో చేపట్టారు. ఆయా ప్రాంతాలను నిధులను కేటాయించి వాటి ప్రాశస్థ్యాన్ని వెలుగులోకి తీసుకురావాలనేది ముఖ్య ఉద్దేశం. అమరావతికి దేశ, విదేశీ పర్యాటకులను రప్పించేందుకు ప్రణాళికలు జరిగాయి. ఆ ప్రదేశాలను తిలకించేలా ప్రత్యేక ప్యాకేజీలను సైతం రూపకల్పన చేయాలని భావించారు. ప్రస్తుతం ఆ ప్రతిపాదనల ఊసే కనిపించడం లేదు.


ఆలయ పర్యాటకానికి అవకాశం...

అమరావతి పరిధిలో ప్రముఖమైన ఆలయాలు అనేకం ఉన్నాయి. వాటన్నింటినీ కలుపుకుని టెంపుల్‌ టూరిజంగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంది. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. అలాగే మంగళగిరిలో పానకాల స్వామి ఆలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. మోపిదేవి, పరిటాల ఆంజనేయస్వామి ఆలయం, అమరావతి అమరలింగేశ్వరస్వామి ఆలయం, ఇలా.. అనేకం ఉన్నాయి.


ప్యాకేజీలు ఏవి?

గాంధీ కొండ

స్థానికంగా ఉండే ప్రదేశాలు కొండపల్లి కోట, మంగళగిరి ఆలయం, అమరావతి ప్రాంతాలను తిలకించేలా ప్యాకేజీలు ప్రవేశపెట్టినా కొన్నాళ్లకే మూలనపడ్డాయి. అలాగే విజయవాడ-తిరుమల ఆలయాన్ని తిలకించేలా ఒక ప్యాకేజీ రూపొందించినా కొన్నాళ్లకే ఆపేశారు. సరైన ప్రచారం చేయకపోవటంతో ఏపీటీడీసీ ప్రవేశపెట్టే ప్యాకేజీలు ఏవీ ప్రజలకు చేరని పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిపెట్టి, పర్యాటకానికి వైభవం తీసుకురావాల్సిన అవసరముంది.


ఎన్నో ప్రదేశాలు...

కొల్లేరు

పర్యాటకులను ఆకర్షించే మచిలీపట్నం, సూర్యలంక బీచ్‌లు, కొల్లేరు సరస్సు ఉన్నాయి. ఆయా చోట్ల సదుపాయాలు పెంచాల్సిన అవసరముంది. అలాగే ఆటపాక, ఉప్పలపాడు పక్షుల కేంద్రాలపై దృష్టి సారిస్తే మరింత మంది పర్యాటకులు వస్తారు. మడ అడవులు, ఇబ్రహీంపట్నం పరిధిలోని అడవుల్లో ట్రెక్కింగ్‌కు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కొండపల్లి కోటకు మరిన్ని సొబగులు అద్దాలి. కొండవీడు కోటకు వెళ్లే మార్గం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఉండవల్లి గుహలు, అమరావతిలోని బుద్ధుడి విగ్రహం, బౌద్ధస్తూపాలు, నాగార్జున సాగర్‌, ఎత్తిపోతల జలపాతం వద్ద అభివృద్ధి పనులు చేపడితే ఎక్కువ మంది వెళ్లి తిలకించేందుకు వీలుంటుంది.

బందరు బీచ్‌

కొండవీడు


ఆ ప్రాజెక్టులు పట్టాలెక్కితే..

ఎత్తిపోతల

పర్యాటక రంగం అభివృద్ధికి ఎన్నో ప్రాజెక్టులను గతంలో రూపకల్పన చేశారు. అవన్నీ కూడా దాదాపుగా బుట్టదాఖలయ్యాయి. నీటిపై బోటు మాదిరిగా, రోడ్డుపై బస్సులా వెళ్లే వాహనాన్ని రప్పించేందుకు ప్రయత్నాలు జరిగాయి. ప్రయోగాత్మకంగా పరిశీలన కూడా చేశారు. ప్రకాశం బ్యారేజీ ఎగువన పున్నమిఘాట్‌ వద్ద నుంచి కాకినాడ, విశాఖపట్నం వెళ్లేలా సీప్లేన్‌లో విహారం చేసేలా కూడా ప్రయత్నాలు చేశారు. నేటికీ కార్యరూపం దాల్చలేదు. ప్రభుత్వ, ప్రైవేటు బోట్లను కృష్ణానదిపై తిప్పేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వ సాగరమాల ప్రాజెక్టు నిధులు రూ.6 కోట్లతో భవానీఘాట్‌ వద్ద జెట్టీ నిర్మాణ పనులను ప్రారంభించినా పనులు ముందుకు సాగని పరిస్థితి.


ఇటు ఉపాధి.. అటు ఆదాయం

సూర్యలంకలో కాటేజీలు

సింగపూర్‌, మలేషియా, దుబాయ్‌, తదితర దేశాలకు పర్యాటక రంగమే కీలకం. మన దేశంలోని గోవా, కేరళ, కశ్మీర్‌, ఆగ్రా, తదితర ప్రాంతాలకు వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. తద్వారా స్థానికంగా ప్రభుత్వానికి ఆదాయం రావటంతో పాటు రెస్టారెంట్‌లు, రవాణా, తదితర మార్గాల ద్వారా ఎంతో మందికి ఉపాధి పొందేందుకు వీలుంటుంది. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తే ఆదాయంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యే అవకాశం ఉంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని