చిన్నారి ఆచూకీ లభ్యం
eenadu telugu news
Published : 27/09/2021 04:04 IST

చిన్నారి ఆచూకీ లభ్యం


శిశువును తల్లిదండ్రులకు అప్పగిస్తున్న ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌

మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: జిల్లా ఆస్పత్రి నుంచి అపహరణకు గురైన ఆరు రోజుల శిశువు ఆచూకీ లభించింది. ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ పోలీస్‌ సిబ్బందిని అప్రమత్తం చేయడంతో సంఘటన జరిగిన 24 గంటలలోపే చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. హిందూజ అనే మహిళ ఆరు రోజుల క్రితం జిల్లా ఆస్పత్రిలో ఆడశిశువుకు జన్మనివ్వగా శనివారం మధ్యాహ్నం ఓ గుర్తుతెలియని మహిళ చిన్నారిని అపహరించుకువెళ్లిన విషయం తెలిసిందే. ఫిర్యాదు అందిన వెంటనే ఎస్పీ బిడ్డ ఆచూకీ కనిపెట్టేందుకు 12 ప్రత్యేక బృందాలను నియమించారు. ఆస్పత్రి సీసీ కెమెరాలో నమోదైన అనుమానితురాలి ఫొటోలను సిబ్బందికి వాట్సాప్‌ గ్రూపుల ద్వారా పంపి ఎక్కడికక్కడ దర్యాప్తు నిర్వహించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం కృత్తివెన్ను మండలంలో బిడ్డ ఆచూకీ తెలియడంతో నిందితురాలైన మేరీని అదుపులోకి తీసుకుని చిన్నారిని ఆమె నుంచి తీసుకున్నారు. అనంతరం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ చేతుల మీదగా శిశువును తల్లిదండ్రులకు అప్పగించారు.

ఆ ఇరువురి చొరవే కీలకం

కృతివెన్ను పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా పోలీస్‌ శిరీష సెల్‌కు వాట్సాప్‌ ద్వారా వచ్చిన అనుమానితురాలి ఫొటో చూసిన వెంటనే ఆమె తన పరిధిలో ఉన్న వాలంటీర్లకు పంపి సమాచారం తెలిస్తే తెలియజేయాలని సూచించారు. మునిపెడ గ్రామానికి చెందిన వాలంటీరు శిరీష అనుమానితురాలిని గుర్తించడంతో మహిళా పోలీసు పై అధికారులకు తెలపడంతో నిందితురాలైన మేరీని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు శిరీషలను ఎస్పీ అభినందించి సత్కరించారు. దర్యాప్తులో పాల్గొన్న సిబ్బందికి నగదు రివార్డు ప్రకటించారు. ఆడపిల్లపై మమకారంతోనే మేరీ బిడ్డను అపహరించినట్లు భావిస్తున్నారు. బిడ్డ అపహరణకు సంబంధించిన కారణాలపై విచారణ చేస్తున్నామని, నిందితురాలిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని