సమాజ వికాసానికి కళలు దోహదం
eenadu telugu news
Published : 27/09/2021 04:04 IST

సమాజ వికాసానికి కళలు దోహదం

కేబీఎన్‌ కళాశాలలో శాస్త్రీయ, జానపద, కోలాట ఉత్సవాలు


కరగం నృత్య ప్రదర్శనలో విద్యార్థినులు

చిట్టినగర్‌, న్యూస్‌టుడే: భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు కళలు పెట్టింది పేరని, పల్లెల్లో.. పొలాల్లో.. శ్రమను మరిచిపోయి హాయిగా పనులు చేసుకునేందుకు పాడుకునే జన పదాలే శాస్త్రీయ నృత్యాలకు మూలాలుగా ఉన్నాయని, సమాజ వికాసానికి కళలు ఎంతో దోహదపడతాయని ఎంబీ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి పిన్నమనేని మురళీకృష్ణ అన్నారు. తెలుగు భాషకు, సామాజిక వికాసానికి అండగా నిలిచిన మహాకవులు గుర్రం జాషువా, చిలకమర్తి లక్ష్మీనరసింహం జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని నిర్వహించిన శాస్త్రీయ, జానపద, కోలాట ఉత్సవాలను కేబీఎన్‌ కళాశాల కార్యదర్శి తూనుగుంట్ల శ్రీనివాస్‌ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ జానపద కళలను ఆదరించాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్సవాలను శ్రీనటరాజ రామకృష్ణ ఆర్ట్స్‌ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు పిళ్లా ఉమామహేశ్వరపాత్రుడు పర్యవేక్షించారు. విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యాలు, కోలాటం అబ్బురపరిచాయి. కరగం, లంబాడీ నృత్యం, ఆడొత్తా జానకి, మందులోడా, దుష్టశక్తులను అంతమొందించిన దుర్గమ్మను కొలుస్తూ, అన్నమయ్య కీర్తనలకు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు అలరించాయి. రిషిత డాన్స్‌ అండ్‌ యాక్టింగ్‌ స్టూడియో విద్యార్థులు పుచ్చలపల్లి సుందరయ్య జీవిత చరిత్రను తెలిపే బుర్రకథ, జానపద నృత్యరూపకం ఆహుతులను ఆకట్టుకుంది. నగరంలోని 300 మంది కళాకారులు, కోలాట భజన బృందాలు ఈ ఉత్సవాల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు ప్రశంసాపత్రాలు, జ్హాపికలు అందించారు. ప్రదర్శనలను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు తిలకించారు. పొట్టి శ్రీరాముల ఇంజినీరింగ్‌ కళాశాల అధ్యక్షుడు, అమరావతి బాలోత్సవ్‌ గౌరవాధ్యక్షుడు చలవాది మల్లికార్జునరావు, జాషువా సాంస్కృతిక వేదిక కన్వీనర్‌ గాదె సుబ్బారెడ్డి, ప్రిన్సిపల్‌ వి.నారాయణరావు, ఆంధ్రనాటక కళాసమితి అధ్యక్షుడు నన్నపనేని నాగేశ్వరరావు, జి.నారాయణరావు, ఐజాక్‌ న్యూటన్‌, సుమధుర కళానికేతన్‌ నిర్వాహకులు భాస్కర్‌శర్మ పాల్గొన్నారు. ఉత్సవాలకు చంద్రిక వ్యాఖ్యాతగా వ్యవహరించారు.


విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు, జ్ఞాపికలు అందించిన అతిథులు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని