సేవ స్ఫూర్తికి పురస్కారం
eenadu telugu news
Published : 27/09/2021 04:04 IST

సేవ స్ఫూర్తికి పురస్కారం

రాష్ట్రపతి రజత పతకం సాధించిన అశోక్‌రెడ్డి

మైలవరం, న్యూస్‌టుడే


వర్చువల్‌ సమావేశంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, చిత్రంలో అశోక్‌రెడ్డి తదితరులు

ఒక వైపు పాఠాలు బోధిస్తూనే... మరో వైపు విద్యార్థులను సేవ వైపు మళ్లించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారా అధ్యాపకుడు. పలుగు... పార పట్టుకొని పని చేయడానికైనా, రక్తదానానికైనా, మొక్కలు నాటేందుకైనా, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించేందుకైనా మేము సిద్ధం అనేలా విద్యార్థుల్లో సేవా స్ఫూర్తిని రగిలించారు. 12 ఏళ్లుగా అందించిన సేవలకు గుర్తింపుగా రాష్ట్రపతి నుంచి రజత పతకం పొందారు. ఆయనే మైలవరంలోని లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) అధికారి డాక్టర్‌ పాములపాటి అశోక్‌రెడ్ఢి


4వ ర్యాంకు

2019-20 సంవత్సరానికి చేపట్టిన సేవా కార్యక్రమాలకు గాను ఈ ఏడాది జనవరిలో రాష్ట్ర ప్రభుత్వ అవార్డు సాధించారు. గత మూడేళ్లలో చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతిష్ఠాత్మక రాష్ట్రపతి అవార్డు కైవసం చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా మొత్తం 41,442 ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్లు ఉండగా, అందులో పది అత్యుత్తమ యూనిట్లకు అవార్డులు ప్రకటించారు. అందులో నాలుగో స్థానాన్ని సాధించి రాష్ట్రపతి నుంచి రజత పతకంతో పాటు రూ.1.5 లక్షల నగదు రివార్డు, కళాశాలకు రూ.2 లక్షల నగదు రివార్డు సాధించి పెట్టారు. రాష్ట్రపతి అవార్డునకు ఆరు అంశాల్లో నిర్వహించిన కార్యక్రమాలే ప్రాతిపదికగా నిలిచాయి. 24 స్వచ్ఛభారత్‌ కార్యక్రమాలు, 1315 రక్తదాన శిబిరాలు, 5,315 మొక్కలు నాటడం, పంచడం, 37 ఉచిత వైద్య శిబిరాలతో పాటు, సామాజిక అంశాలపై అవగాహన సదస్సులు, ప్రదర్శనలు నిర్వహించడం ద్వారా ఈ ఘనత సాధించారు.


2009 నుంచి..

2006లో ఎంసీఏ విభాగంలో బోధన వృత్తిలో చేరిన అశోక్‌రెడ్డికి 2009లో ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ బాధ్యతలు అప్పగించారు. ఆ విధులను భారంగా కాకుండా బాధ్యతగా భావించారు. పాఠాలు చెబుతూనే విద్యార్థులను సామాజిక సేవా కార్యక్రమాల వైపు మళ్లించేందుకు కృషి చేశారు. మొక్కలు నాటించడం మొదలు, పల్స్‌పోలియో కార్యక్రమాల వరకు సేవలందించి అందని మన్ననలు పొందారు. 2011లో జిల్లా స్థాయి బెస్ట్‌ సర్వీస్‌ అవార్డు, 2012, 2019 సంవత్సరాల్లో యూనివర్శిటీ స్థాయి అవార్డు, 2015, 2017ల్లో ఫ్లాగ్‌ బేరర్‌ అవార్డులను సాధించారు.


ఏడు వేల మందిని చేర్పించా..

12 సంవత్సరాలుగా యాజమాన్యం సహకారంతో నిరంతరాయంగా విద్యార్థులతో చేయిస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో తృప్తినిస్తున్నాయి. గ్రామాలను ద్వారా దత్తత తీసుకొని చేపట్టిన సామాజికాంశాలు పేదలకు ఎంతోగానో ఉపయోగపడ్డాయి. నేను బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి దాదాపు 7 వేల మందిని ఎన్‌ఎస్‌ఎస్‌లో చేర్చాను. వారందరితో సేవా కార్యక్రమాలు చేయించాను. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తాను.

- పి.అశోక్‌రెడ్డి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని