క్యాన్సర్‌ మందుల కొరతపై డీఎంఈ ఆరా
eenadu telugu news
Published : 23/10/2021 06:02 IST

క్యాన్సర్‌ మందుల కొరతపై డీఎంఈ ఆరా

యుద్ధ ప్రాతిపదికన ఇండెంట్‌ స్వీకరణ

ఈనాడు, అమరావతి: గుంటూరు జీజీహెచ్‌లో క్యాన్సర్‌ మందుల కొరతపై ఉన్నత స్థాయిలో కదలిక వచ్చింది. రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు(డీఎంఈ) ఆచార్య ఎం.రాఘవేంద్రరావు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌తో మాట్లాడి ఏం మందులు అవసరమో ఆ వివరాలతో కూడిన ఇండెంట్‌ తనకు పంపాలని ఆదేశించారు. స్పందించిన ఆసుపత్రి పర్యవేక్షకురాలు ఆచార్య నీలం ప్రభావతి క్యాన్సర్‌ విభాగానికి కావాల్సిన మందుల వివరాలు తెప్పించుకుని డీఎంఈకి ఆన్‌లైన్‌లో ఇండెంట్‌ దస్త్రం పంపారు. శుక్రవారం ‘ఈనాడు’లో‘మందులివ్వండి.. మహాప్రభో..!’ శీర్షికన ప్రచురితమైన కథనానికి డీఎంఈతో పాటు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌, గుంటూరు జిల్లా పాలనాధికారి వివేక్‌ యాదవ్‌లు స్పందించి ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడారు. కీమోథెరపీ ఔషధాలు, ఇంజెక్షన్లతో పాటు బ్రెస్ట్‌, బ్లడ్‌ క్యాన్సర్‌ నివారణకు అవసరమైన మందులు లేవని 17 రకాల ఔషధాలు, ఇంజెక్షన్లతో కూడిన జాబితాను డీఎంఈకి పంపి వాటిని సరఫరా చేయాలని సూపరింటెండెంట్‌ కోరారు. ఆసుపత్రి నుంచి ఇండెంట్‌ వచ్చిందే తడవుగా డీఎంఈ వెంటనే ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీకి దాన్ని పంపి ఇతర ఆసుపత్రుల్లో ఎక్కడైనా ఉంటే సర్దుబాటు చేయండి లేదా ప్రొక్యూర్‌ చేసి సరఫరా చేయటమో చేయాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సరఫరా చేయాల్సిన 3, 4వ త్రైమాసిక బడ్జెట్‌ మందులను సరఫరా చేయాలని కోరారు. ఇటీవల రోగులు సైతం సూపరింటెండెంట్‌ను కలిసి మందులు లేకపోవటం వల్ల తమకు రేడియేషన్‌, కీమోథెరఫీకి నోచుకోవటం లేదని కలిసి కోరారు. మొత్తంగా పేద రోగులకు మందులు సరఫరా చేసే విషయంలో చోటుచేసుకుంటున్న జాప్యంపై ‘ఈనాడు-ఈటీవీ’లో ప్రసారమైన కథనంతో ఉన్నతస్థాయిలో స్పందించటంతో రెండు, మూడు రోజుల్లో మందుల కొరతకు పరిష్కారం లభించనుందని ఆసుపత్రి వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని