ఢీకొట్టి.. 50 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లి..
eenadu telugu news
Published : 23/10/2021 06:02 IST

ఢీకొట్టి.. 50 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లి..

రైతును బలిగొన్న ఆర్టీసీ బస్సు

మరకా ఆంజనేయులు (పాత చిత్రం)

భట్టిప్రోలు, న్యూస్‌టుడే: అప్పటివరకూ ఆయన కుటుంబసభ్యులతో ఆనందంగా గడిపారు. అనంతరం తన ద్విచక్రవాహనంపై దుకాణానికి తాపీగా వెళ్తున్న ఆయన్ను ఎదురుగా ఆర్టీసీబస్సు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు కసిగా కబళించింది. అచ్చం సినిమాలో జరిగినట్టు ఆయన్ను 50 మీటర్ల దూరానికి పైగా ఈడ్చుకెళ్లి, రోడ్డు మార్జిన్లో నిలిపిన ఓ ట్రాక్టర్‌ను ఢీకొట్టి ఆగిపోయింది. ఆ వేగానికి ఆయన శరీరం పక్కనే నిలిపిఉంచిన ట్రాక్టర్‌ దమ్ము చక్రాలపై పడి ఇరుక్కుపోయింది. ఈ ప్రమాద దృశ్యాన్ని చూసినవారు బస్సు వేగాన్ని తలచుకొని నోరెళ్లబెడుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని ఐలవరం గ్రామానికి చెందిన మరకా ఆంజనేయులు(35) గ్రామంలో వ్యవసాయం   చేస్తుంటారు. అలాగే చెరుకుపల్లిలో ఆటోమొబైల్‌ దుకాణాన్ని కూడా నడుపుతున్నారు. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి అల్పాహారం తీసుకున్న ఆయన మధ్యాహ్న భోజనం వెంట తీసుకొని ద్విచక్ర వాహనంపై దుకాణానికి బయల్దేరారు. మార్గంమధ్యలో తాను వేసిన పైర్లను ఓసారి పరిశీలించి, సాగు విషయాలపై సమీప రైతులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం దుకాణానికి బయలుదేరిన ఆయన్ను ఎదురుగా చీరాల నుంచి రేపల్లెకు వెళ్తున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. ద్విచక్ర వాహనంతో పాటు ఆంజనేయులునూ 50 మీటర్లకు పైగా దూరం ఈడ్చుకెళ్లి, రోడ్డు మార్జిన్‌లో ఉన్న ఓ ట్రాక్టర్‌ను ఢీకొని ఆగింది. బస్సు వేగానికి  వాహనంపై ఉన్న ఆంజనేయులు పక్కనే ఉన్న దమ్ము చక్రాల్లోకి ఎగిరిపడి, ఇరుక్కుపోయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. రహదారి పక్కనే నిలిపి ఉన్న మరో ద్విచక్ర వాహనం కూడా ధ్వంసమైంది. అక్కడ ట్రాక్టర్‌ లేకపోయినట్టైతే బస్సు చెట్టును ఢీకొనేదని, అప్పుడు డ్రైవరుతో పాటు బస్సులో ఉన్న ప్రయాణికులూ గాయపడేవారని చూసిన అనేక మంది వ్యాఖ్యానించారు. చనిపోయిన ఆంజనేయులుకు  భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఎస్సై శామ్యూల్‌ రాజీవ్‌కుమార్‌ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బస్సు డ్రైవరు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.


ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని