విత్తన లోపం.. మిర్చి రైతుకు శాపం
eenadu telugu news
Published : 23/10/2021 06:02 IST

విత్తన లోపం.. మిర్చి రైతుకు శాపం

పెదకూరపాడు, న్యూస్‌టుడే

వాతావరణంలో మార్పులు, విత్తన లోపంతో ప్రారంభంలోనే మిర్చి పంటకు తెగుళ్లు ఆశించాయని, విత్తన కంపెనీ ప్రతినిధులను నిలదీసినా ప్రయోజనం లేకపోయిందని, అధికారులు చొరవ తీసుకుని నష్ట పరిహారం ఇప్పించాలని రైతులు వేడుకుంటున్నారు. పెదకూరపాడు, అబ్బరాజుపాలెం, బుచ్చయపాలెం, లగడపాడు, 75త్యాళ్లూరు, గారపాడు, కాశిపాడు, తమ్మవరం, బలుసుపాడు గ్రామాల్లో 3,700 హెక్టార్లలో మిర్చి సాగు చేశారు. ప్రముఖ కంపెనీకి చెందిన విత్తనాలను డీలర్ల వద్ద కొనుగోలు చేశారు. మొక్కలు నాటి 60 రోజులు గడుస్తున్నా ఎదుగుదల సక్రమంగా లేకపోవడం, బొబ్బర వైరస్‌ సోకి పెరిగిన మొక్కకు పూత, పిందె రాకపోవడంతో నిండా మునిగిపోయామని గ్రహించారు. 20 రోజుల్లోనే మొక్కలు వాడు ముఖం పట్టి పొలమంతా వైరస్‌ వ్యాపించి ఎండిపోతున్నాయి. ఎన్ని రకాల మందులు పిచికారీ చేసినా ప్రయోజనం కనిపించకపోవడంతో తొలగిస్తున్నారు. విత్తన కంపెనీపై చర్యలు తీసుకుని పరిహారం ఇప్పించాలంటూ పెదకూరపాడు పోలీసుస్టేషన్‌లో శుక్రవారం పలువురు రైతులు ఫిర్యాదు చేశారు.


పెట్టుబడి వ్యయం అందించాలి
ఈ ఏడాది మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని మిర్చి సాగు చేశా. కౌలు రూ.20 వేలు చెల్లించా. నారు నాటడం, నాగళ్లు, కలుపు, వ్యవసాయం, ఎరువు, పురుగు మందుల కోసం ఇప్పటికి ఎకరానికి రూ. 50 వేలు ఖర్చు అయింది. నకిలీ విత్తనాలు అంటగట్టడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. సమీపంలోని పొలాలన్నింటికీ వైరస్‌ సోకింది. వాటిని తొలగించడం తప్ప వేరే దారి కనిపించడం లేదు. మూడేళ్లుగా వ్యవసాయం కలిసి రావడం లేదు. ఇప్పటికి రూ. ఐదు లక్షలకు పైగా అప్పు చేశా. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పెట్టబడి వ్యయాన్ని అందించాలి.

- నల్లపనేని శరత్‌, రైతు, అబ్బరాజుపాలెం


నమ్మి కొన్నాం..నష్టపోయాం
ప్రముఖ కంపెనీ మిరప విత్తన రకం తెగుళ్లను తట్టుకుని అధిక దిగుబడులు అందిస్తుందని తెలిసి రెండు ఎకరాల్లో సాగు చేశాను. ఎకరానికి రూ.50 వేల వరకు ఖర్చు అయింది. ఎన్ని మందులు పిచికారీ చేసినా బొబ్బర అదుపులోకి రాలేదు. దిక్కు తోచని స్థితిలో పంటను తొలగిస్తున్నాం. రూ.లక్షకు పైగా పెట్టుబడి కోసం అప్పుగా తీసుకొచ్చా. విత్తన కంపెనీపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలి.

- ఉన్నవ మోహనరావు, రైతు, పెదకూరపాడు


పరిశీలించి చర్యలు తీసుకుంటాం
పెదకూరపాడు, అబ్బరాజుపాలెం, హుస్సేన్‌నగరం, లగడపాడు గ్రామాలకు చెందిన రైతుల ఫిర్యాదు మేరకు సిబ్బందితో కలిసి మిర్చి పొలాలను పరిశీలించాం. జెమిని వైరస్‌ ఎక్కువగా సోకినట్లు గుర్తించాం. సమగ్ర వివరాలతో జేడీఏ కార్యాలయానికి నివేదిక పంపుతాం. శాస్త్రవేత్తల బృందంతో ఆయా పొలాలను పరిశీలింపజేసి వారి సూచనల మేరకు చర్యలు తీసుకుంటాం. 

- ఇంజం శాంతి, మండల వ్యవసాయాధికారి, పెదకూరపాడు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని