మేం దాడి చేయాలనుకుంటే మరోలా ఉండేది
eenadu telugu news
Updated : 23/10/2021 23:48 IST

మేం దాడి చేయాలనుకుంటే మరోలా ఉండేది

జనాగ్రహ దీక్షలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, మల్లికార్జునపేట: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని పట్టుకుని ఒకటికి నాలుగుసార్లు తెదేపా అధికార ప్రతినిధి అసభ్య పదజాలంతో దూషిస్తే ఆయన అభిమానులు స్పందించారు. తెదేపా కార్యాలయంపై దాడి చేయాలనుకుని ముఖ్యమంత్రి అనుకున్నా.. లేదా మా స్థాయిలో నలుగురైదుగురు ఎమ్మెల్యేలు అనుకుంటే పదిమంది మాత్రమే వెళతారా? అప్పుడు పరిస్థితి వేరేలా ఉంటుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యంలో అలాంటి పోకడలు వద్దనుకున్నాం. ప్రజాక్షేత్రంలోనే తాము పోరాడతామని స్పష్టం చేశారు. గుంటూరులో శుక్రవారం రెండోరోజూ జరుగుతున్న జనాగ్రహ దీక్షకు హాజరైన ఆయన చంద్రబాబుపై ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి వాడిన పదానికి బాగున్నారా? అని అర్థం ఉందని చెబుతున్నారు. అలా అయితే ఇంట్లో పిల్లలను, రేపు దిల్లీ వెళ్లి హోంమంత్రి అమిత్‌షా, ప్రధానమంత్రి నరేంద్రమోదీని అలాగే పిలుస్తారా? అని ప్రశ్నించారు. దేవాలయం అని చెప్పుకుంటున్న తెదేపా కార్యాలయంలో అసభ్య పదజాలం మాట్లాడితే ఎందుకు వారిపై చర్యలు తీసుకోలేదని నిలదీశారు. ముఖ్యమంత్రిని తిడుతుంటే పొరపాటు అయిందని చెప్పకపోగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్‌ చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తితే ఎక్కడైనా రాష్ట్రపతి పాలన పెడతారా? రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలితే అప్పుడు రాష్ట్రపతి పాలనపై ఆలోచించాలి. బాధ్యత కలిగిన చంద్రబాబు ఇక్కడ గొడవలు సృష్టించి రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్‌ చేయడం సమంజసమేనా? అని ప్రశ్నించారు. ప్రజలు అసహ్యంచుకునే పదాలు వాడిన రాజకీయ పార్టీలను సాంఘిక బహిష్కరణ చేయాలా? వద్దా? అన్న విషయం తేల్చాలి. ఇలాంటి పార్టీలకు రాజకీయ తెర మీద అవకాశం ఉండకూడదు. ప్రజలతో ఎన్నికై ముఖ్యమంత్రి తిట్టించుకోవడానికి వచ్చారా? అని ప్రశ్నించారు. పట్టాభి మాట్లాడిన మాటలపై మహిళల్లో చర్చ జరగాలన్నారు. అధికారదాహంతో చంద్రబాబు కొట్టుమిట్టాడుతున్నారని అందులో భాగంగానే రెండురోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు అని చెప్పారు. చంద్రబాబు ప్రణాళికలో భాగంగానే పట్టాభి మాట్లాడారని ఆరోపించారు. అలాంటి పదాలు మాట్లాడే హక్కు కోసం చంద్రబాబు దీక్ష చేస్తున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. రాజకీయాలు, ఎత్తుగడలు, వ్యూహాలు పక్కన పెడితే మనిషి అన్న వారికి కనీస సంస్కారం ఉండాలా? వద్దా? అనే ప్రశ్న అందరిలో ఉత్పన్నమైందని, దానికి సమాధానం కావాలన్నారు. రోజంతా అరలీటరు నీరు తాగి చంద్రబాబు ఉండగలరా? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి, ఎమ్మెల్యేలు మద్దాళిగిరి, ముస్తఫా, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్‌, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌, నగర మేయర్‌ మనోహర్‌నాయుడు, డీసీసీబీ ఛైర్మన్‌ సీతారామాంజనేయులు, పలువురు నేతలు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని