అంతా కుమ్మక్కు
eenadu telugu news
Published : 23/10/2021 06:17 IST

అంతా కుమ్మక్కు

చేతులు కలిపిన బ్యాంకు మేనేజర్లు, ముఠావివరాలు వెల్లడిస్తున్న డీసీపీ హర్షవర్దన్‌రాజు. చిత్రంలో సీసీఎస్‌ ఏసీపీ శ్రీనివాస్‌

ఈనాడు - అమరావతి: ప్రభుత్వ రంగ సంస్థలైన ఏపీ ఆయిల్‌ఫెడ్‌, ఏపీ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ (గిడ్డంగుల సంస్థ)లకు చెందిన ఎఫ్‌డీల కుంభకోణంలో ఇద్దరు నిందితులు అరెస్టు అయ్యారు. రూ. 14.6 కోట్ల సొమ్ము గోల్‌మాల్‌పై విజయవాడ సీసీఎస్‌ పోలీసులు భవానీపురంలోని ఐవోబీకి చెందిన అప్పటి మేనేజరు సందీప్‌, నగరానికి చెందిన యోహానురాజును అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి రూ. 11.60 లక్షలు, రెండు మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. కుంభకోణానికి సంబంధించి వివిధ బ్యాంకు ఖాతాల్లోని రూ. 77.74 లక్షలను పోలీసులు స్తంభింపజేశారు. ఈ వ్యవహారంలో మొత్తం 11 మంది ప్రమేయం ఉందని తేలింది. వీరిలో ఏడుగురిని హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు తెలుగు అకాడమీ కుంభకోణంలో అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరు జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు. వీరిని పీటీ వారెంట్‌పై నగరానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నిందితులను కూడా విచారిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ కుంభకోణం మొత్తానికి సూత్రధారి సాయికుమార్‌. తాజాగా.. నగర పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు మదన్‌, అప్పటి సప్తగిరి గ్రామీణ బ్యాంకు మేనేజరు వెంకటరామిరెడ్డిలు పరారీలో ఉన్నారు. వీరి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. నిందితుల అరెస్టు, గోల్‌మాల్‌ జరిగిన తీరుపై శుక్రవారం నాడు నగర తూర్పు మండల డీసీపీ హర్షవర్దన్‌రాజు, సీసీఎస్‌ ఏసీపీ కొల్లి శ్రీనివాస్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో వివరాలను వెల్లడించారు. వీరి కథనం మేరకు.రి హైదరాబాద్‌కు చెందిన నండూరి వెంకటరమణ, ఆర్‌ఎంపీ వైద్యుడు అయిన డా. రాజేష్‌లు విజయవాడ నగరానికి చెందిన యోహాను రాజును కలిశారు. యోహానురాజుకు మందుల దుకాణం ఉంది. ఇతనికి బ్యాంకర్లతో పరిచయాలు ఉంది. వారితో పాలసీలు చేస్తుంటాడు. విజయవాడలోని ఏదొక బ్యాంకు మేనేజరును పరిచయం చేయమని వీరు అడిగారు. ఈ ప్రయత్నంలో భవానీపురంలోని ఐండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు మేనేజరు సందీప్‌ను కలిశారు. ఆ సమయంలో కుంభకోణ గురించి మాట్లాడుకున్నారు. అన్ని బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ ఇస్తున్నట్లు లేఖ ఇవ్వమని అడిగారు. ఆ లేఖను తీసుకుని గిడ్డంగుల సంస్థ ఉన్నతాధికారులను కలిశారు. భవానీపురం ఐవోబీ శాఖలో ఎఫ్‌డీ చేయమని, తద్వారా అధిక వడ్డీ వస్తుందని చెప్పారు. ప్రణాళికలో భాగంగా గిడ్డంగుల సంస్థ పేరున నకిలీ కరెంటు ఖాతాను తెరించారు. ఇందుకు గాను నకిలీ గుర్తింపు కార్డు, ఆధార్‌ కార్డును ఉపయోగించారు.

* గిడ్డంగుల సంస్థ ఉన్నత అధికారులు ఇచ్చిన లేఖతో పాటు రూ. 9.6 కోట్లకు సంబంధించి మూడు చెక్కులను తీసుకున్నారు. వీటిల్లో రూ. 2.9 కోట్లు మాత్రమే ఎఫ్‌డీ చేసి, మిగిలిన రూ. 6.7 కోట్ల మొత్తాన్ని నకిలీ ఖాతాలో వేశారు. తర్వాత.. నకిలీ అథీకృత లేఖలతో ఎఫ్‌డీని గడువు తీరకుండానే రద్దు చేసి, ఐవోబీ, ఏపీ మర్కంటైల్‌ క్రెడిట్‌ సొసైటీలోని బోగస్‌ ఖాతాలకు మళ్లించారు. ఈ సొసైటీని నగరానికి చెందిన సత్యనారాయణ ప్రారంభించారు. ఇతన్ని హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. రూ. 6.7 కోట్ల సొమ్మును వివిధ హవాలా ఖాతాలకు తరలించి ముఠా సభ్యులు పంచుకున్నారు.

* ఇదే తరహాలో యోహాను రాజు.. వీరపనేనిగూడెంలోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు మేనేజరు వెంకటరామిరెడ్డిని ముఠా సభ్యులకు పరిచయం చేశారు. అక్కడ కూడా మేనేజరు నుంచి అధిక వడ్డీ ఇస్తామని నకిలీ కొటేషన్లను తీసుకుని, ఆయిల్‌ఫెడ్‌ ఉన్నతాధికారులను కలిశారు. వారి నుంచి లేఖలతో పాటు రూ. 5 కోట్ల మొత్తానికి ఎఫ్‌డీల కోసం మూడు చెక్కులు ఇచ్చారు. వీటిని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారు. కానీ.. అసలు బాండ్లను తమ వద్ద ఉంచుకుని, నకిలీవి ఆయిల్‌ఫెడ్‌ అధికారులకు అందజేశారు. ఆయిల్‌ఫెడ్‌ పేరుతో సత్యనారాయణ సాయంతో కోస్టల్‌ లోకల్‌ ఏరియా బ్యాంకులో నకిలీ కరెంటు ఖాతాలను తెరిచారు. నకిలీ లేఖలతో ఎఫ్‌డీ ఖాతాలను రద్దు చేసి, బోగస్‌ ఖాతాలకు మళ్లించారు.

* మొత్తం కుంభకోణంలో సూత్రధారి అయిన సాయికుమార్‌ 2009లో కోల్‌ ఫీల్డ్స్‌కు సంబంధించి భారీ మోసం చేశాడు. అప్పటి నుంచి వెంకటరమణ, వెంకటేష్‌ అలియాస్‌ రాజేష్‌, యోహానురాజు పరిచయం అయ్యారు. ఆ తర్వాత మదన్‌, పద్మన్‌, కృష్ణారెడ్డి అనే వారు సాయికుమార్‌కు పరిచయం. సోమశేఖర్‌ అలియాస్‌ రాజ్‌కుమార్‌, వెంకటేశ్వరరావు అలియాస్‌ రాజేష్‌ వీరు కార్పొరేషన్ల వద్దకు వెళ్లి చెక్కులు తీసుకురావడం, వాటిని ఖాతాల్లో డిపాజిట్‌ చేశారు. పద్మన్‌ అలియాస్‌ పద్మనాభన్‌, మదన్‌, కృష్ణారెడ్డి ఫోర్జరీ సంతకాలు, పత్రాలు సృష్టించారు. ప్రస్తుతం సంస్థల ఉద్యోగలు పాత్ర గురించి ఆధారాలు వెల్లడి కాలేదు. ఈ గోల్‌మాల్‌లో బ్యాంకు మేనేజర్లు కీలకంగా వ్యవహరించారు. అథీకృత లేఖలు, నకిలీ ఆధారాలతో ఖాతాలను తెరవడంలో క్రియాశీలక పాత్ర పోషించారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని