Eatala Rajendar: చిత్తశుద్ధి ఉంటే నోటిఫికేషన్‌కు ముందే హామీలు అమలు చేయాలి: ఈటల
eenadu telugu news
Updated : 05/08/2021 16:47 IST

Eatala Rajendar: చిత్తశుద్ధి ఉంటే నోటిఫికేషన్‌కు ముందే హామీలు అమలు చేయాలి: ఈటల

 

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉద్యమకారులంతా కనుమరుగవుతూ తెలంగాణ ద్రోహులంతా తెరపైకి వచ్చారని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ అన్నారు. మానుకోటలో ఓదార్పు యాత్ర సమయంలో ఉద్యమకారులపై రాళ్లదాడి చేసిన వ్యక్తికి ప్రాధాన్యం కల్పించారని ఆక్షేపించారు. రాళ్లదాడి చేసిన కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా నియమించారన్నారు. ఈ విషయంపై తనతో కలసి పనిచేసిన ప్రతి ఉద్యమకారులు ఆలోచించాలని కోరారు. అనారోగ్యం నుంచి కోలుకుని అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన అనంతరం ఈటల మీడియా సమావేశం నిర్వహించారు. తనకు మెరుగైన వైద్యం అందించారంటూ అపోలో యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

నోటిఫికేషన్‌కు ముందే హామీలు అమలు చేయాలి

గత ఎన్నికల్లో తనను ఓడించేందుకు ప్రయత్నించారని ఈటల పునరుద్ఘాటించారు. త్వరలో జరగనున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో గెలిచేందుకు సీఎం కేసీఆర్‌ వేల కోట్ల రూపాయలను నమ్ముకున్నారని ఆరోపించారు. ఒక్కో నాయకుడికి ఖరీదు కట్టి కొనుగోళ్ల పర్వానికి తెరలేపారన్నారు. ఇప్పటికే హుజూరాబాద్‌ నియోజకవర్గంలో రూ.150కోట్లను నగదు రూపంలో ఖర్చు చేశారన్నారు. ‘‘హుజూరాబాద్‌ ఉప ఎన్నికతోనే కేసీఆర్‌కు హామీలు గుర్తొచ్చాయి. అందుకోసమే కేసీఆర్‌ తాయిలాలు ప్రకటిస్తున్నారు. నిరుద్యోగభృతిని తక్షణమే అమలు చేయాలి. గత ఏడేళ్లలో ఏనాడూ అంబేడ్కర్‌కు కేసీఆర్‌ దండవేయలేదు. దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్‌.. ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చి తీసేశారు. దళిత కుటుంబాలకు రూ.10లక్షలు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాను. రాష్ట్రంలోని అన్ని దళిత కుటుంబాలకు దాన్ని వర్తింపజేయాలి. ఆర్థికంగా వెనుకబడిన వాళ్లను సైతం ఆదుకోవాలి. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల నోటిఫికేషన్‌ రాకముందే ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. హుజూరాబాద్‌ ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేస్తా. నేను డ్రామాలు ఆడేవాడిని కాదు.. సీరియస్‌ రాజకీయ నాయకుడిని. డ్రామాలు ఆడుతున్నానంటూ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. వైద్యుల సూచన మేరకు రెండు మూడు రోజుల తర్వాత పాదయాత్ర పునఃప్రారంభిస్తా’’ అని ఈటల చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని