కౌంటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తికావాలి
eenadu telugu news
Published : 19/09/2021 01:44 IST

కౌంటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తికావాలి


అధికారులకు సూచనలిస్తున్న ఎస్పీ కౌశల్‌

మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: జిల్లాలో పరిషత్తు ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్‌ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయం నుంచి శనివారం అధికారులతో వీసీ ద్వారా మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరం మేరకు సిబ్బందిని నియమించుకోవాలన్నారు. ఏ చిన్న సమస్య తలెత్తే అవకాశం ఉన్నా ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా బాధ్యులను అదుపులోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలు ఎవరూ రహదారులు, కూడళ్లలో గుమిగూడకుండా చూడాలన్నారు. అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ఠ బందోబస్తు నిర్వహించాలని చెప్పారు.  

ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ
ప్రతిరోజూ స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా వివిధ ప్రాంతాల నుంచి జిల్లా పోలీస్‌ కార్యాలయానికి వచ్చినవారి నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. గుడివాడకు చెందిన ఓ వివాహిత తనకు పదేళ్ల క్రితం వివాహం అయిందని, అప్పుడు ఇచ్చిన కట్నం చాలదంటూ ఇప్పుడు అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని, రక్షణ కల్పించాలని కోరారు. కైకలూరు ప్రాంతానికి చెందిన తన చేపల చెరువులను నమ్మకస్థుడని భావించి ఓ వ్యక్తికి లీజుకు ఇచ్చానని, లీజు డబ్బులు అడుగుతుంటే చంపుతానంటూ బెదిరిస్తున్నాడని ఒకరు ఫిర్యాదు చేశారు. పలువురు తమ వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోరుతూ ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించి చట్టపరంగా వారికి తగు న్యాయం చేయాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు.   


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని