తియ్యని మాటలతో బురిడీ
eenadu telugu news
Published : 19/09/2021 01:44 IST

తియ్యని మాటలతో బురిడీ

రూ.లక్షల్లో మోసాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్‌


నిందితుడు విద్యాసాగర్‌

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : ‘నేను మాజీ ఐపీఎస్‌ అధికారిని. డీఆర్‌డీఓకు చెందిన వ్యవహారాలు పర్యవేక్షిస్తుంటా. గ్రూప్‌-1 ఉద్యోగాల నియామకాల్లో కీలక పాత్ర పోషిస్తా. అదృష్టం కలిగించే రైస్‌ పుల్లింగ్‌ కాయిన్‌లు విక్రయిస్తా. బేషుగ్గా నన్ను నమ్మొచ్చు..’ అంటూ తీయని మాటలతో అర చేతిలో వైకుంఠం చూపించేస్తాడు. ఇలా.. అమాయకులను లక్ష్యంగా చేసుకుని రూ.లక్షల్లో మోసాలకు పాల్పడుతున్న నిందితుడు విద్యాసాగర్‌ (35)ను ఎట్టకేలకు విజయవాడ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళితే... నూజివీడుకు చెందిన గట్టిగుండె విద్యాసాగర్‌   బి.ఎ. చదివాడు. విజయవాడలో కొంతకాలం ప్రింటింగ్‌ ప్రెస్‌ నడిపాడు. కొన్నాళ్లు తణుకులో ఉండి, తిరిగి నూజివీడుకు వచ్చేశాడు. సులువుగా డబ్బు సంపాదించాలన్న లక్ష్యంతో మోసాలకు తెరలేపాడు. తాను ఐపీఎస్‌ అధికారినని, వి.ఆర్‌.ఎస్‌. తీసుకున్నానని అందరికీ చెప్పేవాడు. డీఆర్‌డీవోలో తనకు పరిచయాలు ఉన్నాయని, గ్రూప్‌-1 ఉద్యోగాల నియామకాల్లో కీలకపాత్ర తనదేనంటూ.. తియ్యగా మాటలు చెప్పి నమ్మించేవాడు. ఇతడి మాటలు నమ్మిన ఒక మహిళా న్యాయవాది తన ఇద్దరు పిల్లల ఉద్యోగాల కోసం రూ.65లక్షలు చెల్లించారు. ఉద్యోగాలు రాకపోవడం, అతడు సరైన సమాధానం చెప్పకపోవటంతో మోసపోయినట్లు గ్రహించిన న్యాయవాది పోలీసులను ఆశ్రయించారు. 
విచారణలో విస్తుబోయే నిజాలు.. పోలీసుల విచారణలో విస్తుబోయే నిజాలు వెలుగుచూశాయి. విద్యాసాగర్‌.. 2019లో దిల్లీకి చెందిన ఒక వ్యాపారవేత్తకు అరుదైన కుక్క పిల్ల ఇస్తానంటూ రూ.17.5లక్షలు వసూలు చేసి, పత్తా లేకుండా పోయాడు. విశాఖపట్నంకు చెందిన ఒక వ్యక్తికి రైస్‌ పుల్లింగ్‌ కాయిన్‌ ఇప్పిస్తానంటూ రూ.15 లక్షలు తీసుకున్నాడు. విజయవాడలో మహిళా న్యాయవాదిని ఉద్యోగాల పేరిట నమ్మించి రూ.65లక్షలు వసూలు చేశాడు. ఇతడిపై వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో 2014లో నకిలీ పత్రాలు ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేసినట్లు కేసు నమోదైంది. మహిళా న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడిని విజయవాడలో గుర్తించి పట్టుకున్నారు. ఒక్కడే ఇలా మోసాలు చేస్తున్నాడా? లేక అతడి వెనుక మరెవరైనా ఉన్నారా? అనే అంశంపై పోలీసులు దృష్టి పెట్టారు. మాటలతో బురిడీ కొట్టించే ఇలాంటి వారిని నమ్మవద్దని, ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని వస్తే వారి వివరాలను తెలియజేయాలని పోలీసులు సూచిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని