జంగారెడ్డిగూడెంలో వ్యాపారి హత్య
eenadu telugu news
Published : 19/09/2021 01:44 IST

జంగారెడ్డిగూడెంలో వ్యాపారి హత్య

ప్రియురాలితో సన్నిహితంగా ఉంటున్నాడని కక్షతో ఘాతుకం


కందుకూరి సురేష్‌ప్రభు (మృతుడు)

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: తన ప్రియురాలితో సన్నిహితంగా ఉంటున్నాడన్న కక్షతో ఆమె ప్రియుడు ఓ వ్యక్తిని విచక్షణ రహితంగా నరికి చంపిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ.సత్యనారాయణ కథనం ప్రకారం.. విస్సన్నపేటకు చెందిన కందుకూరి సురేష్‌ప్రభు (47) పట్టణంలోని బోసుబొమ్మ కూడలిలో పాలడెయిరీ నిర్వహిస్తున్నారు. ఈయన కుటుంబం గంగానమ్మగుడి ప్రాంతంలో నివాసం ఉంటోంది. స్థానికంగా ఓ మహిళతో సన్నిహితంగా ఉంటున్నారు. దీంతో ఈ మహిళ తనను నిర్లక్ష్యం చేస్తోందని యానాంకు చెందిన ఈమె ప్రియుడు చిరంజీవి కక్ష పెంచుకున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి 1.45 గంటల సమయంలో మునసబుగారి వీధిలో సురేష్‌ప్రభు ద్విచక్రవాహనంపై మహిళను ఆమె ఇంటి వద్ద దించారు. పథకం ప్రకారం అప్పటికే అక్కడ మాటు వేసిన చిరంజీవి తొలుత మహిళపై దాడి చేయడంతో ఆమె స్వల్పంగా గాయపడింది. పారిపోతున్న సురేష్‌ ప్రభును వెంటాడి కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న సురేష్‌ప్రభును స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ్నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తరలించగా శనివారం ఉదయం మృతి చెందారు. ఘటన స్థలాన్ని డీఎస్పీ రవికిరణ్‌, సీఐ గౌరీశంకర్‌ సందర్శించారు. సురేష్‌ ప్రభు భార్య ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన సీసీటీవీ పుటేజ్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని