ఓటరుగా నమోదు చేసుకోండి
eenadu telugu news
Published : 28/10/2021 02:19 IST

ఓటరుగా నమోదు చేసుకోండి

ర్యాలీలో ఆర్డీవో ఖాజావలి, తహసీల్దార్‌ సునాల్‌బాబు, తదితరులు

మచిలీపట్నం(కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆర్డీవో ఖాజావలి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాలు, జిల్లా కలెక్టర్‌ సూచనల మేరకు బుధవారం ఎస్‌వీఈఈపీ(సిస్టమాటిక్‌ ఓటర్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎలక్ట్టోరల్‌ పార్టిసిపేషన్‌)లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించేలా వివిధ శాఖల ఉద్యోగుల ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ నవంబరు 1నుంచి ప్రారంభమయ్యే ఓటరు జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవడంతోపాటు ఓటు విలువ, దాని ఆవశ్యకతలపై విస్తృత అవగాహన ఏర్పరుచుకోవాలన్నారు. ఓటరుగా నమోదు చేయించుకోవాలనుకునే వారు సమీపంలోని బూత్‌ స్థాయి అధికారి, తహసీల్దార్‌ కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించారు. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండుతున్న వారందరూ ఓటరుగా నమోదు కావొచ్చని తెలిపారు. చిరునామా, పేర్లలో తప్పొప్పులుంటే సవరించుకునేందుకు భారత ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందన్నారు. ఫారం-6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు, ఫారం-7 ద్వారా మార్పులు, చేర్పులు, ఫారం-8 ద్వారా పోలింగ్‌బూత్‌ల మార్పు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లోకి వెళ్లి సంబంధిత దరఖాస్తులను పూర్తిచేయవచ్చన్నారు. ఇందుకు అవసరమైన ఆధార్‌, జనన ధ్రువీకరణపత్రం, పదో తరగతి సర్టిఫికెట్‌ జిరాక్స్‌ కాపీ, రెండు పాస్‌పోర్టులు స్కాన్‌ చేసి అప్‌లోడ్‌ చేయాలన్నారు. ఆ ప్రక్రియ పూర్తయ్యాక పత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకుని సంబంధిత తహసీల్దార్‌ కార్యాలయంలోని ఎన్నికల విభాగంలో అందజేయాలని సూచించారు. బూత్‌ లెవల్‌ అధికారి విచారణ నిర్వహించిన అనంతరం ఓటు గుర్తింపు కార్డును మీసేవ కేంద్రాల ద్వారా పొందవచ్చన్నారు. తహసీల్దార్‌ సునీల్‌బాబు, డీటీ సౌజన్య కిరణ్మయి, మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలోని ఎన్నికల సంఘ ఉద్యోగులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, సచివాలయాల సిబ్బంది ర్యాలీ పాల్గొని మానవహారంగా ఏర్పడ్డారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని