భళా బాలికా..
eenadu telugu news
Published : 28/10/2021 02:19 IST

భళా బాలికా..

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే : ఆరోగ్యం, పోషణ, జీవనవిధానంపై అవగాహన కల్పించేందుకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా బాలికలకు పోటీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పాఠశాల, మండల, డివిజన్‌ స్థాయిల్లో నిర్వహించి విజేతలను ఎంపిక చేశారు. పలువురు వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం పోటీల్లో ప్రథమస్థానంలో నిలిచి తోటివిద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

చిత్రలేఖనం అంటే ఇష్టం

నాకు చిత్రలేఖనం అంటే చాలా ఇష్టం. నా ఆకాంక్షను గుర్తించిన ఉపాధ్యాయులు ప్రోత్సహించడంతో వివిధ సందర్భాల్లో నిర్వహించిన పోటీల్లో పాల్గొని పలు బహుమతులు అందుకున్నాను. బాలికల సంరక్షణపై జిల్లా విద్యాశాఖ నిర్వహించిన పోటీల్లో పాల్గొని డివిజన్‌స్థాయిలో ప్రథమస్థానంలో నిలవడం ఎంతో సంతోషంగా ఉంది. గతంలో కూడా పలు పురస్కారాలు అందుకున్నా ఇది ప్రత్యేకమైనది. బాలికలు గర్భంలో ఉన్న దగ్గరనుంచి వివిధ దశల్లో ఎదుర్కొనే ఇబ్బందులు, బాలికలపై జరిగే దాడులను అరికట్టేందుకు అందుబాటులోకి వచ్చిన చట్టాల గురించి తెలియజేసేలా చిత్రాన్ని తీర్చిదిద్దాను. ఆచిత్రం చూసి న్యాయనిర్ణేతలు ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాస్థాయిలో కూడా బహుమతి సాధిస్తానన్న నమ్మకం ఉంది. గూడూరు జడ్పీఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్న నేను స్కౌట్‌అండ్‌గైడ్స్‌లో శిక్షణ తీసుకుంటున్నాను. యోగా, క్రీడల పోటీల్లో కూడా తోటివిద్యార్థులతో కలిసి పాల్గొంటాను. - ఎ.సుకన్య, గూడూరు

ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో: జె.పూజిత, మచిలీపట్నం

నేను మచిలీపట్నంలోని దేశాయిపేట హైస్కూల్లో 9వతరగతి చదువుతున్నాను. నేను వక్తృత్వపోటీల్లో పాల్గొనేలా ఉపాధ్యాయులు నన్ను అడుగడుగునా ప్రోత్సహించారు. ప్రధానంగా ఏ విభాగంలో పోటీలకు వెళ్తున్నామో ఆ అంశంపై పూర్తిస్థాయి పట్టువచ్చేలా వివరిస్తారు. అందుకే మిగిలిన విద్యార్థులకంటేమా పాఠశాల పిల్లలం మెరుగైన ప్రతిభచూపి బహుమతులు అందుకోగలుగుతున్నాం. అలా నేను పాఠశాల, నగరస్థాయిలో నిర్వహించిన పోటీల్లో ఇతర విద్యార్థినులకంటే పైచేయి సాధించాను. డివిజన్‌ స్థాయిలో కూడా మొట్టమొదటి స్థానంలో నిలిచి జిల్లా పోటీలకు అర్హత సాధించాను. కేవలం వక్తృత్వమే కాకుండా క్రీడలు, చిత్రలేఖనం తదితర పోటీల్లో కూడా పాల్గొని నా సామర్థ్యాలను పరీక్షించుకుంటాను.

వ్యాసరచనలో ప్రతిభ

వ్యాసరచన విభాగంలో పలు బహుమతులు సాధించడంతో ఉపాధ్యాయులు కూడా ప్రోత్సహించి పోటీలకు తీసుకెళ్తుంటారు. స్వాతంత్య్రదినోత్సవం, గాంధీజయంతి తదితర ప్రత్యేక పర్వదినాలతోపాటు పర్యావరణ పరిరక్షణలాంటి సామాజిక అంశాలపై పలు సంస్థలు నిర్వహించిన పోటీల్లో పాల్గొని అనేక బహుమతులు అందుకున్నాను. చిత్రలేఖనంపై ఆసక్తి ఉన్నా ఎక్కువగా వ్యాసరచనకే ప్రాధాన్యత ఇస్తాను. బాలికలు చదువుకోవాల్సిన ఆవశ్యకత, సామాజికంగా ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలపై రాసిన వ్యాసం చదివి న్యాయనిర్ణేతలు ప్రత్యేకంగా అభినందించారు. ప్రస్తుతం జిల్లాస్థాయిలో కూడా ప్రథమస్థానం సాధించాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నాను. ఉపాధ్యాయులతోపాటు మాతల్లిదండ్రులు కూడా ప్రోత్సహించడంతోనే పోటీల్లో పాల్గొనగలుగుతున్నాను. - ఇ.వరలక్ష్మి, మల్లవోలు, గూడూరు మండలం


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని