‘ఐదు శాతం అమలుచేయకుంటే ముట్టడే’
eenadu telugu news
Published : 28/10/2021 02:19 IST

‘ఐదు శాతం అమలుచేయకుంటే ముట్టడే’

పోస్టుకార్డుల ఉద్యమాన్ని ప్రారంభిస్తున్న నాయకులు

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: కాపు సామాజిక వర్గానికి ఐదు శాతం రిజర్వేషన్లను అమలు చేయకుంటే ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని కాపు సంక్షేమసేన రాష్ట్ర కార్యదర్శి కొట్టె అంకా వెంకట్రావు హెచ్చరించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, రిజర్వేషన్‌ అమలును డిమాండ్‌ చేస్తూ బుధవారం కలెక్టరేట్‌ ధర్నాచౌక్‌లో సంక్షేమసేన ఆధ్వర్యాన నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లేలా పోస్టుకార్డుల ఉద్యమాన్ని చేపడుతున్నట్టు ప్రకటించారు. జనాభాలో అత్యధికశాతంగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని ఓటు బ్యాంకుగా వాడుకోవాలనుకోవడం అవివేకమని వారి హక్కులను కాపాడేలా సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు. కాపు కార్పొరేషన్‌కు కేటాయిస్తామన్న నిధులను వెంటనే విడుదల చేయాలనీ, కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలను వెనుకబడిన తరగతుల జాబితాల్లో చేర్చాలని కోరారు. కాపుల హక్కుల సాధనకు అందరూ సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. రాధారంగా మిత్రమండలి జిల్లా అధ్యక్షుడు బుల్లెట్‌ ధర్మారావు, సంక్షేమ సేన ప్రతినిధులు మాట్లాడుతూ కాపులను కరివేపాకులా వాడుకోవాలని చూస్తే ప్రభుత్వం వారి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. సంక్షేమ సేన నాయకులు అరవింద్‌కుమార్‌, లంకిశెట్టి నీరజ, అమ్మాజీ, వివిధ కాపు సంఘాల ప్రతినిధులు నిరసనలో పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని