స్వప్నం.. సాకారం
eenadu telugu news
Published : 28/10/2021 02:19 IST

స్వప్నం.. సాకారం

తిరువూరు ప్రాంతీయ వైద్యశాలలో డయాలసిస్‌ సేవలు ప్రారంభం

డయాలసిస్‌ చేయించుకుంటున్న కిడ్నీ బాధితులు

తిరువూరు, న్యూస్‌టుడే : ఏళ్ల తరబడి కాగితాలకే పరిమితమైన డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కార్యరూపం దాల్చింది. చిరకాలస్వప్పం కాస్తా సాకారానికి నోచుకోవడంతో కిడ్నీ బాధితులకు ఊరట లభించింది. సుదూర ప్రాంతాలకు వెళ్లి డయాలసిస్‌ చేయించుకున్న బాధితులకు తిరువూరు ప్రాంతీయ వైద్యశాలలో సేవలు ప్రారంభించడంతో ఆర్థిక భారం నుంచి ఉపశమనం లభించింది.

పశ్చిమకృష్ణా పరిధిలోని తిరువూరు, నూజివీడు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల పరిధిలో ఇటీవల కాలంలో కిడ్నీ బాధితుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఈ ప్రాంతవాసులకు ఇప్పటి వరకు విజయవాడ, నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రమే డయాలసిస్‌ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. మారుమూల గ్రామాల నుంచి బాధితులు ఒకరిని తోడుగా తీసుకుని వెళ్లాలంటే వ్యయప్రయాసలకు గురికావాల్సి వచ్చేది. కొందరు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చేయించుకునేందుకు ఆస్తులను సైతం తెగనమ్ముకున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా డయాలసిస్‌ చేయించుకోలేక మృత్యువాత పడిన వారూ ఉన్నారు. కిడ్నీ బాధితుల అవస్థలను వరుస కథనాలతో ‘ఈనాడు’ వెలుగులోకి తీసుకువచ్చింది. గత ప్రభుత్వంలో ఎ.కొండూరు మండలంలో ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతాల్లో శుద్ధజలాలు అందించడం కోసం ఆర్వోప్లాంట్లు ఏర్పాటు చేశారు. డయాలసిస్‌ చేయించుకునేందుకు వెళ్లేవారికి రవాణా సదుపాయం అందుబాటులోకి తీసుకువస్తూ ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. పౌష్టికాహార లోపాన్ని అధిగమించడం కోసం కొంత కాలం పాటు పోషకాహారం పంపిణీ చేశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో మృతి చెందిన వారికి ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందించారు. బాధితులు అధికంగా ఉన్న తిరువూరు నియోజకవర్గం పరిధిలో డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వంలో ప్రతిపాదించారు. దీనిలో భాగంగా తిరువూరు, విస్సన్నపేట ప్రభుత్వ ఆస్పత్రులను ఎంపిక చేశారు. డయాలసిస్‌ యూనిట్లు వితరణగా అందించడానికి లయన్స్‌క్లబ్‌ ముందుకు వచ్చింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత రాజకీయ సమీకరణలు మారడంతో డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటులో కొంత జాప్యం జరిగింది.

అత్యాధునిక పరికరాలతో..

అపోలో డయాలసిస్‌, లయన్స్‌క్లబ్‌, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంయుక్త తిరువూరు ప్రాంతీయ వైద్యశాలలో తొమ్మిది పడకలతో ఏర్పాటు చేసిన డయాలసిస్‌ కేంద్రాన్ని ఈనెల 11న ఎమ్మెల్యే కె.రక్షణనిధి ప్రారంభించారు. కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా ఆత్యాధునిక పరికరాలతో ప్రస్తుతం ఇక్కడ డయాలసిస్‌ సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం 14 యూనిట్లు అందుబాటులో ఉండగా, లయన్స్‌క్లబ్‌ తరఫున ఐదు, అపోలో ఆస్పత్రి ఐదు యూనిట్లు సమకూర్చాయి. బాధితులకు డయాలసిస్‌ చేస్తున్న సమయంలో శుద్ధజలం అవసరం కావడంతో విశాఖపట్నం రాజువేగ్నేశ ఫౌండేషన్‌ నిర్వాహకులు రూ.7 లక్షల వ్యయంతో ఆస్పత్రి ఆవరణలో నీటిశుద్ధి కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడి కేంద్రంలో ఒక డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌, ఒక ఇన్‌ఛార్జి, ఇద్దరు టెక్నీషియన్లు, ఇద్దరు నర్సులు పనిచేస్తున్నారు. గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్‌ చేయించుకున్న 16 మంది బాధితులు ఇక్కడ సేవలు పొందుతున్నారు. ఒక్కొక్కరికి చేయడానికి సగటున 4 గంటల సమయం పడుతుండగా, రోజుకు 24 మందికి చేయడానికి అవకాశం ఉంది. ఆన్‌లైన్‌ పద్ధతిలో ఆధార్‌కార్డు ఆధారంగా తమ వివరాలను నమోదు చేసుకున్న వారికి చేస్తున్నారు. కేంద్రానికి సమీపంలో ఉన్న నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో డయాలసిస్‌ బాధితులను గుర్తించే ప్రక్రియ జరుగుతోంది. ప్రతి ఒక్కరికీ చేయడంతో పాటు ఉచితంగా బ్లెడ్‌ ఇంజెక్షన్లు అందిస్తున్నారు. ఈ కేంద్రం తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఉండగా, ప్రస్తుతం ఆంధ్రా పరిధిలోని వారికే సేవలు అందిస్తున్నారు.

నిపుణుల పర్యవేక్షణలో చేస్తున్నాం

ఇక్కడి కేంద్రంలో సాధ్యమైనంతవరకు ఎక్కువ మందికి డయాలసిస్‌ చేయాలనేది లక్ష్యం. ఆధునిక పరికరాలు, పూర్తి సదుపాయాలు, నిపుణుల పర్యవేక్షణలో నాణ్యమైన సేవలు అందిస్తున్నాం. బాధితులు, వారి కుటుంబీకులు కూడా పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేనందున కిడ్నీ బాధితులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి. డయాలసిస్‌కు వచ్చే బాధితుల సంఖ్య పెరిగితే కేంద్రంలో పడకలు విస్తరించే వీలుంది. - పార్వతీశం, డయాలసిస్‌ కేంద్రం ఇన్‌ఛార్జి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని