
చిన్న గాయమనుకున్నా ప్రాణమే పోయింది..!
చిట్యాల గ్రామీణం, న్యూస్టుడే: చిన్న గాయమనుకున్నాడు.. అందుకే ప్రమాదం జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకూ చెప్పలేదు. చివరికి అస్వస్థతకు గురై ఓ బాలుడు ప్రాణం వదిలిన ఘటన నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొరటికల్కు చెందిన మందుల బాలాజీ(16) తన స్నేహితుడు చిలకరాజు సాయితేజతో కలిసి చిట్యాల మండలం పెద్దకాపర్తికి ఇసుక ట్రాక్టర్ అన్లోడ్ చేసేందుకు మంగళవారం సాయంత్రం వచ్చారు. తిరిగెళ్తున్న క్రమంలో చిన్నకాపర్తి వద్ద డ్రైవర్ పక్కన కూర్చున్న మందుల బాలాజీ ట్రాక్టర్ పైనుంచి ప్రమాదవశాత్తు జారిపడ్డారు. ట్రాలీ అతని పైనుంచి వెళ్లింది. కాలుకు మాత్రమే దెబ్బ తగిలిందని, పెద్దగా గాయాలు కాలేదనుకొని చిన్నకాపర్తిలో ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించుకొని వెళ్లారు. ప్రమాద ఘటనపై కుటుంబ సభ్యులకు సమాచారమందించలేదు. బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో అస్వస్థతకు గురై వాంతులు చేసుకొని బాలాజీ మృతి చెందారు. శరీరంపై మూత్రపిండాల భాగంలో దెబ్బతగలటం వల్ల బాలుడు చనిపోయి ఉండొచ్చుని చిట్యాల ఎస్సై రావుల నాగరాజు తెలిపారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు