Published : 14/04/2021 03:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వివాహిత బలవన్మరణం

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రం సమీపంలోని సీతారాంపురం వద్ద సోమవారం రాత్రి ఓ వివాహిత రైలు కింద పడి బలవన్మరణం చెందారు. రైల్వే ఎస్సై ఎస్‌కే సైదులు అందించిన సమాచారం మేరకు.. నల్గొండ మండలం అన్నెపర్తికి చెందిన శైలజ వివాహం జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన పాలకూరి అమరేందర్‌తో ఆరేళ్ల క్రితం జరిగింది. వీరికి నాలుగేళ్ల కూతురు ఉంది. గత ఏడాది కొవిడ్‌ ప్రారంభం వరకు రెండేళ్ల పాటు శైలజ జిల్లా కేంద్రంలోని మాల్‌బౌలి ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యావాలంటీర్‌గా పనిచేశారు. గతేడాది కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రారంభంతో పాఠశాలలు మూతపడటంతో విద్యావాలంటీర్లను ప్రభుత్వం తొలగించింది. తర్వాత వీరిని నియమించలేదు. దీంతో ఆమె ఇంటి వద్దే ఉంటున్నారు. భర్త పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో పొరుగుసేవల కింద అటెండర్‌గా పనిచేస్తున్నారు. మానసికి స్థితి బాగా లేకపోవడానికి తోడు భర్తకు నాలుగు నెలలుగా వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆరు నెలలుగా శైలజ తల్లిదండ్రుల వద్ద అన్నెపర్తిలో ఉంటూ నల్గొండ, హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో వర్షం కురుస్తున్న సమయంలో ఆమె ఇంట్లో నుంచి వెళ్లి సమీపంలోని రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతురాలి తండ్రి నూకల వెంకటయ్య ఫిర్యాదుతో తహశీల్దార్‌ నాగార్జున్‌రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతురాలి కుటుంబానికి న్యాయం జరగాలని నిరుద్యోగ సంఘాల నాయకులు, బంధువులు మునుగోడు రోడ్డు హౌసింగ్‌ బోర్డు కాలనీ వద్ద కొంత సేపు రాస్తారోకో చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే విద్యావాలంటీర్‌ బలవన్మరణానికి పాల్పడ్డారనే వార్త సామాజిక మాధ్యమాల్లో చెక్కర్లు కొడుతోంది.

శైలజ కుటుంబాన్ని ఆదుకోవాలి... నీలగిరి: శైలజ కుటుంబాన్ని ఆదుకోవాలని విద్యావాలంటీర్ల సంఘం, నిరుద్యోగ ఐకాస, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. శైలజ మృతదేహాన్ని ఆసుపత్రిలో సందర్శించి నివాళి అర్పించారు. విద్యావాలంటీర్ల సంఘం నాయకులు ప్రగతి, రజిత, నాగమణి, సునీత, శ్రీలత, శ్రీనివాస్‌, నిరుద్యోగ ఐకాస ఛైర్మన్‌ పాల్వాయి రవి, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కట్టెల శివకుమార్‌, యన్నమల్ల భాస్కర్‌, ఎండి. అజారుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని