Published : 14/04/2021 03:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

శాలసిద్ధి.. పాఠశాలల సమాచార నిధి

విద్యాభివృద్ధికి ఆలంబనగా వివరాలు

సూర్యాపేట నెం.2 ప్రభుత్వ పాఠశాల

సూర్యాపేట (మహాత్మాగాంధీరోడ్డు), న్యూస్‌టుడే: శాలసిద్ధి పేరిట పాఠశాలల ప్రమాణాలు, మూల్యాంకన జాతీయ కార్యక్రమాన్ని విద్యాశాఖ చేపడుతోంది. అన్ని పాఠశాలలకు సంబంధించిన సమగ్ర స్వరూపాన్ని శాలసిద్ధి వెబ్‌పోర్టల్‌లో పొందుపర్చేలా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. సమాజంలోని ప్రతి ఒక్కరూ పాఠశాలల్లోని వసతులు, సామర్థ్యాలు, నిర్వహణ వంటి తీరుతెన్నులను పరిశీలించేలా, వాటి అభివృద్ధికి చేయూతనిచ్చేలా ఈ వివరాలు నిలవనున్నాయి. జిల్లా విద్యాశాఖ కూడా శాలసిద్ధిలో జిల్లాలోని పాఠశాలల సమగ్ర వివరాలను నమోదు చేయాలని సమాయాత్తమవుతోంది.

సమగ్ర సమాచారం నిక్షిప్తం

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు 1,275 ఉన్నాయి. అన్నిరకాల పాఠశాలల సమగ్ర సమాచారాన్ని శాలసిద్ధికి సంబంధించిన వెబ్‌సైట్లో పొందుపర్చనున్నారు. క్రీడా స్థలాలు, తరగతి గదులు, విద్యుత్తు, ప్రయోగశాల, కంప్యూటర్లు, వంట గదులు, వంట పాత్రలు, తాగునీరు, శౌచాలయాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, బోధనలో ఉపాధ్యాయుల పరిజ్ఞానం, ప్రణాళికలు, విద్యార్థుల మదింపు, ప్రగతి, విద్యార్థుల హాజరు, అభ్యసన ప్రక్రియలు, సంసిద్ధత, ఉపాధ్యాయుల పనితీరుకు సంబంధించిన వృత్యంతర శిక్షణలు, పాఠశాలల నిర్వహణలో నాయకత్వ లక్షణాల పెంపుదల వంటి వివరాలను పొందుపర్చనున్నారు. వీటికి తోడు ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అమలుచేస్తున్న విలీన విద్య, ఆరోగ్యం, భద్రత, పరిశుభ్రతతో పాటు పాఠశాలల విద్యాకమిటీల ఏర్పాటు, పాఠశాలల అభివృద్ధిలో వాటి పాత్ర తదితర సమాచారాన్ని చేర్చుతారు. ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించిన సమగ్ర స్వరూపాన్ని శాలసిద్ధిలో పొందుపర్చాలని విద్యాశాఖ ఆదేశాలిచ్చింది.

ప్రయోజనాలు ఇలా..

శాలసిద్ధిలో అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పొందుపర్చిన పాఠశాలల సమగ్ర సమాచారం ఉంటుంది. ఆయా పాఠశాలలు మిగిలిన పాఠశాలలతో పోలిస్తే బోధన, వసతులు, వనరుల్లో ఏ మేరకు ముందున్నాయో తెలుసుకునే వీలు కలుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సర్వశిక్ష అభియాన్‌, రాష్ట్రమాధ్యమిక శిక్ష అభియాన్‌(ఆర్‌ఎంఎస్‌ఏ) ద్వారా నిధులను విడుదల చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులను అందజేస్తోంది. ప్రతి పాఠశాల సమగ్ర స్వరూపం కళ్ల ముందు ఆవిష్కృతమైతే వాటిల్లోని లోపాలు అధిగమించేలా, అవసరాలు తీర్చేలా ప్రభుత్వం అడుగులు వేసేలా దోహదపడుతుంది. దాతలూ వాటి అభివృద్ధికి ముందుకొచ్చే అవకాశముంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని