Published : 14/04/2021 03:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నోముల నర్సింహయ్యను విస్మరించిన కేసీఆర్‌: రేవంత్‌రెడ్డి

నాగార్జునసాగర్‌లో మాట్లాడుతున్న ఎంపీ రేవంత్‌రెడ్డి

నాగార్జునసాగర్‌, న్యూస్‌టుడే: నోముల నర్సింహయ్యను సమాధి చేసింది ముఖ్యమంత్రి కేసీఆరే అని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్‌లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీపీఎం నేతగా, కార్మిక సంఘం నాయకుడిగా దశాబ్దాలుగా ప్రత్యేక స్థానం కలిగి ఉన్న నోముల నర్సింహయ్యకు శాసనసభ సమావేశాల్లో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కేసీఆర్‌ ఆయన నోరునొక్కారని విమర్శించారు. మంత్రివర్గంలో ఉల్లిగడ్డలు అమ్ముకునేవారికి, పార్టీలు మారేవారికి అవకాశం కల్పించి నోములను విస్మరించారన్నారు. దుబ్బాక ఎన్నికలో ప్రచారానికి వెళ్లని ముఖ్యమంత్రి.. సాగర్‌ ఉప ఎన్నికలో ఓడిపోతామనే భయంతో ఇక్కడికి రెండుసార్లు వస్తున్నారన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో పాలన గాడిన పడడానికి జానారెడ్డి కేసీఆర్‌కు ఎంతో సహాయం చేశారని.. ఇప్పుడు ఆయననే ఓడించడానికి రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. మృతిచెందిన శాసనసభ్యుడి కుటుంబ సభ్యులకు ఏకగ్రీవం చేసే సంప్రదాయాన్ని కేసీఆర్‌ తుంగలో తొక్కారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గులాబీ వనంలో గంజాయి మొక్కలాంటి నాయకులను పెట్టి శాసనసభను కల్లు కంపౌండ్‌గా తయారు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అంబేడ్కర్‌, జ్యోతీరావుఫులె, జగ్జీవన్‌రావు జయంతి, వర్ధంతిలో ఏనాడు పాల్గొనకుండా వారిని ముఖ్యమంత్రి అగౌరవపరుస్తున్నారని పేర్కొన్నారు. జానారెడ్డిని ఓడించడానికి తెరాస, భాజపా రహస్య ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. కార్మిక సంఘాల నాయకులు కలిసేందుకు కనీస అవకాశం ఇవ్వని కేసీఆర్‌కు సీపీఎం మద్దతు తెలపడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సొంత నియోజకవర్గంలో గెలవని రేవంత్‌ సాగర్‌లో ప్రచారం ఏవిధంగా చేస్తాడన్న బాల్కసుమన్‌ చేసిన విమర్శకు.. ‘ఇద్దరం ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే ఓయూకు వెళ్లి అక్కడ ఉందాం. విద్యార్థులు ఎవరికి బుద్ధి చెబుతారో చూద్దామ’ని అన్నారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌, మల్లు రవి, ప్రదీప్‌గౌడ్‌, తదితరులు ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని