Published : 14/04/2021 03:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉగాది పూట అంతిమయాత్ర

లింగోజీగూడెంలో రైతు దంపతుల మృతదేహాలకు నివాళులర్పిస్తున్న మాజీ

ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి

చౌటుప్పల్‌, న్యూస్‌టుడే: లింగోజీగూడెంలో పిడుగుపాటుకు రైతు దంపతులు మృతి చెందడంతో ఉగాది రోజున విషాదం అలుముకుంది. ఊరికి సమీపంలోని చింతకుంట వ్యవసాయ క్షేత్రం వద్ద పాలు పితుకుతున్న బండారు కరుణాకర్‌రెడ్డి (55), వేణమ్మ (50)లను సోమవారం సాయం సంధ్యవేళ పిడుగు పొట్టనబెట్టుకుంది. ప్లవ ఉగాదిని చూడకుండానే ఆ దంపతుల బతుకులు తెల్లారిపోయాయి. జీవితాంతం ఈ దంపతులిద్దరూ ఇక్కడే వ్యవసాయం చేశారు. చరమాంకంలోనూ వ్యవసాయ క్షేత్రంలోనే జంటగా ప్రాణాలొదిలారు. జీవనోపాధి కోసం లారీ నడుపుకుంటూ కాళేశ్వరం వెళ్లిన వారి కుమారుడు, పుట్టింటికి వెళ్లిన కోడలు, అత్తవారింటి నుంచి కుమార్తె ఈ దుర్వార్త విని పరుగున వచ్చారు. కడసారి తమ ఆత్మీయులను చూసి రోదించిన తీరు అందర్నీ కంటతడి పెట్టించింది. ఈ రైతు జంటకు నిర్వహించిన అంత్యక్రియల్లో ఊరంతా కదిలారు. వాళ్లకు ఇష్టమైన వ్యవసాయ క్షేత్రంలోనే మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. రెండు నెలల క్రితమే కరుణాకర్‌రెడ్డి తండ్రి వృద్ధాప్యంతో మరణించారు. నెలలు తిరక్కండానే అదే ఇంట్లో ఈ విషాదం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ చింతల దామోదర్‌రెడ్డి, పురపాలిక కౌన్సిలర్లు బండమీది మల్లేశం, లింగస్వామి, బాబాషరీఫ్‌, మాజీ సర్పంచులు రమనగోని శంకరయ్య, దీపిక, ఊదరి నర్సింహ తదితరులు అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని