Published : 14/04/2021 03:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హైదరాబాద్‌ పొమ్మంది.. కులవృత్తి రమ్మంది

కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన వారికి కూరగాయలు అందజేస్తున్న

యువజన సంఘం సభ్యులు (పాతచిత్రం)

భూదాన్‌పోచంపల్లి, న్యూస్‌టుడే: కొవిడ్‌ ప్రజల జీవన స్థితిగతులను తలకిందులు చేసింది. ఉద్యోగం, ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌ వెళ్లిన యువతకు కష్టాలను తీసుకువచ్చింది. వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్న వారంతా లాక్‌డౌన్‌తో సొంత గ్రామాలకు వచ్చారు. పరిస్థితులు చక్కబడే వరకు స్వయం ఉపాధి పొందుదామని కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. తిరిగి ఉద్యోగాలు చేసుకుందామనుకున్న తరుణంలో మళ్లీ రెండో దశలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో హైదరాబాద్‌ వెళ్లాలన్న ఆలోచనలను విరమించుకుంటున్నారు. వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేసి తిరిగి చేనేత వృత్తిలో రాణిస్తున్న యువత మనోగతం వారి మాటల్లో..

జిల్లా నుంచి వేల సంఖ్యలో రాజధానికి.. ఉపాధి కోసం జిల్లాలోని పోచంపల్లి, బీబీనగర్‌, భువనగిరి, బొమ్మలరామారం, సంస్థాన్‌నారాయణపురం, చౌటుప్పల్‌ మండలాల నుంచి వేలాది సంఖ్యలో యువత నిత్యం రాజధానికి వెళుతుండేవారు. హైదరాబాద్‌లోని షాపింగ్‌ మాల్స్‌లో, కళాశాలలు, పాఠశాలల్లో, దుకాణాల్లో పనిచేస్తూ జీవనం సాగించేవారు. కరోనా కారణంగా వీరందరూ ఉపాధిని కోల్పోయి స్వగ్రామాల్లో స్వయం ఉపాధి, కులవృత్తులు చేసుకుంటున్నారు. కొంతమంది ఖాళీగా ఉంటున్నారు.

ఉద్యోగానికి రావద్దన్నారు

-దోర్నాల వెంకటనరసింహ, చేనేత కార్మికుడు

-కొవిడ్‌ లాక్‌డౌన్‌కు ముందు హైదరాబాద్‌లోని సివిల్‌ ఇంజినీర్‌ వద్ద సూపర్‌వైజర్‌గా పనిచేశాను. రూ.15వేల జీతం వచ్చేది. లాక్‌డౌన్‌ వల్ల ఉద్యోగానికి రావద్దన్నారు. చేసేది లేక ఉపాధి కోసం తిరిగి ఇంటికి వచ్చి మగ్గం పని చేస్తున్నా. నెలకు రూ. 12వేల వరకు సంపాదిస్తున్నా.

అకౌంటెంట్‌గా పనిమానేసి మగ్గం నేస్తున్నా..

-ప్రవీణ్‌, చేనేత కార్మికుడు

జూబ్లీహిల్స్‌లో అకౌంటెంట్‌గా పనిచేసి రూ.15వేల వేతనం పొందేవాడిని. కరోనా కారణంగా ఉద్యోగానికి రావద్దన్నారు. ఇంట్లోనే మగ్గం నేసుకుంటూ ఉపాధి పొందుతున్నాను. పరిస్థితులు చక్కబడితే వెళదామనుకున్నాను. కానీ, రెండో దశలో కేసులు పెరుగుతుండటంతో స్వయం ఉపాధి మేలు అనిపిస్తోంది.

కులవృత్తిని నమ్ముకున్నా..

-బొడ్డు హరిప్రసాద్‌, చేనేత కార్మికుడు

హైదరాబాద్‌లోని ప్రయివేట్‌ కళాశాలలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా ఉద్యోగం చేసేవాడిని. కరోనా వల్ల ఉద్యోగం పోయింది. చేసేది లేక కులవృత్తిని నమ్ముకొని మగ్గంపై వస్త్రాలు నేస్తున్నాను. సాధారణ పరిస్థితులు చక్కబడే పరిస్థితులు ఎప్పుడు వస్తాయో చూడాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని