Published : 14/04/2021 03:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మన భూముల్లో భాస్వరం అధికమే

తగ్గించే చర్యలు చేపట్టాలంటున్న శాస్త్రవేత్తలు

నల్గొండ గ్రామీణం, న్యూస్‌టుడే: పంటల సాగులో రసాయనిక ఎరువులు అతిగా వాడటం వల్ల భూముల్లో భాస్వరం నిల్వలు పేరుకుపోతున్నాయి. అవి పరిమితికి మించి ఉన్నాయని కేంద్ర వ్యవసాయ శాఖ పరిశీలనలో తేలింది. ఈ క్రమంలో ఎరువుల వాడకం తగ్గించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి, మిపర పంటలు అధికంగా సాగుచేస్తుంటారు. ఇందులో పంట సాగుకు ముందు డీఏపీ, మొక్కలు పెరిగి కోత వరకు కాంప్లెక్స్‌ ఎరువులు విరివిగా వాడుతున్నారు. ఈ ఎరువుల్లో భాస్వరం నిల్వలు ఎక్కువగా ఉండి నేలల్లో పేరుకుపోతున్నాయి.ఫలితంగా భూముల్లో ఉన్న సూక్ష్మపోషకాలు మొక్కకు సరిగా అందక పూత, కాత సక్రమంగా రాక పంట దిగుబడిపై ప్రభావం చూపుతున్నాయి. పంటల సాగుకు ముందే మట్టి నమూనాను పరీక్షించి ఫలితాల ఆధారంగా ఎరువులు వాడితే అనవసర ఎరువుల వాడకాన్ని మినహాయించడానికి అవకాశం ఏర్పడుంది. పెట్టుబడులు కూడా తగ్గుతాయి.

నిల్వల తొలగింపునకు.. భాస్వరం ఎక్కువగా ఉంటే నేలల్లో ఫాస్పరస్‌ సాల్యుబుల్‌ బ్యాక్టీరియా(పీఎస్‌బీ) అనే జీవన ఎరువును ఎకరానికి రెండు కిలోలు వాడాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అది భాస్వరాన్ని కరిగించి మొక్కకు వెళ్లేలా చేస్తుందని తెలుపుతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌కు ముందే రైతులందరికి పీఎస్‌బీ అందివ్వడంతో పాటు అవగాహన కల్పించాల్సి ఉంది. దీనివల్ల 25 శాతం వరకు ఎరువుల వాడకం తగ్గించవచ్ఛు ఎకరా సాగులో రూ.300 నుంచి రూ.400 వరకు ఖర్చు తగ్గించవచ్చని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు.

పీఎస్‌బీతో ప్రదర్శన క్షేత్రాల ఏర్పాటు

-శ్రీధర్‌రెడ్డి, డీఏవో, నల్గొండ

రసాయనిక ఎరువులు ఎక్కువ వాడటం వల్ల భాస్వరం నిల్వలు పేరుకుపోతున్నాయి. జిల్లాలోని నేలల్లో పాస్పరస్‌ సాల్యుబుల్‌ బ్యాక్టీరియా(పీఎస్‌బీ) అనే జీవన ఎరువులతో ప్రభుత్వ సహకారంతో ప్రతి మండలంలో ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేసి భాస్వరం నిల్వలు కరిగేలా చేస్తాం. ఇప్పటికే కొందరు రైతులు పీఎస్‌బీ వాడి ప్రయోజనం పొందుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో అధిక భాస్వరం కల్గిన మండలాలు ఇవే..

నల్గొండ జిల్లా: నిడమనూరు, త్రిపురారం.

సూర్యాపేట జిల్లా: నడిగూడ, మునగాల, హుజూర్‌నగర్‌, చివ్వెంల, గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకీడు.

యాదాద్రి భువనగిరి జిల్లా: ఆలేరు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని