Published : 14/04/2021 03:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మాస్కుతో మంచి ఫలితం

కొవిడ్‌ నివారణకు అన్ని రకాలుగా సిద్ధం ●

డీఎంహెచ్‌వో అన్నిమల్ల కొండల్‌రావు

నల్గొండ అర్బన్‌, న్యూస్‌టుడే

గత కొద్ది రోజులుగా జిల్లాలో కొవిడ్‌ మహమ్మారి మళ్లీ విలయ తాండవం చేస్తోంది. ఇలాంటి సమయంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనే అంశాలపై జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా.అన్నిమల్ల కొండల్‌రావుతో ‘న్యూస్‌టుడే’ ముఖాముఖి నిర్వహించింది. ఆ వివరాలివిగో..

న్యూ: ఇప్పటి వరకు జిల్లాలో కొవిడ్‌ టీకాపై ప్రంట్‌లైన్‌ వారియర్స్‌తో పాటు సామాన్య ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన కల్పించలేకపోయారు.?

డీఎంహెచ్‌వో: కొవిడ్‌ టీకాపై అన్ని వర్గాల వారిలో అవగాహన ఉంది. గ్రామాల్లో ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు ఇతర సిబ్బంది 45 ఏళ్లు దాటిన వారికి కొవిడ్‌ టీకాపై సమావేశాల ఏర్పాటుతో పాటు, మీడియా, సామాజిక మాధ్యమాలు, గోడపత్రాల పంపిణీతో అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో వ్యాక్సిన్‌ ఉత్సవాల్లో అర్హులందరికీ టీకా పంపిణీ జరిగేలా చూస్తున్నాం.

న్యూ: జిల్లాలో ఇప్పటివరకు టీకా తీసుకున్నవారు ఎంత మంది ఉన్నారు?

డీఎంహెచ్‌వో: జిల్లాలో ఇప్పటివరకు టీకా తీసుకున్న వారు 45,443 మంది ఉన్నారు. వారిలో మొదటి డోసు 35,421 మంది, రెండో డోసు 10,022 మంది తీసుకున్నారు. అందులో హెల్త్‌కేర్‌ వర్కర్లు మొదటి డోసు 8,896 మంది, 7,388 రెండో డోసు తీసుకున్నారు.

న్యూ: కొన్ని ప్రాంతాల్లో టీకా కొరత ఉందని వచ్చిన వారిని వెనక్కి పంపుతున్నారు?

డీఎంహెచ్‌వో: కొన్ని ప్రాంతాల్లో వయసు తక్కువగా ఉన్నవారు రావడం, టీకా సరఫరా చేయాల్సిన దాని కంటే ఎక్కువ మంది రావడం జరుగుతుంది. అలాంటి సమయంలో కాస్త ఇబ్బంది అవుతుంది.

న్యూ: కొవిడ్‌ అదుపులోకి తీసుకు రావడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

డీఎంహెచ్‌వో: నిర్లక్ష్యాన్ని వీడి గట్టి చర్యలు చేపడితే కొవిడ్‌ అదుపులోకి తేవడం పెద్ద పనేమి కాదు. గతేడాదితో పోల్చితే ప్రస్తుతం మనదగ్గర అపారమైన అనుభవం, వనరులున్నాయి. ప్రతి ఒక్కరు మాస్కు వాడితే మంచి ఫలితాన్ని సాధించవచ్ఛు కొవిడ్‌తో పాటు ఇతర జబ్బులు దూరమవుతాయి. ఇది తెలియని వారే నిర్లక్ష్యం చేస్తున్నారు. సామాజిక దూరం, శానిటైజర్లు వాడడం, వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాల్సిన అవసరముంది. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది ఇతర శాఖలను సమన్వయం చేసుకుంటూ కొవిడ్‌ నివారణకు యుద్ధం చేస్తున్నాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని