Published : 14/04/2021 03:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సీఎం కేసీఆర్‌ సభకు సర్వం సిద్ధం

ఈనాడు, నల్గొండ

సాగర్‌ నియోజకవర్గంలోని అనుముల మండల కేంద్రంలో జరిగే సీఎం

కేసీఆర్‌ బహిరంగ సభకు సిద్ధమైన వేదిక

సాగర్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బుధవారం అనుములలో జరిగే బహిరంగ సభకు సీఎం కేసీఆర్‌ వస్తుండటంతో పార్టీ శ్రేణులు జన సమీకరణపై దృష్టి సారించాయి. ఏడు మండలాల నుంచి వేలాది మంది వరకు హాజరవుతారని నేతలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మండలాలకు ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న వారందరికీ బాధ్యతలు అప్పగించారు. ప్రచార ఘట్టం రేపటితో ముగుస్తుండటం, రెండు రోజుల్లో పోలింగ్‌ ఉండటంతో బహిరంగ సభకు ముందు సభా వేదిక పక్కన ఏర్పాటు చేసిన ఓ ఇంటిలో అరగంట పాటు మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు ఇన్నాళ్లు ప్రచారంలో పాల్గొన్న ఇన్‌ఛార్జ్‌లు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశం కానున్నట్లు తెలిసింది. వివిధ వర్గాల నుంచి సేకరించిన సమాచారాన్ని సీఎం వారికి చెప్పి తదుపరి ప్రక్రియలో వ్యవహరించాల్సిన దానిపై దిశానిర్దేశం చేస్తారని పార్టీ ముఖ్య నాయకుడొకరు ‘ఈనాడు’కు వెల్లడించారు. నెల్లికల్‌ ఎత్తిపోతలను ఏడాదిన్నరలోగా పూర్తి చేయకుంటే రాజీనామా చేస్తానన్న మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలపై సీఎం స్పందించి ఈ పథకాన్ని ఎన్ని రోజులలోపు పూర్తి చేస్తామో ప్రజలకు వివరించే అవకాశమున్నట్లు తెలిసింది. మరోవైపు డిగ్రీ కళాశాల జీవోపైనా కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డి తరుచూ విమర్శలు చేస్తున్న దృష్ట్యా సాగర్‌లోని బీసీ గురుకుల కళాశాలలోనే ఈ ఏడాది నుంచే డిగ్రీ కళాశాలను ప్రారంభించే ప్రకటన సభలో చేస్తారని నాయకులు అంచనా వేస్తున్నారు.

సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్పీ రంగనాథ్‌ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపు వేయి మంది సిబ్బందిని భద్రతకు ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు నాగార్జునసాగర్‌ బీసీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌తోపాటు మంగళవారం అనుములలోనూ మరో హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు.


పార్టీ వర్గాల సమాచారం ప్రకారం సీఎం కేసీఆర్‌ పర్యటన వివరాలు

* సాయంత్రం 4 గంటలకు అనుముల రాక (హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో)

* 4.30 నుంచి 5.00 గంటల వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో సమావేశం

* 5.00 గంటలకు బహిరంగ సభ ప్రారంభం

* 7.00 గంటలకు ముగింపు, రహదారి మార్గంలో హైదరాబాద్‌కు పయనం.



 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని