close

సంపాదకీయం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
విపత్తులపై జాతీయ వ్యూహం

కరోనా మహమ్మారి విజృంభణతో కకావికలమవుతున్న దేశార్థికానికి వ్యవసాయ రంగమే ఆశాకిరణమని భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఇటీవల అభివర్ణించింది. ఆ ఆశా కొల్లబోనుందా అనే భయాందోళనలు రేకెత్తిస్తూ ఒక పక్క వరద బీభత్సం, మరోవైపు దుర్భిక్ష తాండవం దేశాన్నిప్పుడు కరకరా నమిలేస్తున్నాయి. అతివృష్టి, అనావృష్టి- రెండూ ఏకకాలంలో ఇండియాపై కర్కశ దాడికి దిగే ఉదంతాలు పునరావృతమవుతూనే ఉండటం మరింత విషాదం! అసోమ్‌, బిహార్లలో వరదలు 58లక్షల మందికి పైగా జనజీవితాల్ని అతలాకుతలం చేశాయి. లక్షల హెక్టార్లలో పంటలు ధ్వంసమయ్యాయి. దక్షిణాదిన కొచి, ఎర్నాకుళం, కొట్టాయం జిల్లాలు చిగురుటాకుల్లా వణికిపోతుండగా- అదే కేరళలో జులై మాసానికి 40శాతం మేర వర్షపాతం తరుగుపడింది. మధ్యప్రదేశ్‌లో 44, రాజస్థాన్‌లో 36, ఒడిశాలో 31శాతం మేర లోటు వర్షపాతం బెంబేలెత్తిస్తోంది. యూపీలోని 75 జిల్లాల్లో 28 వాననీటి కోసం చకోరాలై నిరీక్షిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 220 దాకా జిల్లాలు సరైన వర్షాలకు నోచని దుస్థితి- కరవు కోర చాస్తున్నదనేందుకు ప్రబల సూచిక. సుమారు 450 నదులు ప్రవహించే భారత్‌లోని కొన్ని రాష్ట్రాలు ఏటేటా నీటి కోసం కటకటలాడుతుండటం, జల వనరుల సంరక్షణ పట్ల దారుణ నిర్లక్ష్యాన్నే ప్రస్ఫుటీకరిస్తోంది. అతివృష్టి కారణంగా పోటెత్తే వరదల్ని ఉపశమింపజేసి, అనావృష్టి పరగణాలకు జీవజలకళ సంతరింపజేసేందుకే నదుల అనుసంధాన  ప్రక్రియను ఎన్డీయే ప్రభుత్వం తలపెట్టింది. గుక్కెడు గంగకు నోచక కొన్ని రాష్ట్రాలు, ముంపు ముప్పులో మరికొన్ని కిందుమీదులయ్యే దురవస్థను బదాబదలు చేయడమన్నది- కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఏకోన్ముఖ లక్ష్యంతో పురోగమించినప్పుడే సుసాధ్యం!
ఏకకాలంలో దేశాన్ని కడగండ్లపాలు చేస్తున్న జంట విపత్తుల నుంచి గట్టెక్కడానికంటూ వెలుగు చూసిన మేలిమి సిఫార్సులెన్నో నేటికీ దస్త్రాల్లో మూలుగుతున్నాయి. నూట పాతికకు పైగా భిన్న వాతావరణ జోన్లు కలిగిన ఇండియాలోని సేద్య యోగ్య భూమిలో 68శాతానికి కరవు ముప్పు, అయిదు కోట్ల హెక్టార్ల విస్తీర్ణానికి వరద ముంపు పొంచి ఉంది. ఆరున్నర దశాబ్దాల వ్యవధిలో కోటీ 30లక్షల మందిని నిర్వాసితులుగా మిగిల్చిన వరదలు, లక్షా ఏడు వేల మంది ప్రాణాల్ని కబళించాయి. కరవు కాటకాల మూలాన రెండేళ్లలోనే ఆరున్నర లక్షల కోట్ల మేర దేశం నష్టపోయిందని, ఆమధ్య ‘అసోచామ్‌’ లెక్కకట్టింది. దుర్భిక్షం బారినుంచి దేశాన్ని రక్షించే వ్యూహాలను స్వామినాథన్‌ ఎనిమిదేళ్ల క్రితమే క్రోడీకరించినా, దీటైన కార్యాచరణ కొల్లబోయింది. వాతావరణ విపత్తులకు లోనుకాగల 151 జిల్లాల్ని కేంద్రం గుర్తించినా, రాష్ట్రస్థాయి కార్యాచరణ ప్రణాళికలు ఖరారైనా- ఎన్నదగ్గ ముందడుగు పడకపోవడం దురదృష్టం. పాలనపరమైన అలసత్వం ఒక పార్శ్వమే. నీటిపారుదల వ్యవస్థల్ని, చిత్తడి నేలల్ని యథేచ్ఛగా దురాక్రమించి ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడుతున్న ఉదంతాలు, ముంబయి మహానగరంలో మీఠీ నదినే కబ్జా చేస్తున్న మహా పాతకాల వంటి మానవ తప్పిదాలది ఇంకా పెద్ద పద్దు. భూతాపం పెచ్చరిల్లి ప్రకృతి విపత్తులు పెచ్చరిల్లుతుండగా, భౌగోళికంగానూ ఇండియాకు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. బ్రహ్మపుత్ర మహోగ్ర రూపం దాల్చి అసోమ్‌ దుఃఖదాయినిగా పరిణమించడానికి చైనాలో, బిహార్‌ తరచూ ముంపు సమస్య పాలబడటానికి నేపాల్‌లో మూలాలు ఉన్నాయన్న నిపుణులు సూచించిన పరిష్కార మార్గాలకూ సరైన మన్నన దక్కలేదు. విపత్తు నిభాయక ప్రణాళికల్ని కాగితాల్లో పేరబెట్టినన్నాళ్లు, జలసంరక్షణపై సామాజిక చేతన పెంపొందనంతవరకు దేశానికి ఈ పెను గండాల పీడ... అంతులేని కథే!

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.