Top Ten News @ 9 PM
close

తాజా వార్తలు

Published : 13/05/2021 20:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 9 PM

1. 300 టన్నుల సామర్థ్యంతో ఆక్సిజన్‌ ప్లాంట్‌: జగన్‌

భవిష్యత్తులో ఆక్సిజన్‌ కొరత రాకుండా ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కొవిడ్‌ నివారణ, వ్యాక్సినేషన్‌పై సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రోజువారీ ఆక్సిజన్‌ వినియోగం 600 మెట్రిక్ టన్నులు దాటిందన్నారు. 300 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దీని కోసం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. ఏప్రిల్‌ 20 నాటికి రాష్ట్రానికి 360 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ కేటాయింపు ఉండేదని, ప్రస్తుత వినియోగం 600 మెట్రిక్‌ మెట్రిక్‌ టన్నులకు చేరిందని అధికారులు సీఎం కు వివరించారు. ప్రస్తుతానికి కేటాయింపులు 590 మెట్రిక్‌ టన్నుల వరకూ ఉన్నాయని అన్నారు.

2. AP Corona: 2 లక్షలు దాటిన యాక్టివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో మరోసారి 20వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం 96,446 శాంపిల్స్‌ పరీక్షించగా 22,399 మంది కరోనా బారినపడ్డారు. కొవిడ్‌తో బాధపడుతూ 89 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 9,077కి చేరింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ రాష్ట్రంలో 13,66,785 మంది వైరస్‌ బారినపడగా, మొత్తం 1,77,02,133 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. 

TS Corona: కొత్తగా 4,693 కరోనా కేసులు

3. ధూళిపాళ్ల తరలింపుపై అనిశా కోర్టులో పిటిషన్‌

సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై అరెస్టయిన తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అవినీతి నిరోధకశాఖ (అనిశా) అధికారులు రాజమహేంద్రవరం జైలుకు తరలించడంపై అనిశా కోర్టులో పిటిషన్‌ దాఖలైంది.  దీనిపై విచారణ చేపట్టిన అనిశా కోర్టు..తమకు తెలియకుండా జ్యుడీషియల్‌ రిమాండ్‌లోని నరేంద్రను ఎలా తరలిస్తారని ప్రశ్నించింది. తరలింపుపై కోర్టు అనుమతి ఎందుకు తీసుకోలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. నరేంద్ర వారం రోజులపాటు ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు తెలిపారని, అయినప్పటికీ ఎలా తరలించారని అన్నారు. ఆయన్ను వెంటనే రాజమహేంద్రవరం ప్రైవేటు ఆస్పత్రికిగానీ, విజయవాడ ఆయుష్‌ ఆస్పత్రికిగానీ తరలించాలని ఆదేశించారు. 

4. రైతులకు మరో రూ. 19వేల కోట్ల పెట్టుబడి సాయం

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం-కిసాన్‌) కింద ఎనిమిదో విడత పెట్టుబడి సాయాన్ని ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం విడుదల చేయనున్నారు. ఈ విడతలో రూ. 19000 కోట్లను 9.5కోట్ల మందికి పైగా రైతులకు అందించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం నేడు ఓ ప్రకటనలో తెలిపింది. రేపు ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సాయాన్ని మోదీ విడుదల చేస్తారని పేర్కొంది. అంతేగాక, కార్యక్రమంలో భాగంగా కొంతమంది లబ్ధిదారులతో ప్రధాని మాట్లాడుతారని తెలిపింది. 

5. ‘18 ఏళ్లు నిండితే వ్యాక్సిన్‌’..అని కేంద్రం చెప్పినా..!

దేశంలో కరోనా ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతోంది. మరణాలు కూడా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అయితే రెండో దశ వ్యాప్తిలో యువతీయువకులపై కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో మూడో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ వేయవచ్చని కేంద్రం నిర్ణయించింది. దీనిని మే 1 నుంచి అమల్లోకి తెచ్చింది. అయితే, దేశ వ్యాప్తంగా 45 ఏళ్లలోపు వారు ఇప్పటి వరకు  34,80,618 మంది మాత్రమే వ్యాక్సిన్‌ వేయించుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. వీరందరికీ ఇంకా రెండో డోస్‌ వేయాల్సి ఉంది.

6. Covishield: 12-16 వారాల తర్వాతే రెండో డోసు

ప్రముఖ ఫార్మా సంస్థ సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా తయారుచేసిన కొవిషీల్డ్‌ టీకా డోసుల మధ్య వ్యవధిని పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొవిషీల్డ్‌ టీకా రెండు డోసుల మధ్య వ్యవధిని 12-16 వారాలకు పెంచొచ్చన్న నిపుణుల కమిటీ సిఫార్సులను ప్రభుత్వం అంగీకరించింది. అయితే దేశంలో అందుబాటులో ఉన్న మరో టీకా కొవాగ్జిన్‌కు సంబంధించి డోసుల మధ్య అంతరంలో కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు. డోసుల మధ్య వ్యవధి పెంచడం వల్ల వ్యాక్సిన్‌తో మెరుగైన ఫలితాలు లభిస్తాయని నేషనల్‌ టెక్నాలజీ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ నిపుణుల బృందం నేడు సిఫార్సులు చేసింది.

Sputnik V: వచ్చే వారం నుంచి మార్కెట్‌లోకి..!

7. Positivity Rate: ఆ 10 రాష్ట్రాల్లో 25%పైనే!

దేశంలో కరోనా వైరస్‌ ఉగ్రరూపం కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో ఒక్కోచోట లక్షలకు పైగా యాక్టివ్‌ కేసులు ఉండగా.. 8 రాష్ట్రాల్లో 50వేల నుంచి లక్ష వరకూ ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. అలాగే, పది రాష్ట్రాల్లో 25శాతానికి పైగా కరోనా పాజిటివిటీ రేటు ఉన్నట్టు తెలిపారు. మే 3 నుంచి దేశంలో రికవరీ రేటు పెరుగుదల నమోదవుతోందని చెప్పారు.  కేరళ, తమిళనాడు, బెంగాల్‌లో భారీగా కొత్త కేసులు నమోదవుతున్నట్టు వెల్లడించారు. 

8. Bitcoin: ‘ఒక్క ట్వీట్‌తో ఎంత పనిచేశావ్‌ మస్కో’!

టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ చేసిన ఒకే ఒక్క ట్వీట్‌ ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌పై తీవ్ర ప్రభావం చూపింది. తన కంపెనీ అయిన టెస్లా కార్ల కొనుగోలుకు బిట్‌కాయిన్‌ను అనుమతిస్తామని గతంలో చెప్పిన మస్క్‌.. తాజాగా తన నిర్ణయం మార్చుకున్నారు. సదరు క్రిప్టోకరెన్సీని ఇకపై తన కార్ల కంపెనీ కొనుగోలుకు వినియోగించేందుకు అనుమతించేది లేదని ట్వీట్‌ చేశారు. బిట్‌కాయిన్‌ కోసం భారీగా విద్యుత్‌ ఖర్చు చేయాల్సి వస్తోందని, తద్వారా పర్యావరణానికి పెద్ద ఎత్తున హాని జరుగుతోందని మస్క్‌ పేర్కొన్నారు. కాబట్టి ఇకపై బిట్‌కాయిన్‌ను టెస్లా కార్ల కొనుగోలుకు అంగీకరించబోమని చెప్పారు.

9. Salman Radhe: ‘రాధే’ దెబ్బకు సర్వర్లు డౌన్‌

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ నటించిన చిత్రం ‘రాధే’. థియేటర్లతో పాటు ఓటీటీల్లోనూ గురువారం విడుదలైంది. అయితే.. ఒక్కసారిగా వినియోగదారులు సినిమా కోసం లాగిన్‌ కావడంతో ఓటీటీ వేదిక ‘జీ5’, ‘జీఫ్లెక్స్‌’ సర్వర్లు స్తంభించిపోయాయి. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సల్మాన్‌ఖాన్‌ సరసన దిశాపటానీ నటించింది. అయితే.. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ను చూసేందుకు ఈ రోజు మధ్యాహ్నం 12గంటలకు ఒక్కసారిగా పెద్దసంఖ్యలో సినీ ప్రియులు ఓటీటీలోకి లాగిన్‌ అయ్యారట. దీంతో సర్వర్లు ఒక్కసారిగా స్తంభించిపోయాయి. 

10. SRH: వార్నర్‌లా కోచ్‌లను తీసేయగలరా?

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సారథిగా డేవిడ్‌ వార్నర్‌ను తొలగించిన రీతిలోనే కోచ్‌లతోనూ వ్యవహరించగలరా అని క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ ప్రశ్నించారు. నాయకుడిగా తీసేసినా జట్టులో వార్నర్‌కు చోటివ్వకపోవడం ఆశ్చర్యకరమని పేర్కొన్నారు. అతడు తిరుగులేని బ్యాట్స్‌మన్‌ అని అభిప్రాయపడ్డారు. ఐపీఎల్‌-2021లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రదర్శన ఏ మాత్రం బాగాలేదు. 7 మ్యాచులాడి 1 మాత్రమే గెలిచింది. ఆ జట్టు బ్యాటింగ్‌ విభాగంలో లోపాలు కనిపించాయి. కలిసికట్టుగా ఆడినట్టు అనిపించలేదు. జట్టు యాజమాన్యం, సారథి ఆలోచనలు వేర్వేరుగా ఉన్నట్టు తెలిసింది. 

Covid-19: మీకోసం మేమున్నాం 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని