Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 29/07/2021 08:55 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. మానవీయ పరిష్కారం

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ మానవీయ సంప్రదాయానికి తెరతీశారు. రెండు దశాబ్దాల క్రితం విడిపోయి, సుప్రీంకోర్టు వరకు వెళ్లిన దంపతులను తానే చొరవ తీసుకుని కలిపారు. విభేదాలు మరిచిపోయి భావిజీవితం గడిపేలా ఓ కుటుంబపెద్దలా వారికి సర్దిచెప్పారు. బుధవారం సుప్రీంకోర్టులో చోటుచేసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా న్యాయవర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇటీవల కాలంలో న్యాయప్రక్రియలో మధ్యవర్తిత్వం ప్రాధాన్యాన్ని నొక్కిచెబుతున్న సీజేఐ.. తన నేతృత్వంలోని ధర్మాసనమే వేదికగా ఈ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. 

2. మూడో వేవ్‌ సంకేతాలపై అప్రమత్తం.. పీహెచ్‌సీల్లోనూ ఆక్సిజన్‌

ఇతర రాష్ట్రాల్లోని కొవిడ్‌ పరిస్థితులపై ప్రత్యేక కమిటీతో అధ్యయనం చేయించాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. అధ్యయనం చేయబోయే రాష్ట్రాల్లో కొవిడ్‌ పరిస్థితుల్లో వచ్చిన మార్పులు స్ఫూర్తిమంతంగా ఉంటే రాష్ట్రంలోనూ అనుసరించేందుకు అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలోని కొవిడ్‌ పరిస్థితులపై సీఎం జగన్‌ బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

3. జైలుకు ఉమా

మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు ఆగస్టు 10 వరకు రిమాండు విధించారు. ఆయనను బుధవారం సాయంత్రం రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. పోలీసులు ప్రత్యేక వాహనంలో బుధవారం రాత్రి 9.50 గంటల సమయంలో తరలించి, రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం అధికారులకు అప్పగించారు. జి.కొండూరు సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన ఘర్షణకు సంబంధించి ఉమా సహా 18 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 

4. మండలి స్థానాలకు త్వరలో ఎన్నికలు?

తెలంగాణ రాష్ట్ర శాసనమండలిలో ఖాళీగా ఉన్న ఆరు స్థానాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం యోచిస్తోంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు ఎలా ఉన్నాయి? కేసులు ఏమైనా వస్తున్నాయా? తీవ్రత ఏమైనా ఉందా? మండలి ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం ఏమిటి? తదితర అంశాలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది.

హుజూరాబాద్‌లో ఈటలకే మొగ్గు.. కాంగ్రెస్‌కు వచ్చేది అక్కడ 5 శాతం ఓట్లే

5. సారథి ఎవరైనా సై

భాజపాకు వ్యతిరేకంగా ఏర్పాటయ్యే విపక్ష కూటమికి ఎవరు నాయకత్వం వహించినా తనకు అభ్యంతరం లేదని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. సాధారణ కార్యకర్తగా పనిచేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. పరిస్థితులను బట్టి నాయకత్వంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరోవైపు- 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా విపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలను దీదీ మరింత ముమ్మరం చేశారు. 

6. సీసీవోగా తాత్కాలిక ఉద్యోగిని నియమిస్తారా?

నిబంధనల ముఖ్య అమలు అధికారిగా (సీసీవో) తాత్కాలిక ఉద్యోగిని నియమించిన ట్విటర్‌ తీరుపై దిల్లీ హైకోర్టు బుధవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. ఈ సామాజిక వేదిక కొత్త ఐటీ నిబంధనలను పాటించడం లేదని స్పష్టంచేసింది. సంస్థలో అత్యంత కీలకమైన నిర్వహణ అంశాలు చూసే ఉద్యోగి లేదా సీనియర్‌ ఉద్యోగిని సీసీవోగా నియమించడాన్ని నిబంధనలు తప్పనిసరి చేశాయని జస్టిస్‌ రేఖా పాటిల్‌ గుర్తుచేశారు.

7. Saudi Arabia: ఆ దేశాలకు వెళితే మూడేళ్ల నిషేధం..!

కొవిడ్‌ కట్టడిలో భాగంగా సౌదీ అరేబియా ప్రభుత్వం తమ పౌరులకు కొత్త ఆంక్షలు విధించింది. రెడ్‌ లిస్ట్‌ పేరుతో రూపొందించిన జాబితాలోని దేశాలకు వెళ్లిన వారికి భారీ జరిమానాలు సహా విదేశాలకు వెళ్లకుండా మూడేళ్లపాటు నిషేధం విధించనున్నట్టు ప్రకటించింది. నిషేధిత దేశాలకు వెళ్లడం కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించడమేనని అక్కడి సర్కారు స్పష్టం చేసింది. 

8. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌దారులకు భరోసా

దేశంలోని అన్ని వాణిజ్య బ్యాంకులు, విదేశీ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసే ఖాతాదారులకు భరోసా లభించనుంది. ఇప్పటివరకు లైసెన్సులు రద్దయి, బ్యాంకు లిక్విడేషన్‌లోకి వెళ్లినప్పుడే లభించే బీమా రక్షణ.. ఇక నుంచి మారటోరియం విధించిన బ్యాంకులకూ వర్తించనుంది. ఈ మేరకు డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ (డీఐసీజీసీ) 1961 చట్ట సవరణకు బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.

9. పతకం దిశగా వడివడిగా.. క్వార్టర్‌ ఫైనల్స్‌కు పి.వి.సింధు 

భారత స్టార్‌ షెట్లర్‌ పీవీ సింధు నేడు ప్రీక్వార్టర్స్‌లో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించారు. దీంతో ఆమె క్వార్టర్‌ ఫైనల్స్‌లో అడుగు పెట్టారు. ఆమె తన ప్రత్యర్థి  12వ ర్యాంక్‌ క్రీడాకారిణి బ్లింక్‌ ఫెల్ట్‌(డెన్మార్క్‌) పై  21-15,21-13 తేడాతో విజయం సాధించారు. మ్యాచ్‌ ఆద్యంతం సింధు ప్రత్యర్థిపై స్పష్టమైన ఆధిపత్యం చలాయించారు. మొత్తం 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి కోలుకోవడానికి ఏ దశలోనూ అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆమె పతకానికి మరింత చేరువైంది.

10. ‘ఏజెంట్‌’ కోసం...

నిన్న మొన్నటిదాకా లవర్‌బాయ్‌గా కనిపించాడు అఖిల్‌ అక్కినేని. ‘ఏజెంట్‌’ కోసం సరికొత్తగా మారాడు. కండలు పెంచడంతోపాటు మరింత స్టైలిష్‌గా మారిపోయాడు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ‘ఏజెంట్‌’ స్పై థ్రిల్లర్‌గా రూపొందుతోంది. సాక్షి వైద్య నాయిక. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సరెండర్‌ 2 సినిమా సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. రామబ్రహ్మం సుంకర నిర్మాత. వక్కంతం వంశీ కథని అందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని