Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు 

తాజా వార్తలు

Updated : 13/09/2021 21:08 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు 

1. దిల్లీ, ముంబై కన్నా హైదరాబాద్‌, బెంగళూరులే టాప్‌

ఆఫీసు స్పేస్‌ డిమాండ్‌ని అందిపుచ్చుకొని కొత్త కార్యాలయాలు ఏర్పాటు చేయడంలో దక్షిణాది రాష్ట్రాలదే పైచేయిగా ఉందని ‘అనరాక్‌’ నివేదిక తేల్చి చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం డిమాండ్‌లో గతేడాది చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లే 66 శాతం కార్యాలయాల స్థలాలను లీజుకి ఇచ్చాయి. 2018-2019లో ఈ నగరాల వాటా 47శాతం మాత్రమే. ప్రాపర్టీ కన్సల్టెంట్‌ సంస్థ అనరాక్‌ చెబుతున్న వివరాల ప్రకారం ఆఫీస్‌ స్పేస్‌ విషయంలో ఉత్తర, పశ్చిమ భారత దేశ నగరాలతో పోలిస్తే దక్షిణ భారత నగరాలు అనూహ్యమైన అభివృద్ధి కనబరుస్తున్నాయి.

2. వారంలోగా ఆన్‌లైన్‌లో తిరుమల సర్వదర్శన టికెట్లు

తిరుమల శ్రీ వేంకటేశ్వరుని సర్వదర్శన టికెట్లను వారంలోగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ‘సుపథం’ టికెట్లతో సమానంగా సర్వదర్శన టికెట్లు జారీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ముందుగా చిత్తూరు జిల్లా భక్తులకే సర్వదర్శన టికెట్లను పరిమితం చేసిన విషయం తెలిసిందే.

3. తెలంగాణ ఉద్యమ తరహాలో దళిత బంధు అమలు: సీఎం కేసీఆర్‌

శాసనసభ సాక్షిగా దళిత బంధు పథకం రూపకల్పన జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఈ పథకాన్ని రాష్ట్రం నలుదిక్కులా పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. దశల వారీగా తెలంగాణ ఉద్యమం తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో దళిత బంధు పైలట్‌ ప్రాజెక్టు అమలుపై సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. క్షేత్రస్థాయి అనుభవాలను కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ కర్ణన్‌ ముఖ్యమంత్రికి వివరించారు.

చెరువుల పరిరక్షణకు స్పెషల్ కమిషనర్: మంత్రి కేటీఆర్‌

ఈనెల 15నాటికి గ్రామ కమిటీల నిర్మాణం పూర్తి: కేటీఆర్

4. సామాన్యులకు భద్రత కల్పించలేని హోం మంత్రి: బండి సంజయ్‌

సామాన్యులకు భద్రత కల్పించలేని హోం మంత్రి రాజీనామా చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర 17వ రోజు మెదక్‌ జిల్లా చిన్న ఘన్‌పూర్‌లో కొనసాగుతోంది. సైదాబాద్‌లో చిన్నారి హత్యాచార ఘటనపై బండి సంబయ్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. 

5. TS: రాష్ట్రంలో 3 వేల డెంగ్యూ కేసుల: డీహెచ్‌

హైదరాబాద్‌లో ఈ ఏడాది ఇప్పటివరకు 613 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్‌) డా.శ్రీనివాస్‌ తెలిపారు. రాష్ట్రంలో కొవిడ్, సీజనల్ వ్యాధులుపై సీఎం కేసీఆర్‌ సమీక్షించినట్లు డీహెచ్ తెలిపారు. రాష్ట్రంలో కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో మలేరియా కేసులు  ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు.  2019లో రాష్ట్రంలో డెంగ్యూ కేసులు 4వేలు రిపోర్ట్ కాగా.. ఈ ఏడాది సెప్టెంబర్ 10 నాటికి 3 వేల కేసులు నమోదైనట్లు చెప్పారు. 

6. భాజపా ముఖ్యమంత్రులను అందుకే మారుస్తోంది..!

గుజరాత్‌తో పాటు భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను మార్చడం పట్ల కాంగ్రెస్‌ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే వారి ముఖ్యమంత్రులను బలిపశువులను చేస్తున్నట్లు ఆరోపించింది. గుజరాత్‌ సీఎంగా విజయ్‌ రూపానిని తప్పించి నూతన ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌ను ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఈ విధంగా స్పందించింది.

లాయర్ల సమరం.. మమతదే (నా) విజయం!?

7. నేను బతికే ఉన్నా: బరాదర్‌

అఫ్గానిస్థాన్‌లో తాజాగా ఏర్పడ్డ తాత్కాలిక ప్రభుత్వ ఉప ప్రధాని, తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ మృతిచెందినట్లు సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలోనే తన మరణ వార్తలను బరాదర్‌ ఖండించారు. తనకేమీ కాలేదని, క్షేమంగానే ఉన్నట్లు తాజాగా ఓ ఆడియో మెసేజ్‌ ద్వారా వెల్లడించినట్లు తెలుస్తోంది. తాలిబన్ల ప్రతినిధి సుహైల్‌ షహీమ్‌ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.

8. తాలిబన్ల ప్రతీకార హత్యలు.. మండిపడ్డ ఐరాస!

తాలిబన్లు ప్రతీకార హత్యలకు పాల్పడుతున్నట్లు వస్తోన్న ఆరోపణలపై విశ్వసనీయ సమాచారం తమకు చేరిందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం పేర్కొంది. ముఖ్యంగా మునుపటి ప్రభుత్వంలోని అధికారులు, వారి బంధువులను నిర్బంధించడం.. అనంతరం వారిలో కొందరిని హత్య చేస్తున్నట్లు తమకు నివేదికలు అందాయని ఐరాస స్పష్టం చేసింది. అఫ్గాన్‌ ప్రజలకు నిజంగా ఇది ఆపత్కాల సమయమేనని ఆందోళన వ్యక్తం చేసింది.

9. వ్యాక్సినేషన్‌లో కీలక మైలురాయి.. దేశంలో 75కోట్ల డోసుల పంపిణీ పూర్తి

కరోనా మహమ్మారిపై పోరాటంలో కీలక అస్త్రమైన వ్యాక్సిన్‌ పంపిణీలో భారత్‌ మరో కీలక మైలురాయిని దాటింది. జనవరి 16న దేశవ్యాప్తంగా ప్రారంభించిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 75 కోట్ల డోసులకు పైగా పంపిణీ జరిగినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. ఇదే రేటు కొనసాగితే డిసెంబర్‌ నాటికి 43శాతం దేశ ప్రజలకు వ్యాక్సినేషన్‌ పూర్తవుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

10. యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా కూడా ఇలానే చేసింది : గంగూలీ

వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌నకు మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనిని మెంటార్‌గా నియమించడాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ సమర్థించుకున్నాడు. అతడి అనుభవం భారత జట్టుకు కలిసొస్తుందని పేర్కొన్నాడు. 2019 యాషెస్‌ సిరీస్‌ సందర్భంగా ఆస్ట్రేలియా కూడా ఇలానే చేసిందని గుర్తు చేశాడు. ఆ జట్టు మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ వా ను మెంటార్‌గా నియమించిందని తెలిపాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని