close

తాజా వార్తలు

Updated : 04/05/2021 17:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

Top 10 news @ 5PM

1. Eatala: భూ వ్యవహారంపై మధ్యంతర ఉత్తర్వులు

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భూముల్లో ప్రభుత్వం సర్వే జరిపిన తీరును తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. సర్వే చేసే ముందు ఆయనకు నోటీసు ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సహజ న్యాయసూత్రాలను అధికారులు తీవ్రంగా ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. జమున హేచరీస్‌ భూములు, వ్యాపారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సంస్థపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. WhatsApp: వ్యాక్సిన్‌ సెంటర్‌ తెలుసుకోండిలా!

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతంగా సాగుతోంది. రోజుకు మూడు లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో వ్యాక్సినేషన్‌ విషయంలో కేంద్రం జోరు పెంచింది. దాని కోసం cowin.gov.inలో రిజిస్టర్‌ చేసుకోమని కోరింది. ఆరోగ్య సేతు, ఉమంగ్ యాప్‌లలో కూడా రిజిస్టర్‌ చేసుకోమని తెలిపింది. ఒకవేళ మీరూ వ్యాక్సిన్‌ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించిన వివరాలు అందించడానికి ఓ వాట్సాప్‌ బాట్‌ను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆ బాట్‌ను మీకు వాక్సినేషన్‌కు సంబంధించిన వివరాలను అందిస్తుంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. IPL నిరవధిక వాయిదా

ఐపీఎల్‌పై కరోనా మహమ్మారి పడగ విసిరింది. పలు జట్ల ఆటగాళ్లు వైరస్‌ బారిన పడుతుండటంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్‌ను ఐపీఎల్‌ మ్యాచ్‌లను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్ల ప్రకటించారు. ఆటగాళ్ల కరోనాబారిన పడుతుండటంతో తాజా పరిస్థితులపై చర్చించేందుకు ఐపీఎల్‌ పాలక మండలి, బీసీసీఐ అత్యవసర సమావేశాన్ని నిర్వహించాయి. ఈ భేటీలో ఈ ఐపీఎల్‌ సీజన్‌ను నిరవధికంగా వాయిదా వేయాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. వంతెన కూలి కిందపడ్డ మెట్రో రైలు..

మెక్సికోలో ఘోర ప్రమాదం సంభవించింది. వంతెన కూలి దానిపై వెళుతున్న మెట్రో రైలు కిందపడగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని మెక్సికో సిటీలో ఓ వంతెనపై మెట్రో రైలు దూసుకెళుతుండగా వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఆ రైలు కింద వెళుతున్న కార్లపై పడింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా.. మరో 70 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని అంతర్జాతీయ మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. ఏపీ కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు! 

ఏపీ సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో దాదాపు మూడు గంటల పాటు కొనసాగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి అనుసరించాల్సిన వ్యూహాలపైనే కీలకంగా చర్చించారు. బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూను ఎలా అమలు చేయాలి? విధివిధానాలేంటి? అనే అంశంపై మంత్రుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్త కర్ఫ్యూ నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో మధ్యాహ్నం 12గంటల తర్వాత ఎక్కడా జనసంచారం లేకుండా ఉండేందుకు పోలీసులు, ఇతర యంత్రాంగం సమన్వయంతో పనిచేసి కర్ఫ్యూని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. స్వల్పంగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధర

దేశంలో  18 రోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మంగళవారం పెరిగాయి. లీటర్‌ పెట్రోల్‌పై 15 పైసలు, లీటర్‌ డీజిల్‌పై 18 పైసల చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొద్దిరోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి. చమురు ధరలను చివరిసారి ఏప్రిల్‌ 15న సవరించారు. అప్పుడు లీటర్‌ పెట్రోల్‌పై 16 పైసలు, డీజిల్‌పై  14 పైసలు తగ్గించారు. ఈరోజు పెరిగిన ధరతో దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.55కు, డీజిల్‌ ధర రూ.80.91లకు చేరింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7 . Stock market: ఆద్యంతం ఒడుదొడుకులమయం!

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య ట్రేడింగ్‌ కొనసాగించాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు కాసేపటికే నష్టాల్లోకి జారుకొని, తిరిగి పుంజుకొని మధ్యాహ్నం వరకూ నిలకడగా సాగాయి. అనంతరం ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తడంతో అంతకంతకూ దిగజారుతూ ఇంట్రాడే కనిష్ఠాలను నమోదు చేశాయి. ఉదయం 48,881 వద్ద లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌ చివరకు 465 పాయింట్లు కోల్పోయి 48,253 వద్ద ముగిసింది. నిఫ్టీ 137 పాయింట్లు దిగజారి 14,496 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 73.85 వద్ద నిలిచింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8 . అడిగితే నేనే రాజీనామా చేసేవాడిని: ఈటల

ప్రగతిభవన్‌లో సీఎంను కలిసే అవకాశం కూడా మంత్రులకు ఉండదని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ విమర్శించారు. సీఎంకు ఆరోగ్యం బాగాలేదని తెలిసి కలవడానికి మంత్రులు వెళితే అనుమతించలేదని ఆయన ఆరోపించారు. ఇంత అహంకారమా? అని ఆరోజు మంత్రి గంగుల కమలాకర్‌ తనతో వ్యాఖ్యానించారని ఈటల అన్నారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌ తనపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో హుజూరాబాద్‌లోని నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. hyderabad: సింహాలకు సార్స్‌ కొవ్‌-2

హైదరాబాద్‌ నగరంలోని జూ పార్కులో వైరస్‌ కలకలం రేపుతోంది. ఎనిమిది సింహాలకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వార్తలు రావడం ఆందోళన కలిగించింది. సింహాలకు కరోనా లక్షణాలు కన్పించడంతో వాటి నమూనాలు సేకరించిన అధికారులు వాటిని సీసీఎంబీకి పంపించారు. వాటిని పరిశీలించిన వైద్య నిపుణులు మృగరాజులకు సార్స్‌ కొవ్‌-2 వైరస్‌ సోకినట్టు వెల్లడించారు. ఇది కొవిడ్‌ కాదని, సార్స్‌ కొవ్‌-2గా దీన్ని వ్యవహరిస్తారని వైద్యులు తెలిపారు. దీని వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం సింహాల ఆరోగ్యం బాగానే ఉన్నట్టు అధికారులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. ఉపాధి కోల్పోయిన‌ ఉద్యోగులు

ఈ ఏప్రిల్‌లో 73.5 ల‌క్ష‌ల‌కు పైగా భార‌తీయులు ఉద్యోగాలు కోల్పోయారు. కోవిడ్ కేసులు ఉధృతం అయిన ఒక నెల‌లో ఉద్యోగ న‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ఇది దేశంలోని అనేక ప్రాంతాల‌లో వ్యాపారాలు దెబ్బ‌తిన‌డం కూడా కార‌ణ‌మ‌య్యింది. ఫిబ్ర‌వ‌రి, మార్చి నెల‌ల్లో కొద్దిగా ఉద్యోగ న‌ష్టాలు వ‌చ్చాయి. ఇక ఏప్రిల్‌లో కోవిడ్ మ‌హామ్మారి విశ్వ‌రూపం చూపించ‌డంతో కార్మిక‌, ఉద్యోగ మార్కెట్ కుప్ప‌కూలింది. క‌నీసం 73.5 ల‌క్ష‌ల‌కు పైగా ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని