Top Ten News @ 5 PM
close

తాజా వార్తలు

Published : 25/06/2021 16:55 IST

Top Ten News @ 5 PM

1. ఏపీ సర్కారును అభినందించిన సుప్రీంకోర్టు

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది దుష్యంత్‌ దవే పరీక్షల రద్దు విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మార్కులు, ఫలితాల వెల్లడికి కమిటీని నియమించనున్నట్లు తెలిపారు. బోర్డు పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. 

సీల్డ్‌ కవర్‌లో నివేదిక ఇవ్వండి: ఏపీ హైకోర్టు

2. Ts News: అన్నిశాఖల సమన్వయంతో బోనాలు

ఆషాఢ మాసం బోనాల సందర్భంగా అన్ని శాఖల సమన్వయంతో ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా వేడుకలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. జులై 13న గోల్కొండలో ప్రభుత్వ లాంఛనాలతో బోనాల పండుగ ప్రారంభం కానుందని చెప్పారు. ఆషాఢ మాసం బోనాల నిర్వహణ, ఏర్పాట్లపై హైదరాబాద్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

3. రెచ్చగొట్టే ఉద్దేశం మాకు లేదు: పేర్నినాని

కృష్ణా జలాలపై భావోద్వేగాలు రెచ్చగొట్టే ఉద్దేశం ఏపీ ప్రభుత్వానికి లేదని.. ఇలాంటి వ్యాఖ్యల వల్ల రెండు రాష్ట్రాలకు ఎలాంటి ఉపయోగం ఉండదని మంత్రి పేర్ని నాని అన్నారు. రాజకీయాల కోసమే తెలంగాణ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం సహా పొరుగు రాష్ట్రాలతో సామరస్యంగా ఉండాలనేదే ముఖ్యమంత్రి జగన్‌ విధానమన్నారు. జలాల వినియోగంపై సీఎం కేసీఆర్‌తో చర్చలు జరిపేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారన్నారు. కృష్ణా నది నుంచి గ్లాసు నీరు కూడా అదనంగా తీసుకోవడం లేదని మంత్రి స్పష్టం చేశారు.

4. ‘పీజేఆర్‌ చావుకు వైఎస్‌ కారణం కాదా?’

రాయలసీమ ఎత్తిపోతల పథకం సెగలు కొనసాగుతున్నాయి. పోతిరెడ్డిపాడుకు డబుల్‌ దోపిడీ చేసేలా ఏపీ సీఎం జగన్‌ వ్యవహరిస్తున్నారని తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మండిపడ్డారు. ఏపీతో మంచిగా ఉండాలనుకున్నా.. జగన్‌ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలనపై ఆయన నిప్పులు చెరిగారు. ఓ ముఖ్యమంత్రే తెలుగు గంగ పేరుతో నీళ్లు తరలిస్తే.. ఇప్పుడు కృష్ణా బేసిన్‌ పరిధిలో లేని నెల్లూరుకు తీసుకెళ్తామనడం సరికాదన్నారు. పాలమూరు-రంగారెడ్డికి ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో ఇచ్చారని.. కొత్తదేమీ కాదని చెప్పారు. 

5. Delta Plus: ఏపీలో తొలి కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్‌లో తొలి డెల్టా ప్లస్‌ కేసు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. కొన్ని రోజుల ముందు తిరుపతిలో డెల్టా ప్లస్‌ కేసు నమోదైందని తెలిపారు. అయితే డెల్టా ప్లస్‌ సోకిన వ్యక్తికి చికిత్స కూడా పూర్తి అయిందని.. బాధితుడి నుంచి ఇతరులెవరికీ వ్యాపించలేదని ఆళ్ల నాని స్పష్టం చేశారు. బ్లాక్‌ ఫంగస్‌, డెల్టా ప్లస్‌ కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. అందుకు కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై సీఎం జగన్‌ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న మంత్రి ఆళ్ల నాని ఈ విషయాన్ని వెల్లడించారు.

Delta plus: మహారాష్ట్రలో తొలి మరణం నమోదు!
Delta Plus:  మళ్లీ మాస్కులు ధరించండి

6. Twitter: ఐటీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఖాతా నిలిపివేత

కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ట్విటర్‌ ఖాతాను సామాజిక మాధ్యమ సంస్థ నిలిపివేసింది. తన ట్విటర్‌ ఖాతా గంటపాటు నిలిచిపోయినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. గత కొంతకాలంగా ట్విటర్‌, కేంద్రం మధ్య విభేదాలు నెలకొన్న సమయంలో తాజా పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘‘ఫ్రెండ్స్‌.. ఈ రోజు ఓ విచిత్రం జరిగింది. ట్విటర్‌ దాదాపు గంట పాటు నా ఖాతాను యాక్సిస్‌ చేసుకోనివ్వలేదు. అమెరికా డిజిటల్‌ మిలీనియం కాపీరైట్‌ చట్టం నిబంధనలను ఉల్లంఘించిందని చెప్పి నా ఖాతాను కొంతసేపు బ్లాక్‌ చేసింది. ఆ తర్వాత యాక్సిస్‌ను పునరుద్ధరించింది’’ అని రవిశంకర్‌ ప్రసాద్‌ వెల్లడించారు.

7. Delta plus: ‘డెల్టాప్లస్‌’పై రాహుల్‌ 3 ప్రశ్నలు

దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి తగ్గుముఖం పడుతున్న సమయంలో ‘డెల్టా ప్లస్‌’ వేరియంట్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఈ వేరియంట్‌ను కేంద్రం ‘ఆందోళనకర రకం’గా పేర్కొనడం, దీని కారణంగా మూడో దశ ముప్పు రావొచ్చని నిపుణులు హెచ్చరించడం కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో ‘డెల్టా ప్లస్‌’ వ్యాప్తిపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఈ రకాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోందో చెప్పాలంటూ కేంద్రానికి మూడు ప్రశ్నలు సంధించారు. 

8. Russia: మళ్లీ ఇటువైపు చూస్తే మీపై బాంబులేస్తాం..!

బ్రిటన్‌ - రష్యా ఘర్షణకు నల్ల సముద్రం వేదికగా మారింది. క్రిమియా సముద్ర జలాల్లోకి వచ్చిన బ్రిటన్‌ నౌకపై రష్యా హెచ్చరికగా కాల్పులు జరపడంతో పాటు.. యుద్ధవిమానాలతో సమీపంలో బాంబులు కూడా వేసింది. ఈ ఘటన ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. ఇరుదేశాల మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది. బ్రిటన్‌ రాయల్‌ నేవీకి చెందిన డెస్ట్రాయర్‌ హెచ్‌ఎంఎస్‌ డిఫెండర్‌ ఇటీవల ఉక్రెయిన్‌లోని ఒడిశా పోర్టుకు వెళ్లింది. అక్కడి నుంచి జార్జియాకు వెళ్లే క్రమంలో క్రిమియా జలాల్లోకి ప్రవేశించింది.

9. WTC Final: టెస్టు గదకు పేరు పెట్టిన కివీస్‌ క్రికెటర్లు

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ గెలిచిన న్యూజిలాండ్‌ ఆటగాళ్లు తిరిగి స్వదేశానికి ప్రయాణమయ్యారు. సొంతగడ్డపై లభించే ఘన స్వాగతం గురించి ఆసక్తిగా ఉన్నారు. ప్రపంచ విజేతగా అవతరించాక తొలిరాత్రి ఎలా గడిచిందో.. సంబరాలు ఎలా చేసుకున్నారో.. విమానం ఎక్కేముందు ఆటగాళ్లు వివరించారు. ఐసీసీ అందజేసిన టెస్టు గదకు వారొక పేరు పెట్టారు. టెస్టు గదకు ‘మైకేల్‌ మేసన్‌’ అని పేరు పెట్టారు. ఇందుకో కారణం ఉంది. మైకేల్‌ మేసన్‌ కివీస్‌ తరఫున 2004లో ఒకే ఒక టెస్టు ఆడాడు. 26 వన్డేలు, 3 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు.

10. Stock market: నష్టాల నుంచి లాభాల్లోకి

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం కాస్త ఊగిసలాట ధోరణి కనబరిచిన సూచీలు క్రమంగా పుంజుకొని ఇంట్రాడే గరిష్ఠాల్ని నమోదు చేశాయి. లోహ, బ్యాంకింగ్‌ రంగాల మద్దతుతో పాటు టాటా స్టీల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ వంటి కీలక కంపెనీలు రాణించడం సూచీలకు దన్నుగా నిలిచింది. చివరకు సెన్సెక్స్‌ 226 పాయింట్లు ఎగబాకి 52,925 వద్ద ముగియగా.. నిఫ్టీ 69 పాయింట్లు లాభపడి 15,860 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.17 వద్ద నిలిచింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని