close

తాజా వార్తలు

Published : 01/10/2020 08:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. అందరూ నిర్దోషులే

బాబ్రీ మసీదు కూల్చివేతకు కుట్ర పన్నారనే అభియోగాలను ఎదుర్కొంటున్న భాజపా అగ్రనేతలు సహా 32 మందీ నిర్దోషులని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం కీలక తీర్పు వెలువరించింది. దీంతో ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌జోషి, ఉమాభారతి, కల్యాణ్‌సింగ్‌ వంటి నేతలకు అభియోగాల నుంచి విముక్తి లభించింది. వివాదాస్పద కట్టడం లోపల రాముడి విగ్రహాలు కూడా ఉన్నందువల్ల దానిని రక్షించాలని విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) దివంగత నేత అశోక్‌ సింఘాల్‌ ఆరోజు ప్రయత్నించినట్లు సీబీఐ న్యాయస్థానం జడ్జి ఎస్‌.కె.యాదవ్‌ ఈ తీర్పులో పేర్కొన్నారు. కూల్చివేయాలనే ముందస్తు ప్రణాళిక లేదని, అది అనుకోకుండా (యాక్సిడెంటల్‌గా) జరిగిందేనని స్పష్టంచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఏపీకి దీటుగా బదులివ్వాలి

నదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ కావాలనే కయ్యం పెట్టుకుంటుంటే, కేంద్రం నిష్క్రియాపరత్వం, అలసత్వంతో వ్యవహరిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్వజమెత్తారు. జల వివాదాలపై ఆరోతేదీన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం జరగనున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై గురువారం నీటిపారుదల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. సమగ్ర వివరాలతో రావాలని అధికారులను ఆదేశించారు. అపెక్స్‌ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ వాదనలకు దీటైన సమాధానం చెప్పాలని, మళ్లీ తెలంగాణ జోలికి రాకుండా వాస్తవాలను కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. భాషణ కాదు దూషణలే

అమెరికా అధ్యక్ష పదవి కోసం హోరాహోరీగా పోటీపడుతున్న డొనాల్డ్‌ ట్రంప్‌ (రిపబ్లికన్‌ పార్టీ), జో బైడెన్‌ (డెమొక్రాట్‌)ల తొలి  ముఖాముఖి చర్చ దూషణలకే పరిమితమైంది. అమెరికా చరిత్రలో అత్యంత కీలకమైన ఎన్నికల్లో ఒకటిగా భావిస్తున్న ఈ అధ్యక్ష పోరులో... ట్రంప్‌, బైడెన్‌ల బుధవారం నాటి చర్చ ఎంతో ఆసక్తిని రేపినా చివరికి అది అటు అమెరికన్లతో పాటు చూసిన అందరిలోనూ నిరాశను మిగిల్చింది. మంచి రసవత్తరమైన చర్చను చూసి పడుకుందామనుకున్న కోట్ల మందికి అసంతృప్తిని మిగిల్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. ఒప్పంద సేద్యంలో కంపెనీలదే పెత్తనం!

ఒప్పంద సేద్యం (కాంట్రాక్టు ఫార్మింగ్‌) చట్టం కింద పంట సాగుచేస్తే కంపెనీలు పెట్టే ఆంక్షలకు రైతులు కట్టుబడి ఉండాల్సిందేనని కేంద్రం రూపొందించిన పత్రం స్పష్టం చేస్తోంది. పంటల మార్కెటింగ్‌కు సంబంధించి 3 బిల్లులను పార్లమెంటులో ఆమోదించిన వెంటనే వాటిని చట్టాలుగా కేంద్రం గెజిట్‌లో నోటిఫై చేసి అమల్లోకి తెచ్చింది. ఈ విధానంలో రైతు, కంపెనీకి మధ్య చేసుకునే 13 పేజీల ‘ఒప్పంద పత్రం’ నమూనాను అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖలకు తాజాగా పంపింది. కొత్త రబీ (యాసంగి) సీజన్‌ నుంచే ఈ పత్రం ప్రకారం ఒప్పంద సేద్యం అమలుకు కేంద్ర వ్యవసాయ శాఖ ఆదేశాలిచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. హైదరాబాద్‌కు ప్రైవేటు రయ్‌.. రయ్‌..

ఏపీ, తెలంగాణల మధ్య అక్టోబరు ఆరంభం నుంచి పూర్తి స్థాయిలో బస్సులను నడిపేందుకు ప్రైవేటు ట్రావెల్స్‌ యాజమాన్యాలు సమాయత్తమయ్యాయి. సెప్టెంబరు 2 నుంచి ప్రైవేటు బస్సులను హైదరాబాద్‌కు నడిపేందుకు రవాణాశాఖ అనుమతించింది. అటు తెలంగాణ రవాణాశాఖ కూడా పన్ను చెల్లించి నడిపేలా అవకాశం కల్పించింది. దీంతో తొలుత 50 బస్సులు హైదరాబాద్‌కు రాకపోకలు ఆరంభించగా, క్రమంగా ఆ సంఖ్య 300 వరకు చేరింది. అక్టోబరు నుంచి 800కుపైగా బస్సులు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు పరుగులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. అక్టోబరు నుంచి డిసెంబరు వరకు వర్తించే మూడో త్రైమాసిక పన్నును దాదాపు అన్ని ట్రావెల్స్‌ యాజమాన్యాలు చెల్లించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఎస్పీబీకి భారతరత్న సాధించాలి

దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న దక్కేలా దక్షిణాది రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్షుడు కాట్రగడ్డ ప్రసాద్‌ కోరారు. ‘పాడుతా తీయగా’ కార్యక్రమం ద్వారా ఎస్పీ బాలు ఎంతోమంది చిన్నారులను గాయనీగాయకులుగా తీర్చిదిద్దారని తెలిపారు.‘స్వరాభిషేకం’తో అందర్నీ సంగీత కడలిలో ముంచెత్తారని కీర్తించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంతాపసభ బుధవారం రాత్రి చెన్నైలోని ఓ హోటల్‌లో జరిగింది. చిత్ర పరిశ్రమ నుంచి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఐటీ రిటర్న్‌ల దాఖలుకు నవంబరు 30 వరకు గడువు

కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో 2019-20 అసెస్‌మెంట్‌ సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్న్స్‌ దాఖలుకు గడువును నవంబరు 30 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్న్స్‌ దాఖలుకు సీబీడీటీ గతంలో జూన్‌ 30వరకు గడువు ఇచ్చింది. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గనందున, ఈ గడువును జులై 31, సెప్టెంబరు 30 వరకు దశలవారీగా పొడిగించింది. ఇప్పుడు ఆ గడువును నవంబరు 30వరకు పొడిగిస్తున్నట్లు సీబీడీటీ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. రాయల్స్‌ బ్యాట్లెత్తేశారు..

టీ20 క్రికెట్‌ ఎంత అనిశ్చితితో కూడుకున్నదో! ఎంతలో ఎంత తేడా. గత మ్యాచ్‌లో కొండంత లక్ష్యాన్ని పిండి చేస్తూ రికార్డు బద్దలు కొట్టిన రాజస్థాన్‌ ఈసారి బ్యాట్లెత్తేసింది. కోల్‌కతా బౌలింగ్‌కు దాసోహమంటూ బొక్కబోర్లా పడింది. సంజు మెరుపులు లేవు.. తెవాతియా తెగింపూ లేదు. కనీస పోరాటం కరవైన వేళ చాలా ముందే స్మిత్‌సేన పరాభవం ఖాయమైంది. శుభ్‌మన్‌ నిలకడైన బ్యాటింగ్‌కు యువ బౌలర్లు శివమ్‌ మావి, నాగర్‌కోటిల పదునైన పేస్‌ తోడవడంతో రాజస్థాన్‌ను కోల్‌కతా చిత్తుగా ఓడించింది. తొలి మ్యాచ్‌లో ఓడిన నైట్‌రైడర్స్‌కు ఇది వరుసగా రెండో విజయం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పోరాటంతో మొదలెడతాడు

‘పుష్ప’రాజ్‌ రంగంలోకి దిగే సమయం వచ్చింది. అడవుల్లో అతని పోరాటం షురూ కాబోతోంది. అందుకోసం ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి. సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ కథానాయకుడిగా ‘పుష్ప’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. ఇందులో పుష్పరాజ్‌ అనే యువకుడిగా అల్లు అర్జున్‌ కనిపించనున్నారు. నవంబరు నుంచి చిత్రీకరణ మొదలు కానున్నట్టు సమాచారం. మొదట పోరాట ఘట్టాలతోనే చిత్రీకరణని షురూ చేయనున్నారు. అందుకోసం హైదరాబాద్‌లో రిహార్సల్స్‌ కూడా ఆరంభించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రోజుకు 87 అత్యాచారాలు.. 79 హత్యలు

భారత్‌లో 2019లో రోజుకు సగటున 87 అత్యాచార ఘటనలు జరగ్గా.. 79 హత్య కేసులు నమోదయ్యాయని జాతీయ నేర నమోదు విభాగం(ఎన్‌సీఆర్‌బీ) నివేదించింది. మహిళలపై నేరాల్లో 2019లో 7.3 శాతం పెరుగుదల నమోదైంది. 2018లో ఈ సంఖ్య 3.78 లక్షలు ఉండగా.. గతేడాది 4.05 లక్షలకు చేరినట్లు పేర్కొంది. ఇందులో అధిక శాతం (30.9శాతం) గృహ హింసకు సంబంధించినవేనని తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో ఉద్దేశపూర్వక దాడులు(21.84 శాతం) అపహరణలు (17.9 శాతం), అత్యాచారాలు (7.9 శాతం) ఉన్నాయి. మహిళలపై నేరాల జాబితాలో ఉత్తర్‌ప్రదేశ్‌ మొదటిస్థానంలో ఉంది. అదేవిధంగా 2019లో దేశంలో రోజుకు సగటున 79 హత్య కేసులు నమోదయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.