close

తాజా వార్తలు

Published : 12/10/2020 22:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారతీయుల సేవకు బ్రిటన్‌ రాణి గుర్తింపు

 ‘క్వీన్స్‌ బర్త్‌డే హానర్స్‌ లిస్ట్‌’ జాబితాలో స్థానం

లండన్‌: బ్రిటన్‌ దేశానికి నిరుపమాన సేవలందించిన వారికి గుర్తింపుగా వెలువడే ‘క్వీన్స్‌ బర్త్‌డే హానర్స్‌ లిస్ట్‌’లో ఈ సంవత్సరం పలువురు భారత సంతతి వ్యక్తులకు స్థానం దక్కింది. మహారాణి క్వీన్‌ ఎలిజబెత్‌ జన్మదిన సందర్భంగా ప్రతి ఏటా జూన్‌లో ఈ జాబితాను ప్రచురించటం ఆనవాయితీ. అయితే కరోనా మహమ్మారి సేవల్లో భాగం పంచుకున్న వారిని గౌరవించే నిమిత్తం ఈ సంవత్సరం ఆలస్యంగా ప్రచురించారు. కొవిడ్‌-19 మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో నిస్వార్ధ సేవలందించిన మొత్తం 414 వీరులతో కూడిన ప్రతిష్ఠాత్మక పురస్కారం సీబీఈ (కమాండర్‌ ఆఫ్‌ ద మోస్ట్‌ ఎక్సలెంట్‌ ఆర్డర్‌ ఆఫ్ ద బ్రిటిష్‌ ఎంపైర్‌) జాబితా ఇటీవల విడుదలైంది. మహారాణి 94వ జన్మదిన సందర్భంగా ఈ జాబితాను ప్రకటించారు. గుర్తింపు ఆశించని ఈ బ్రిటిష్‌ భారతీయ వీరులందరి కఠిన పరిశ్రమ, అంకిత భావం దేశం కరోనా వైరస్‌ గడ్డు పరిస్థితిని ఎదుర్కొనేందుకు దోహదపడిందని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఈ సందర్భంగా వారిని ప్రశంసించారు.

74 ఏళ్ల వయసులో కూడా ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలతో లాక్‌డౌన్‌ సమయంలో స్ఫూర్తి నందించటమే కాకుండా.. కరోనా బాధితుల కోసం సుమారు 14,000 పౌండ్ల విరాళం సేకరించిన  ‘స్కిప్పింగ్‌ సిఖ్‌’ రాజిందర్‌ సింగ్‌ హజ్రాల్‌ను సీబీఈ పురస్కారం వరించింది. బ్రిటన్‌లో సూపర్‌ మార్కెట్‌ గొలుసుకట్టు వ్యాపార సంస్థ ‘అస్దా’తో సంచలన విజయం సాధించిన జుబేర్‌ ఇస్సా, మొహిసిన్‌ ఇస్సా సోదరులకు.. వ్యాపారం, దాతృత్వానికి గాను ఈ గౌరవం దక్కింది. వీరి తల్లితండ్రులు గుజరాత్‌కు చెందిన వారు.

ఇక  పర్యావరణ వ్యవస్థ శాస్త్రానికి అందచేసిన సేవలకు గాను ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ యదువీర్‌ సింగ్‌ మాల్హీ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈయన లండన్‌లోని ప్రముఖ ‘నేచురల్‌ హిస్లరీ మ్యూజియం’ ట్రస్టీగా కూడా వ్యవహరిస్తున్నారు. లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజ్‌కు చెందిన కెమికల్‌ ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్‌ నిలయ్‌ షా..  వైద్యం, సేవా రంగాల్లో అత్యుత్తమ సేవలకు గాను ‘హీలింగ్‌ లిటిల్‌ హార్ట్స్‌’ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ సంజీవ్‌ నిచానీలకు క్వీన్స్‌ బర్త్‌డే హానర్స్‌ లిస్ట్‌లో స్థానం దక్కింది.

కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో బ్రిటన్‌లో గురుద్వారాలు మూతబడిన నేపథ్యంలో సిక్కులు  ప్రార్థనలు నిర్వహించేందుకు వీలుగా ఓ ఆన్‌లైన్‌ పోర్టల్‌ను రూపొందించిన సందీప్‌ సింగ్‌ దహెలే, కరోనా కాలంలో ఫిట్‌నెస్‌, ఆరోగ్యానికి గల ప్రాముఖ్యతను ప్రచానం చేసిన లవీనా మెహతా, మహిళల నెలసరి సంబంధింత  వస్తువులను ఉచితంగా అందిస్తున్న సేవా సంస్థ ‘బిన్‌తీ’ స్థాపకురాలు మన్‌జిత్‌ కౌర్‌ గిల్‌, నృత్య అధ్యాపకురాలు పుష్కలా గోపాల్‌, విద్యాశాఖ ఉన్నతాధికారి వసంత్‌ పటేల్‌, బల్జీత్‌ కౌర్‌ సంధు సామాజిక సేవా సంస్థ ‘సెంటర్‌ ఫర్‌ నాలెడ్జ్‌ ఈక్విటీ’ కూడా వీరిలో ఉన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని