
తాజా వార్తలు
పూరీ ఆలయం తెరుచుకునేది ఎప్పుడంటే..!
భువనేశ్వర్: ఒడిశాలోని ప్రముఖ పూరీ జగన్నాథ క్షేత్రం డిసెంబర్ మూడో వారంలో తిరిగి తెరుచుకునేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ప్రధానాధికారి క్రిష్ణన్ కుమార్ వెల్లడించారు. కొవిడ్ నిబంధనల్లో భాగంగా భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రామాణిక నిర్వహణ పద్ధతులను(ఎస్ఓపీ) రూపొందిస్తున్నట్లు తెలిపారు. కరోనా విజృంభణ కారణంగా గత ఏడు నెలలుగా పూరీ ఆలయంలో భక్తుల దర్శనాలకు అనుమతి ఇవ్వడంలేదు. కేవలం ఆలయ సేవకులకు మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు.
కరోనా విజృంభణ నేపథ్యంలో మార్చి నెల నుంచి పూరీ ఆలయం మూసివున్న విషయం తెలిసిందే. అయితే, అన్లాక్ ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా చాలా దేవాలయాలు తెరుచుకుంటున్నాయి. కానీ, ఒడిశాలోని జగన్నాథ ఆలయంలో మాత్రం దర్శనాలకు అనుమతి ఇవ్వడం లేదు. నిత్యం రోజువారీ పూజా కార్యక్రమాలను మాత్రం కొనసాగిస్తున్నారు. అన్లాక్ ప్రక్రియ ప్రారంభమైన సమయంలోనే ఆలయంలో వందల మంది సేవకులకు కరోనా సోకింది. సెప్టెంబర్ నెల నాటికే దాదాపు 400మంది సేవకులు కరోనా బారినపడ్డట్లు తేలింది. దీంతో మరికొంత కాలం దేవాలయాన్ని మూసి ఉంచాలని నిర్ణయించారు.
దీంతో అటు భక్తులతోపాటు భాజపా, కాంగ్రెస్ పార్టీలు నవీన్ పట్నాయక్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చాయి. కరోనా తీవ్రత అధికంగా ఉన్న మహారాష్ట్రలోనూ దేవాలయాలను తెరుస్తున్న నేపథ్యంలో ఒడిశాలో ఎందుకు తెరవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. కేవలం కరోనా పరిస్థితుల నేపథ్యంలోనే ఆలయాన్ని మూసివుంచామని అధికార బీజేడీ సమాధానమిచ్చింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ మూడో వారం నుంచి భక్తుల దర్శనాలకు అనుమతిచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని ఆలయాధికారులు ప్రకటించారు.