ఆపత్కాలంలో.. ‘సామాజిక’ స్ఫూర్తి
close

తాజా వార్తలు

Updated : 30/04/2021 11:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆపత్కాలంలో.. ‘సామాజిక’ స్ఫూర్తి

కరోనా రోగులకు సాయం అందించడంలో అండ

* మియాపూర్‌లో ఉండే వ్యక్తికి కరోనా సోకడంతో ఇంట్లోనే హోం ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఉన్నట్టుండి ఆక్సిజన్‌ స్థాయి పడిపోయింది. పలు ఆసుపత్రులకు ఫోన్‌ చేసి ఆక్సిజన్‌ బెడ్ల కోసం ప్రయత్నించినా ఖాళీ లేవనే సమాధానం వచ్చింది. చివరికి సదరు వ్యక్తి సోదరి ప్రముఖ నాయకులు, ఆరోగ్య శాఖను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేసింది. వెంటనే ట్వీట్‌ను మరికొందరు రీట్వీట్‌ చేశారు. గంట తర్వాత మలక్‌పేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆక్సిజన్‌ బెడ్‌ ఖాళీగా ఉన్నట్లు సమాచారం వచ్చింది. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లి చేర్పించడంతో చికిత్స కొనసాగుతోంది.

* సికింద్రాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో కరోనా బాధితురాలికి ఒ-పాజిటివ్‌ ప్లాస్మా అవసరమైంది. వెంటనే రోగి వివరాలు, ఫోన్‌ నంబర్లతో కూడిన సమాచారాన్ని రోగి బంధువు ఒకరు ట్విటర్‌లో పోస్టు చేశారు. దీన్ని ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ చిత్ర యూనిట్‌ రీట్వీట్‌ చేసింది. ప్లాస్మా దాతల వివరాలతో కూడిన సమాచారాన్ని పలువురు నెటిజన్లు ట్విటర్‌లో పంచుకున్నారు. ప్లాస్మా దాత దొరకినట్లు రోగి బంధువు వెల్లడించి అందరికీ కృతజ్ఞతలు చెప్పాడు. మరో ఘటనలో రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్‌ కావాలని ట్విటర్‌లో అభ్యర్థించగా..పలువురు రెమ్‌డెసివిర్‌ డిస్ట్రిబ్యూటర్ల ఫోన్‌ నంబర్లతో కూడిన సమాచారం అందించారు.

ఐసీయూ బెడ్లు దొరకవు.. ఆక్సిజన్‌ సదుపాయం లభించదు.. రెడ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ల పేరిట బ్లాక్‌మార్కెట్‌ దందా.. ఇలా కొవిడ్‌తో పోరాడుతున్న వారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటి తరుణంలో రోగుల అవస్థలు తీరుస్తూ.. వారి బంధువుల యాతనను ఆలకించేందుకు సామాజిక మాధ్యమాలు వేదికగా మారాయి. రోగులకు అవసరమైన సదుపాయాలు కోరుతూ బంధువులు పెడుతున్న పోస్టులకు నెటిజన్లు స్పందించి సమాచారాన్ని చేరవేస్తున్నారు. ట్విటర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం వేదికగా వివరాలు పోస్టు చేస్తూ అవసరమైన సాయాన్ని అభ్యర్థిస్తున్నారు. ఆ పోస్టులకు స్పందనగా సాయమూ అందుతోంది. రోగులను ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడేయటంలో సామాజిక మాధ్యమాలు పాత్ర పోషిస్తున్నాయి.

ప్రముఖులను ట్యాగ్‌ చేస్తూ.. తిరిగి పంచుకుంటూ..

రోగి బంధువులు లేదా నెటిజన్లు పెడుతున్న పోస్టులు ఎక్కువగా ప్రముఖులను ట్యాగ్‌ చేస్తూ ఉంటున్నాయి. మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌, హరీష్‌రావు, ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ వైద్యారోగ్య శాఖ, తెలంగాణ సీఎంవో, సైబరాబాద్‌ పోలీసులను ట్యాగ్‌ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. దీనివల్ల ఎక్కువ మందికి సమాచారం చేరే అవకాశం ఉంది.

*● బుధవారం ప్రముఖ నిర్మాత అనిల్‌ సుంకర కొండాపూర్‌ ప్రాంతంలో ఒకరికి ఆక్సిజన్‌ సిలిండర్‌ కావాలని ట్వీట్‌ చేశారు. దీన్ని నటుడు సాయిధరమ్‌తేజ్‌ రీట్వీట్‌ చేశారు. గంటలోనే 700మందికిపైగా రీట్వీట్‌ చేశారు. సమాచారాన్ని అందించారు.

*● ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర యూనిట్‌.. ట్విటర్‌ ద్వారా రోగుల బంధువులు పెడుతున్న ట్వీట్లను రీట్వీట్‌ చేస్తూ ఎక్కువ మందికి చేరేలా చూస్తోంది.

జాగ్రత్తలు అవసరం

సామాజిక మాధ్యమాలలో వచ్చే సమాచారాన్ని కచ్చితంగా నిర్ధరించుకున్నాకే షేర్‌ చేయడం లేదా రీట్వీట్‌ చేయడం మంచిదని వైద్యులు, సైబర్‌నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరు సైబర్‌ నేరగాళ్లు సమాచారాన్ని లేదా ట్వీట్‌ చేసే వారి అవసరాలను సొమ్ము చేసుకునేందుకు వీలుంటుందని చెబుతున్నారు. కొందరు ఎప్పుడో నెలల కిందటి సమాచారాన్ని షేర్‌ చేస్తున్నారు. దీనివల్ల సాయం అందదు. కొందరు ఆక్సిజన్‌ ఇస్తామని, ఐసీయూ బెడ్లు ఉన్నాయని పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఆయా ఫోన్‌ నంబర్లకు ఫోన్‌ చేసి వాకబు చేసి నిర్ధరించుకున్నాకే సమాచారం షేర్‌ చేస్తే ఉపయుక్తంగా ఉంటుందని సూచిస్తున్నారు.

- ఈనాడు, హైదరాబాద్‌


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని