close

తాజా వార్తలు

Published : 15/08/2020 12:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. మూడు ప్రాంతాలకు సమన్యాయం : జగన్‌

విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో 74వ స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి  ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర విభజన ద్వారా  అయిన గాయాలు మానాలన్నా, అలాంటి గాయం మరెన్నడూ తగలకుండా జాగ్రత్తపడాలన్న రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు సమన్యాయం జరగాలి. వికేంద్రీకరణే సరైన విధానం అని నిర్ణయించి సమన్యాయం జరిగేలా మూడు రాజధానుల బిల్లును చట్టంగా మార్చాం. త్వరలో విశాఖ కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని, కర్నూలు కేంద్రంగా న్యాయరాజధాని ఏర్పాటుకు పునాదులు వేస్తాం’’ అని సీఎం స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ప్రతి ఒక్కరికీ టీకా అందిస్తాం : మోదీ

భారతదేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో శనివారం ప్రధాని మోదీ దేశీయంగా తయారయ్యే టీకాల గురించి ప్రస్తావించారు. వాటి అనుమతుల కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. ‘ప్రతి ఒక్కరు కరోనా వైరస్‌ టీకా కోసం ఎదురుచూస్తున్నారు. దేశ వ్యాప్తంగా మూడు కంపెనీలు తమ టీకాలకు వివిధ దశల్లో పరీక్షలు నిర్వహిస్తున్నాయని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మన నిపుణులు, శాస్త్రవేత్తలు వాటికి ఆమోదం తెలపగానే, భారత్‌లో తయారు చేసే కొవిడ్‌ టీకా అందుబాటులోకి వస్తుంది. ప్రతి భారతీయుడికీ టీకా అందించడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలను మేం సిద్ధం చేశాం’ అని ప్రధాని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. భారత్‌లో కరోనా@25 లక్షలు దాటిన కేసులు

భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా నిత్యం 60 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 65,002 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 25,26,192కి చేరింది. మరోవైపు మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. 50 వేలకు చేరువగా మరణాల సంఖ్య చేరుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

తెలంగాణలో 1,863 కరోనా కేసులు

4. ప్రతి భారతీయుడికీ హెల్త్ కార్డు: మోదీ

74వ స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఎర్రకోట వేదికగా  ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. ఈ రోజు ఆయన  నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌(ఎన్‌డీహెచ్‌ఎం)ను ప్రారంభించారు. దీని కింద ప్రతి భారతీయుడికి ఒక ఐడీ నంబర్‌ను కేటాయించనున్నారు. పూర్తిగా టెక్నాలజీ ఆధారితమైన ఈ మిషన్‌ వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు దోహదం చేస్తుందని ఆయన తెలిపారు. ప్రతి భారతీయుడి సమగ్ర వైద్యసమాచారం ఆ ఐడీ ద్వారా లభిస్తుందని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ప్రగతిభవన్‌లో జాతీయపతాకం ఆవిష్కరించిన కేసీఆర్‌

 తెలంగాణలో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలోని అమరవీరుల సైనిక స్మారకం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులర్పించారు. అనంతరం ప్రగతిభవన్‌కు చేరుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు తదితరులు పాల్గొన్నారు. హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చౌహాన్‌, బీఆర్కే భవన్‌లో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, తెలంగాణ భవన్‌లో ఎంపీ కేశవరావు, జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌  జాతీయజెండాను ఆవిష్కరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించాలి: ఉత్తమ్‌

6. ఆ దేశాలతో అందరికీ కన్ఫ్యూజనే!

మనిషిని పోలిన మనిషిని చూసి పొరపాటు పడటం చూశాం.. కానీ ఒక దేశం అనుకొని మరో దేశానికి ఉత్తరాలు పంపడం ఎప్పుడైనా విన్నారా? స్లొవేనియా.. స్లొవాకియా మధ్య నిత్యం జరిగే విచిత్రమిది. చాలామంది వారు రాసే ఉత్తరాల చిరునామాలో ఒక దేశం బదులు మరో దేశం పేరు రాస్తారట. రెండు దేశాల పేర్లు పలకడానికి.. చూడటానికి ఒకేలా ఉంటాయి. అందుకే ఈ పొరపాటు సహజంగానే ఎక్కువగా జరుగుతుంటోంది. దీంతో ప్రతి నెలలో ఒక రోజు స్లొవేనియా, స్లొవాకియా దేశాలకు చెందిన అధికారులు తమ తమ రాయబార కార్యాలయంలో కలుసుకొని ఉత్తరాలు మార్చుకుంటారట. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఉరకలేస్తున్న గోదావరి

తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ ఫ్లో 9.26లక్షల క్యూసెక్కులుగా ఉందని అధికారులు వెల్లడించారు. కాసేపట్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశముంది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. పి.గన్నవరం నియోజకవర్గంలోని చాకలిపాలెం వద్ద కాజ్‌వే పూర్తిగా మునిగిపోవడంతో కనకాయలంక, బూరుగులంక, అరికెలవారిపేట, జి.పెదపూడి సహా పలు లంకగ్రామాలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. వైనతేయ నది ఉప్పొంగడంతో మత్స్యకారులు పడవలను ఒడ్డుకు చేరుస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మరోసారి అదరగొట్టిన కీర్తిసురేశ్‌

 ‘మన రాతను మనమే రాసుకోవాలా’ అంటోంది కీర్తిసురేశ్‌. ‘మహానటి’తో అందరి హృదయాలను దోచుకున్న ఆమె మరోసారి అదరగొట్టేందుకు సిద్ధమైంది. కీర్తిసురేశ్‌ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గుడ్‌ లక్‌ సఖి’. నాగేశ్‌ కుకునూరు దర్శకుడు. ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. శనివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. భారత్‌,పాక్‌.. ఈ రెండు జట్లకూ ఆడిన క్రికెటర్ల గురించి తెలుసా?

ఏ క్రీడాకారులైనా దేశం తరఫున ఆడాలని కలలు కంటారు. అందుకోసం ఎంతో శ్రమిస్తారు. ఏళ్లకు ఏళ్లు కష్టపడతారు. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా రాణిస్తారు. చివరికి అనుకున్నది సాధించి లక్ష్యాన్ని చేరుకుంటారు. తమ రంగాల్లో అత్యున్నత స్థాయిలో రాణించి దేశానికి కీర్తిప్రతిష్ఠలు తెస్తుంటారు. అలా ఏ ఆటగాడైనా ఒక దేశం తరఫున ఆడటమే గొప్ప విశేషం. అలాంటిది రెండు దేశాలకు ఆడటమంటే మాటలా?అది కూడా భారత్‌ - పాకిస్థాన్‌ లాంటి దాయాది దేశాలకు. అందులోనూ క్రికెట్‌ రంగంలో. నేటి తరానికైతే అది కలలో కూడా ఊహించుకోవడానికి సాధ్యం కాదు. కానీ ముగ్గురు ఆటగాళ్లున్నారు. వారు అటు పాకిస్థాన్‌కు ఇటు భారత జట్టుకు క్రికెట్‌ ఆడి తమ పేర్లను చరిత్రలో లిఖించుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. PICS: ఎర్రకోటపై రెపరెపలాడిన త్రివర్ణ పతాకం

దేశవ్యాప్తంగా 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండా రెపరెపలాడింది. ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. దిల్లీతోపాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాయి. పంద్రాగస్టు సందర్భంగా ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్ పూరీ తీరంలో గీసిన సైకత శిల్పం ఆకట్టుకుంటోంది. వేడుకలకు సంబంధించిన పలు చిత్రాలు మీకోసం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.