
తాజా వార్తలు
జీవితం ఒక్క ‘క్షణం’లో మారొచ్చు..!
ఇంటర్నెట్ డెస్క్: అది 2016 ఫిబ్రవరి 26.. నమ్మకంతో పనిచేస్తే ఒక్క ‘క్షణం’లో జీవితం మారుతుందని కథానాయకుడు అడివి శేష్‌కి అర్థమైన సమయం. తాను ఎంచుకున్న మార్గం విజయం అందించిన తరుణం. ఒక్కో నటుడి కెరీర్‌ని ఒక్కో సినిమా డిసైడ్ చేస్తుందని మనం వింటుంటాం. అలా శేష్ అంటే ఏంటో ప్రేక్షకులకు తెలియజేసిన చిత్రం ‘క్షణం’. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణ పొందింది. సరికొత్త స్ర్కీన్‌ప్లే రుచి చూపించి ఔరా అనిపించింది. రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు శేష్ కూడా స్ర్కీన్‌ప్లే అందించడం విశేషం. ఎప్పుడు ఏం జరుగుతుందో! ఊహించలేని స్ర్కీన్‌ప్లే సినిమా గురించి మాట్లాడుకునేలా చేసింది. శేష్, సత్యదేవ్, అదా శర్మ, అనసూయ భరద్వాజ్, వెన్నెల కిశోర్, సత్యం రాజేశ్.. అందరి నటన విశేషంగా ఆకట్టుకుంది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం అందుకుంది. ఇదంతా జరిగి ఐదేళ్లవుతుంది. ఈ సందర్భంగా ఆ జ్ఞాపకాల్ని పంచుకున్నారు శేష్. ‘ఫిబ్రవరి 26.. పరీక్షల కాలం. అయినా మీముందుకొచ్చాం. మా చిన్న కల పెద్ద విజయంగా మారింది. నిజంగా మా అందరికీ గొప్ప ప్రారంభం అది. జీవితం ఒక్క క్షణంలో మారొచ్చు’ అని ట్వీట్ చేశారు.
ఈ సినిమా తర్వాత ‘గూఢచారి’, ‘ఎవరు’ వంటి ఉత్కంఠభరిత చిత్రాల్లో నటించి టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారాయన. ప్రస్తుతం ‘మేజర్’ చిత్రంలో నటిస్తున్నారు శేష్. 2008 ముంబయి దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ ఉన్ని కృష్ణన్ జీవితాధారంగా తెరకెక్కుతోంది. శశికిరణ్ తిక్క దర్శకుడు.