close

తాజా వార్తలు

Updated : 12/03/2020 04:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అదనం నేర్చుకుంటే అభయం!

టెక్నాలజీ ట్రెండ్‌లకూ, పరిశ్రమల అవసరాలకూ దీటుగా..!

ఇప్పుడు నేర్చుకున్న నైపుణ్యాలు ఇంకొన్ని రోజులకు పనికిరాకపోవచ్ఛు కానీ అప్పటికి తెలుసుకోవాల్సిన వాటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకుంటేనే ఉద్యోగం ఉంటుంది. ఇదే ఇప్పటి ట్రెండ్‌. అంటే ఎప్పటికీ నేర్చుకుంటూ ఉండాల్సిందే. అలాంటి అభ్యర్థులకే సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ ఒరవడిని ఒడిసిపట్టుకున్న వాళ్లు మాత్రమే ఉద్యోగాల పరుగులో ఉంటారు. కొలువులు నిలబెట్టుకోగలుగుతారు.

స్రవంతి.. బీటెక్‌ నాలుగో ఏడాదిలో ఇలా అడుగుపెట్టిందో లేదో అలా ఉద్యోగానికి ఎంపికైంది. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో మంచి వేతనంతో పేరున్న ఎంఎన్‌సీలో కొలువు దక్కించుకుంది. నాలుగో ఏడాది తర్వాత ఉద్యోగంలో చేరే విధంగా అవకాశమిచ్చారు. చదువు పూర్తవగానే ఆఫీసులో రిపోర్ట్‌ చేసింది. అప్పటికి ప్రాజెక్టులు ఏమీ లేకపోవడంతో ఇంకొందరితోపాటు ఆమెనీ బెంచికి పరిమితం చేశారు. మూడు నెలలపాటు జీతం వస్తూనే ఉంది. కానీ, విధులు నిర్వర్తించిందేమీ లేదు. తీరా ఒకరోజు హెచ్‌ఆర్‌ వాళ్లు పింక్‌ స్లిప్‌ చేతిలో పెట్టారు!

పవన్‌.. ఉద్యోగి. ఏడేళ్ల పని అనుభవం. ఎంప్లాయీగా మంచి పేరుంది. ఒక రోజు ఆఫీసుకు వెళ్లగానే తనతోపాటు ఇంకొందరిని విధుల్లో నుంచి తీసేసినట్లు తెలిసింది. పని పరంగా చేసిన తప్పులేమీ లేవు. అయినా తొలగింపు తప్పలేదు.

రెండు సందర్భాల్లోనూ హెచ్‌ఆర్‌ నుంచి వచ్చిన మాట తగినన్ని నైపుణ్యాలు లేవనే! ఎంపికైనప్పుడు సరిపోయిన నైపుణ్యాలు కొలువులో చేరి కొన్నేళ్ల అనుభవం గడించిన తర్వాత సరిపోకపోవడమే వీరిని ఉద్యోగాలకు దూరం చేశాయి.

మార్కెట్‌ అవసరాలకు సంప్రదాయ విద్యా విధానం సరిపోవడం లేదు. టెక్నాలజీ ట్రెండ్‌లను అందుకోవాలన్నా, ఉద్యోగ పోటీలో నిలవాలన్నా వృత్తికి అవసరమైన కొత్త, అదనపు అంశాలను నేర్చుకుంటుండటం తప్పనిసరి. దీన్నే నిపుణులు అప్‌స్కిల్లింగ్‌గా చెబుతున్నారు.

●పాత పంథా పనికి రాదు

ఉద్యోగాల్లోకి టెక్నాలజీ దూసుకొస్తోంది. ఏఐ ఇప్పటికే కొన్నిచోట్ల అడుగుపెట్టింది. దశాబ్ద కాలంలో జాబ్‌ మార్కెట్‌ ధోరణుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. టెక్నాలజీ, డిజిటలైజేషన్‌ చొచ్చుకుని రావడంతో ఉద్యోగాలన్నీ స్పెషలైజ్‌డ్‌, ఆటోమేటెడ్‌గా మారిపోతున్నాయి. దీని విస్తరణ ఈ ఏడాది నుంచి మరింత వేగవంతం కాబోతోంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా 2020కి ప్రాముఖ్యం ఏర్పడింది. ఆ వేగాన్ని అందుకోడానికి ఉద్యోగులకు ప్రత్యేకమైన, అదనపునైపుణ్యాలు అవసరం.

సంప్రదాయ విద్యావిధానం వల్ల మార్కెట్‌ డిమాండ్‌కు తగిన నైపుణ్యాలు అభ్యర్థులకు అలవడటం లేదు. ఆధునిక టెక్నాలజీ ట్రెండ్‌లను అందుకోడానికి మరిన్ని స్కిల్స్‌ అవసరమవుతున్నాయి. వాటిని నేర్చుకోవడమే అప్‌స్కిల్లింగ్‌గా చెప్పుకోవచ్ఛు సాధారణంగా చాలావరకూ సంస్థలు తమ ఉద్యోగుల్లో కొత్త సామర్థ్యాలు పెంచడానికీ, స్కిల్‌ గ్యాప్‌ను తగ్గించడానికీ శిక్షణ కార్యక్రమాల రూపంలో కొత్త నైపుణ్యాలను అప్పుడప్పుడూ అందించేవి. వేగంగా మారుతున్న డిజిటల్‌ ప్రపంచంలో వీటి అవసరం ఇప్పుడు మరీ పెరిగింది.●

ఆదుకున్న అప్‌స్కిల్లింగ్‌

ఇటీవలి కొన్ని పరిణామాలను పరిశీలిస్తే.. గత ఏడాది కాగ్నిజెంట్‌, వాల్‌మార్ట్‌, ఫ్యూచర్‌ గ్రూప్‌, ఓయో.. వంటి కొన్ని సంస్థలు చాలామంది ఉద్యోగులను తీసేశాయి. కొందరు దీన్ని మేనేజ్‌మెంట్‌ వైఫల్యంగా పరిగణించారు. ఇదంతా ఒక వైపు. మరోవైపు పరిశీలిస్తే.. ఉద్యోగాలను కోల్పోయిన వారికంటే కొన్ని రెట్లమంది ఉద్యోగులు తమ కొలువులను కాపాడుకోగలిగారు. జీతాల్లో పెరుగుదలను పొందారు. పదోన్నతులు అందుకున్నవారూ ఉన్నారు. ఇక్కడ అందరు ఎదుర్కొన్నదీ ఒకే పరిస్థితిని. అయినా తేడాకి కారణం.. కొందరిలో చేరినప్పుడు నైపుణ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో, ఇప్పటికీ అలానే ఉండిపోయాయి. మిగతావారు అదనపు నైపుణ్యాలను అందింపుచ్చుకున్నారు. ఉద్యోగాలను నిలబెట్టుకున్నారు.

ఏం చేయాలి?

నిరంతర అభివృద్ధి: చదువు పూర్తవడంతోనే చాలామంది నేర్చుకునే ప్రక్రియకు ఫుల్‌స్టాప్‌ పెట్టేస్తారు. కొలువులో చేరడం ఆలస్యం నేర్చుకోడానికి స్వస్తి చెప్పేస్తారు. ఇంకొందరు అదనపు నైపుణ్యాలు అవసరమవుతాయని తెలిసినా ఉద్యోగంలో చేరిన తర్వాత అవసరాన్ని బట్టి నేర్చుకుందాం అనుకుంటారు. ఈ రెండు ధోరణులూ సరైనవి కావు. ముందు నుంచీ నేర్చుకోవడంపై దృష్టిపెట్టాల్సిందే. అప్పుడే అవకాశాలను అందిపుచ్చుకునే వీలుంటుంది. విద్యా నైపుణ్యాలకే పరిమితం కాకుండా అదనపు నైపుణ్యాలపై దృష్టిపెడితే నలుగురిలో ప్రత్యేకంగా నిలబడవచ్చు.

పరిశ్రమ అవసరమేంటి?: సమయానికి తగిన నైపుణ్యాలు ఉన్న వారి కోసం సంస్థలు చూస్తున్నాయి. వేగంగా మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం కంటే భవిష్యత్‌ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాయి. తర్వాత కాలంలోనూ ఉపయోగపడతారనుకున్న వారికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఎంచుకుని, శిక్షణలిచ్చి విధుల్లోకి తీసుకోవడం కంటే అప్పటికే కావాల్సిన పరిజ్ఞానం ఉన్నవారినే తీసుకోడానికి మొగ్గుచూపుతున్నాయి. అందుకే ఎప్పటికప్పుడు పరిశ్రమ ధోరణుల్లో వచ్చే మార్పులను గమనించుకుంటూ అదనపు నైపుణ్యాలను నేర్చుకోవడం, ఇదివరకే ఉన్నవాటికి సానపెట్టుకోవడం చేసేవారికి అవకాశాలు అందుతున్నాయి.

నేర్చుకోవడంపై ఆసక్తి: వేల రూపాయల జీతంతో ఆఫర్‌ లెటర్‌ అందుకున్నా.. కొన్ని నెలలకే చాలామంది బెంచికి పరిమిత మవుతుంటారు. వీరిలో ఎక్కువమంది కొలువుకు దూరమవుతున్నారు. అభివృద్ధి జరిగేకొద్దీ నైపుణ్యాల కొరత ఉన్నవారు వెనకబడిపోతారు. పాతబడిపోయిన, అనవసర నైపుణ్యాలు ఉన్నవారి అవసరం సంస్థలకు ఉండదు. ఒకరకంగా వారిని భారంగా భావిస్తాయి. అభ్యర్థిలో నేర్చుకోవాలనే తపన, ఆసక్తిని అప్‌స్కిల్లింగ్‌ రుజువు చేస్తుంది.

నాస్కామ్‌ నివేదిక ప్రకారం.. మనదేశంలో 40% ఉద్యోగులకు వారి నైపుణ్యాలు సరిపోవడం లేదు. సాధారణ విద్యా పరిజ్ఞానంతో ఉద్యోగాలను సాధించడం కష్టమవుతోంది. గత రెండేళ్లలో వచ్చిన కొత్త సాంకేతికత ప్రస్తుతం ఉన్న ఎన్నో ఉద్యోగాలకు సవాళ్లు విసురుతోంది. దాంతో పోటీ పడటానికి ఉద్యోగులు అదనపు నైపుణ్యాలను నేర్చుకోవడంపై దృష్టిపెట్టడం ఎంత అవసరమో తెలియజేస్తోంది.

వృత్తిపరంగా, వ్యక్తిగతంగా: పని ప్రదేశంలో అనిశ్చితి పెరిగిపోతోంది. హోదాలే కాదు, సంస్థలూ, పరిశ్రమలూ శాశ్వతంగా ఉండటం లేదు. ఆ పరిస్థితుల్లో విభిన్న అంశాల్లో నైపుణ్యాలుంటే వివిధ ఉద్యోగావకాశాలను అందుకోవచ్ఛు కొత్త నైపుణ్యాలను నేర్చుకునే క్రమంలో కొత్త అభిరుచులను తెలుసుకునే వీలు కలుగుతుంది. అంతకుముందు అవగాహన లేని విషయాలపైనా ఆసక్తి పెరగవచ్ఛు ఇది వృత్తిగతంగానే కాదు, వ్యక్తిగత అభివృద్ధికీ సాయపడుతుంది.

సంబంధ బాంధవ్యాల్లో మెరుగుదల: సంబంధ బాంధవ్యాలు అనగానే.. చాలామంది తోటివారికే పరిమితం అవుతుంటారు. అంటే కళాశాల స్థాయిలో తరగతివారితో, ఉద్యోగస్థాయిలో బృంద సభ్యులతోనే సంబంధాలను సరిపెట్టడం. ఇది కెరియర్‌ అభివృద్ధికి అవరోధం లాంటిదే. అవసరాల గురించి సరిగా తెలియాలంటే చుట్టూ ఉన్న వివిధ విభాగాలూ, సబ్జెక్టులవారిపైనా అవగాహన ఉండాలి. ఇది పరిశీలనాశక్తి ఉన్నవారికే సాధ్యమవుతుంది. కాబట్టి నెట్‌వర్కింగ్‌పై దృష్టిపెట్టాలి. దాని పరిధి ఎంత విస్తరిస్తే అన్ని లాభాలుంటాయి. నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం, నిరంతరం తమను తాము అభివృద్ధిపరచుకోవడానికే కాకుండా ఒకేలా ఆలోచించే మనస్తత్వం కలవారిని కలిసే అవకాశాన్ని నెట్‌వర్కింగ్‌ కల్పిస్తుంది. ఒక్కోసారి వారి నుంచి స్ఫూర్తినీ పొందవచ్ఛు ఈ పరిచయాలు భవిష్యత్తులోనూ సాయపడతాయి.

అయిదు రకాలుగా..!

ప్‌స్కిల్లింగ్‌ అంటే సాంకేతిక అంశాలకే పరిమితం కాదు. సాఫ్ట్‌స్కిల్స్‌నూ మెరుగుపరచుకోవాలి. కొత్త సాంకేతిక ధోరణులపై దృష్టిపెడితే మంచి హోదాను అందుకోవచ్ఛు అలాగే భావప్రకటన, సమయపాలన, నాయకత్వ లక్షణాలు వంటి నైపుణ్యాలు వృత్తిగతంగా ముందుకు సాగడానికి సహకరిస్తాయి. వీటన్నింటినీ రకరకాల మార్గాల ద్వారా నేర్చుకోవచ్చు.

మెంటర్‌: భవిష్యత్‌పరంగా అభ్యర్థి లక్ష్యాలు, కలలు తెలుసుకుని ఆ దిశగా ప్రోత్సహిస్తూ, మార్గనిర్దేశం చేసేవారే మెంటర్‌లు. తమ రంగానికి చెందినవారైనా, చదువుతున్న కళాశాల అధ్యాపకుడు లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా కావచ్ఛు అభ్యర్థి అభిరుచులను అర్థం చేసుకుంటూనే లక్ష్య సాధనలో అవసరమైన మార్గనిర్దేశం చేస్తారు. వీరి అనుభవం, పరిజ్ఞానం త్వరితగతిన నేర్చుకునే వీలు కల్పిస్తాయి. ప్రాక్టికల్‌ పరిజ్ఞానం ఇక్కడ కుదురుతుంది.

వర్చువల్‌/ ఆన్‌లైన్‌ లర్నింగ్‌: నచ్చినవాటిని, వీలైన సమయంలో, మెచ్చిన ప్రదేశంలో నేర్చుకునే వీలు దీని ద్వారా కలుగుతుంది.

నేరుగా శిక్షణ: కొన్నింటిని నిపుణుల నుంచి నేరుగా నేర్చుకోవాల్సి ఉంటుంది. షార్ట్‌టర్మ్‌ కోర్సులు, ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్టులు ఇవన్నీ వీటి కిందకి వస్తాయి. ఇవి ప్రాక్టికల్‌ పరిజ్ఞానాన్ని పొందడానికి సాయపడతాయి.

మైక్రో లర్నింగ్‌: కొద్దిసమయంలో ఎక్కువ విషయాన్ని నేర్చుకునే సౌకర్యాన్ని మైక్రో లర్నింగ్‌గా చెప్పవచ్ఛు ఉదాహరణకు- ఒక అంశాన్ని తరగతి గదిలో కూర్చునే తెలుసుకోవాలన్న నిబంధనేమీ లేదు. ఇప్పుడు సులువుగా, చిన్న చిన్న వీడియోల ద్వారా నేర్చుకునే అవకాశాలు చాలా అందుబాటులోకి వచ్చాయి. చిన్న సూత్రం నుంచి పెద్ద పెద్ద వివరాల వరకూ వీటి ద్వారా తెలుసుకోవచ్ఛు తక్కువ వ్యవధిలో నేర్చుకోవాలనుకునేవారు ఈ పద్ధతిని అనుసరించవచ్చు.

సెమినార్లు: పెద్ద విద్యాసంస్థలు, వ్యాపారవేత్తలు, విదేశీ నిపుణులు.. సెమినార్లు నిర్వహిస్తుంటారు. వాటికి హాజరు కావచ్ఛు ఏదో ఒక అంశంపై ప్రసంగిస్తుంటారు. ఆన్‌లైన్‌లో పాల్గొనే వీలూ ఉంటుంది. అంశాన్ని తెలుసుకోవడంతోపాటు సందేహాలనూ నివృత్తి చేసుకోవచ్చు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని