close

తాజా వార్తలు

Updated : 20/10/2020 00:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గెలిచారు నీట్‌.. దీటుగా!

నీట్‌.. లక్షల మంది విద్యార్థులు స్కోరు చేయాలనుకునే ప్రవేశపరీక్ష! వైద్య రంగంలోకి  అడుగులు వేసేందుకు ఎక్కాల్సిన సోపానం. అయితే ఆ అడుగులు అంత సులువేం కాదు. ఇది ఇతర పోటీ పరీక్షల్లాంటిదీ కాదు. నిరంతర శ్రమ..  సాధించాలన్న సంకల్పంతో పాటు ఏకాగ్రత, విషయ నైపుణ్యం.. అన్నింటికీ మించి ప్రతి అంశంపై స్పష్టత అవసరం. అలా ఉన్నప్పుడే 720/720 కల నెరవేరుతుంది. ఆ లక్ష్యానికి అడుగు దూరంలో నిలిచి ఆలిండియా టాప్‌ ర్యాంకులు సాధించిన  ఇద్దరు తెలుగు విద్యార్థులు ‘ఈనాడు చదువు’తో ముచ్చటించారు. లక్ష్యం చేరేందుకు తాము చేసిన కృషిని పంచుకున్నారిలా..!

నీట్‌లో 720 మార్కుల్లో 700 గీత దాటారంటే మామూలు విషయం కాదు. మూడు సబ్జెక్టులనూ ఆపోశన పడితే కానీ అది సాధ్యం కాదు. 710 మార్కుల మార్కుని అందుకున్న హైదరాబాద్‌ కుర్రాడు అనంత పరాక్రమ భార్గవ... నీట్‌లో ప్రతి ప్రశ్ననూ ఎదుర్కొనేంత విషయ పరిజ్ఞానం రావాలంటున్నాడు. అదే తనకు ఆలిండియా 11వ ర్యాంకు తెచ్చిపెట్టిందంటూ తను సన్నద్ధమైన తీరుని ఇలా చెప్పుకొచ్చాడు..
మాది ఆదిలాబాద్‌ జిల్లా బెల్లంపల్లి. నాన్న డాక్టర్‌ నారాయణరావు మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌ఓ. అమ్మ ఆర్యనారాయణ గృహిణి. నాన్న ఉద్యోగరీత్యా చదువులన్నీ హైదరాబాద్‌లోనే. పదోతరగతి ఐసీఎస్‌సీ సిలబస్‌ 95 శాతం సాధించాను. ఇంటర్మీడియట్‌ నారాయణగూడ శ్రీచైతన్య కాలేజీలో 95శాతం మార్కులొచ్చాయి. అక్కడే నీట్‌ శిక్షణ కూడా తీసుకున్నాను.
చిన్నతనం నుంచే వైద్యరంగమంటే ఇష్టం. దానికి నాన్నే ప్రేరణ. ఆయన ఆసుపత్రిలో చూసే విషయాల గురించి ఇంట్లో చర్చించేవారు. ఆయన మాటల్లో వచ్చిన ‘నర్వ్‌ రీ జనరేషన్‌’ అనే అంశం నన్ను ఆకర్షించింది. ఈ రంగంలో పరిశోధకుడిగా రాణించాలనుకున్నాను. అక్కడే ఈ రంగానికి రావాలనే ఆలోచనకు బీజం పడింది. ఆ వైపు అడుగులేసేందుకే బైపీసీ తీసుకున్నాను. ఆ తర్వాత నీట్‌కి సన్నద్ధమయ్యాను. ఆలిండియా ర్యాంకు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. సాధారణంగా స్టడీస్‌లో నేను సగటు విద్యార్థినే. కానీ వైద్యరంగంలో పరిశోధకుడినవ్వాలనే తపన నీట్‌కు సన్నద్ధమయ్యేలా చేసింది.


నీట్‌లో  710 మార్కులు సాధించాడు విజయవాడ విద్యార్థి కోట వెంకట్‌. ఒక్కో సబ్జెక్టూ చదువుతూ అభ్యాసం చేస్తున్నకొద్దీ టాప్‌ 100పై ఆశ మొదలైంది. అదే లక్ష్యంతో పక్కా ప్రణాళికతో ఆలిండియా 13వ ర్యాంకు కొట్టాడీ కుర్రాడు. ప్రణాళిక, సమయపాలనే నీట్‌లో దీటుగా రాణించేందుకు దారంటూ తన మనోగతం పంచుకున్నాడు..
మా సొంతూరు విజయవాడ. నాన్న ప్రసాద్‌రావు థర్మల్‌ పవర్‌ప్లాంట్‌లో ఉద్యోగి. అమ్మ మాధవి ప్రయివేట్‌ ఉపాధ్యాయిని. చదువులో ఎప్పుడూ ఫస్టే. పదోతరగతిలో 9.8 సాధించాను. శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్మీడియట్‌ చదివాను. అందులో 98 శాతం మార్కులొచ్చాయి.
చిన్నతనం నుంచి గణితంపై ఆసక్తి ఎక్కువ. పాఠశాల    స్థాయిలో ఉన్నప్పుడు ఇంజినీర్‌ అవ్వాలనుకునేవాణ్ణి. కానీ, ఎనిమిదో తరగతిలో ఓసారి నాన్నకి ఆక్సిడెంట్‌ అయి చాలారోజులు ఆయన కోసం ఆసుపత్రిలో ఉన్నాను. అప్పుడే వైద్యరంగం మీద ఏదో తెలియని ప్రేమ పుట్టింది. దాని ద్వారా మనం సాధించే విజయాలు కనిపించాయి. అప్పుడే నిర్ణయించుకున్నాను ఈ రంగంలోకి రావాలని. అదే లక్ష్యంతో ఇంటర్మీడియట్‌లో బైపీసీ తీసుకున్నాను. అటు అకడమిక్‌తో పాటు నీట్‌కి సంబంధించిన సబ్జెక్టులు, పరీక్షా విధానం మీద కాలేజీ శిక్షకుల సహకారంతో దృష్టి పెట్టాను. మొదట్లో సబ్జెక్టుల మీద పట్టు వచ్చిన కొద్దీ టాప్‌ 100లోపు వస్తుందనే నమ్మకం ఉండేది. పరీక్ష రాశాక కీ చూసుకుని మార్కులు లెక్కపెట్టుకున్నాక టాప్‌ 10 ఆశ ఉండేది. చివరకు ఆలిండియా 13వ ర్యాంకు వచ్చింది.

- అభిసాయి ఇట్ట, ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని