close

తాజా వార్తలు

Updated : 18/11/2020 00:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పనికి తోడుగా..

ఇప్పుడు చాలామంది ఇంటి నుంచే పని చేస్తున్నారు. అదే సురక్షితం కూడా. కానీ, వర్క్‌ ఫ్రమ్‌ హోం అనుకున్నంత సులభం కాదు. ఆఫీస్‌లో కన్నా ఇంకాస్త ఎక్కువ సమయమే పని చేయాల్సి వస్తుంది. కొన్ని సార్లు టార్గెట్‌లను అందుకోలేకపోతుంటారు. ఒత్తిడికి లోనవుతారు. ఇవన్నీ అధిగమించి ఇంటి నుంచి చేసే పనిని హ్యాపీగా ప్లాన్‌ చేస్తే? అదెలా సాధ్యమనుకుంటున్నారా? ఈ యాప్‌లను తోడు చేసుకుంటే చాలు. మీరు ఏ రంగంలో పని చేస్తున్నా వీటితో సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ యూజర్లకు ఇవి ప్రత్యేకం..

బృందంతో పనా?
Asana
బృందంగా ఏర్పడి ఏదైనా స్టార్టప్‌ కోసం పని చేస్తున్నారా? కరోనా నేపథ్యంలో ఎక్కడి వారు అక్కడే ఉండి కలిసికట్టుగా చేపట్టిన ప్రాజెక్టుని పూర్తి చేయాలనుకుంటున్నారా? అయితే, ఎవరు ఏ పని చేయాలి? చేపట్టిన టాస్క్‌ ఎంత వరకూ పూర్తయ్యింది?.. ఇలా టీమ్‌ చేస్తున్న పనుల్ని పూర్తి స్థాయిలో మేనేజ్‌ చేసేందుకు ఆసన యాప్‌ చక్కని ఎంపిక. టీమ్‌ టాస్క్‌లను ఎప్పటికప్పుడు మానిటర్‌ చేస్తూ సాయపడొచ్చు. యాప్‌లానే కాకుండా వెబ్‌ సర్వీసు రూపంలో సిస్టమ్‌లోనూ సర్వీసుని యాక్సెస్‌ చేసే వీలుంది.
డౌన్‌లోడ్‌ లింక్‌: https://bit.ly/3kaTyTV

‘బూస్ట్‌’ చేస్తుంది
Boosted 
ప్రొగ్రామింగ్‌ లేదా మార్కెటింగ్‌... ఏది చేస్తున్నా కచ్చితమైన ప్లానింగ్‌ తప్పనిసరి. రోజు, వారం, నెలలో ఏమేం చేయాలి? అనే స్పష్టత ఉండాలి. అప్పుడే పని భారం పెరగకుండా ఎప్పటికప్పుడే పూర్తి చేయవచ్చు. ఈ బూస్టెడ్‌ యాప్‌తో క్షణాల్లో తగిన ప్లానింగ్‌ చేసుకోయొచ్చు. పని సామర్థ్యాన్ని ట్రాక్‌ చేసుకోవచ్చు. ఏయే పనిపై ఎంతెంత సమయం వెచ్చిస్తున్నారో ఇట్టే తెలుసుకోవచ్చు. ఆఫీస్‌ పని ప్రణాళిక మాత్రమే కాదు. వ్యక్తిగత లైఫ్‌ స్టైల్‌ని ఓ పద్ధతి ప్రకారం మార్చుకోవటానికీ తోడ్పడుతుంది. అన్ని అలవాట్లను విశ్లేషించి ఎక్కడ మెరుగవాల్సిన అవసరముందో తేల్చి చెబుతుంది.
డౌన్‌లోడ్‌ లింక్‌: https://bit.ly/32p4wPu

టైమ్‌కి నిద్ర లేవాలంటే..
Challenges Alarm Clock
పొద్దున్నే నిద్ర లేవాలని ఫోన్‌లో అలారం పెట్టేస్తారు. తీరా అది మోగితే కళ్లు తెరకుండానే ఆఫ్‌ చేసి, మళ్లీ దుప్పటి ముసుగేసేస్తారు. అలా కాకుండా అలారం పెట్టిన సమయానికే నిద్ర లేవాలంటే ఛాలెంజెస్‌ అలారం క్లాక్‌ యాప్‌ని వాడొచ్చు. ఒక్కసారి దీంట్లో అలారం పెట్టాక ఆఫ్‌ చేయాలంటే ఓ పజిల్‌ని పరిష్కరించాలి. దీంతో కచ్చితంగా నిద్ర మత్తు వదులుతుంది. పలు రకాల ఛాలెంజ్‌లు, గేమ్స్‌ని పజిల్‌లో పెట్టుకుని అలారం సెట్‌ చేసుకోవచ్చు.
డౌన్‌లోడ్‌ లింక్‌: https://bit.ly/32t3L87

మాటలే మ్యాటర్‌లా..
Voice Notebook 
పనికి సంబంధించిన వివరణ లేదా ప్రాజెక్టు వర్క్‌ వివరాలు.. ఇలా ఏదో ఒక అంశంపై ఎప్పటికప్పుడు బాస్‌కో, టీఎల్‌కో మెసేజ్‌లు పంపాల్సి వస్తుంటుంది. వాయిస్‌ నోట్‌బుక్‌ యాప్‌తో దీన్ని మరింత సులభంగా చేయొచ్చు. ఇది మనం మాట్లాడే మాటలను టెక్స్ట్‌ మ్యాటర్‌లా మార్చేస్తుంది మరి. దాన్ని సేవ్‌ చేసుకుని పంపాల్సిన వారికి సెండ్‌ చేయొచ్చు. ఇదో వాయిస్‌ రికగ్నిషన్‌ యాప్‌. పుల్‌స్టాప్‌, కామా, క్వశ్చన్‌మార్క్‌లను కూడా పదాల్లో ఇన్‌సర్ట్‌ చేసేస్తుంది. మాటల టెక్స్ట్‌ మ్యాటర్ని ఫైల్‌లా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మెయిల్‌ చేయొచ్చు. క్లౌడ్‌ స్పేస్‌లో సేవ్‌ చేసే వీలుంది.
డౌన్‌లోడ్‌ లింక్‌: https://bit.ly/3pc0GmU 

విలువైన సమయం కోసం..
 Toggl Track
టైమ్‌ని డబ్బుగా భావిస్తేనే వృథా చేయడం మానుకుంటాం. ఇందుకోసం రూపొందించిందే టాగ్‌ల్‌ ట్రాక్‌. దీంతో టైమ్‌ని ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేయొచ్చు. ఉదాహరణకు మీరు ఫ్రీలాన్సర్‌గా ఏవైనా ప్రాజెక్టు వర్క్‌లు చేస్తున్నప్పుడు రోజులో ఎన్ని గంటలు పని చేశారో రికార్డు చేయొచ్చు. క్యాలెండర్‌లో ట్రాక్‌ చేసిన పని గంటలకు సంబంధించిన గ్రాఫ్‌ని పొందొచ్చు. ఆయా వివరాల్ని క్లైంట్స్‌కి పంపడం ద్వారా మీరు ఎంత సమయం వెచ్చించారో ఇట్టే తెలుస్తుంది. క్యాలెండర్‌లో ఈవెంట్స్‌ని ప్లాన్‌ చేసి ముందే షెడ్యూల్‌ చేయొచ్చు.
డౌన్‌లోడ్‌ లింక్‌: https://bit.ly/35d3qrX

ఫోకస్‌గా పని చేసేందుకు..
 Stay Focused
అప్పుడే ప్రాజెక్టు వర్క్‌లోకి లాగిన్‌ అయ్యారు. ఆ మరుక్షణమే ఫోన్‌లో ఫేస్‌బుక్‌ నోటిఫికేషన్‌.. అది చూసేలోపు.. ఇన్‌స్టాగ్రామ్‌ అప్‌డేట్‌.. ఇలా ఫోన్‌తోనే ఓ పది నిమిషాల టైమ్‌ అయిపోతుంది. ఇలా రోజులో ఫోన్‌ కారణంగా వృథా అయ్యే సమయాన్ని ఆదా చేసేదే స్టే ఫోకస్డ్‌ యాప్‌. ఇన్‌స్టాల్‌ చేసుకుని పని సమయంలో ఫోన్‌ వాడకానికి చెక్‌ పెట్టొచ్చు. ఫోన్‌లో ఎంపిక చేసుకున్న యాప్‌లను పని చేయకుండా బ్లాక్‌ చేయొచ్చు. ఇలా వెబ్‌సైట్‌లను కూడా ఓపెన్‌ కాకుండా చేయవచ్చు. అలాగే, ఇది రోజు మొత్తం మీరెంత సమయం ఫోన్‌తో గడుపుతున్నారో ట్రాక్‌ చేసి మరీ చెబుతుంది.
డౌన్‌లోడ్‌ లింక్‌: https://bit.ly/3pdr1kg 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని