close

తాజా వార్తలు

Published : 18/01/2021 00:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏక దృష్టి.. ఎదురులేని అస్త్రం!

కెరియర్‌ ఉన్నతికి జీవన నైపుణ్యాలు- 5

చీకట్లో నడుస్తున్నపుడు మన వెంట వచ్చే కాగడా లాంటిది- ఫోకస్‌ (ఏక దృష్టి). ఈ జీవన నైపుణ్యం మన సంకల్పానికి వజ్రాయుధం. ఈ మార్గంలో ప్రయాణించిన వారంతా విజయపథంలోనే ఉన్నారు. వివిధ రంగాల్లో అగ్రగాములుగా వెలుగొందుతున్నారు.
కీర్తి తన ల్యాప్‌టాప్‌లో వచ్చిన మెయిల్‌ వైపు నిస్తేజంగా చూస్తోంది. ఇది సంస్థ తనకు పంపిన మూడో రిజెక్షన్‌ లెటర్‌. ఇంజినీరింగ్‌ తుది సంవత్సరంలో ఉన్న కీర్తి తాను చేసిన తప్పేంటని అదే సంస్థకు ఎంపికైన తన రూమ్‌మేట్‌ ధాత్రిని అడిగింది. ధాత్రి తన స్నేహితురాలిని ఊరడించిందే కానీ కారణం చెప్పలేకపోయింది. నిజానికి కీర్తి, ధాత్రి ఇద్దరూ క్లాస్‌లో ఒకేరకమైన టాలెంట్‌ చూపేవారు. సబ్జెక్టులో కానీ సాఫ్ట్‌స్కిల్స్‌లో కానీ ఇద్దరిదీ ఒకే కొలమానం. మరి లోపం ఎక్కడ జరిగింది?
కీర్తి, ధాత్రిల గురించి బాగా తెలిసిన సీనియర్‌ ఫ్యాకల్టీ డాక్టర్‌ రజనీ అసలు కారణాన్ని విశ్లేషించారు. కీర్తి ఆరో సెమిస్టర్‌ పూర్తయినప్పటినుంచి కెరియర్‌లో ముందడుగు యత్నాలు మొదలుపెట్టింది. ఎంఎస్‌ దిశగా కొన్ని నెలలు కృషి చేసింది. తెలిసినవారు ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌కు ఎంపిక కావడంతో దానికీ దరఖాస్తు చేసి, సన్నద్ధత మొదలుపెట్టింది. ఈలోపు ధాత్రి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లపై దృష్టిపెట్టడం చూసి వాటికీ పోటీ పడింది. ధాత్రి మాత్రం మూడో సంవత్సరంలో ఉండగానే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌నే ఎంచుకుంది. వాటిల్లో మంచి ఎంఎన్‌సీకి ఎంపిక కావాలన్న దీక్షతో చదివింది. ఆ ఉద్యోగావకాశాన్ని అందుకోవడానికి ఉన్న అవరోధాలను గుర్తించింది. చివరి సెమిస్టర్‌లో పూర్తిగా దృష్టి కేంద్రీకరించడంతో అనుకున్న ఫలితం సాధించింది. ఒకే మార్గం ఎంచుకుని దానిపై దృష్టిపెట్టడంతో కెరియర్‌లో కోరుకున్న విజయాలు సాధించవచ్చని డాక్టర్‌ రజని విశ్లేషించారు. దీన్నే ఫోకస్‌ (ఏక దృష్టి) అంటున్నారు. ప్రతిభ, నైపుణ్యాలున్నా ఏకదృష్టితో కృషిచేయకపోతే ఫలితం ఆలస్యమవుతూనే ఉంటుంది. ఒక్కోసారి అనుకున్న గమ్యం చేరలేకపోవచ్చు కూడా!

ఏమిటీ ఫోకస్‌?
ఇది ఒక జీవన నైపుణ్యంగా విరాజిల్లుతోంది. అనుసరించిన వారిని శిఖరాగ్రాలకు చేర్చింది. ఫోకస్‌ అంటే నిర్దేశించిన లక్ష్యంవైపు గురిపెట్టడం. శక్తి సామర్థ్యాలన్నింటినీ కలగలిపి కృషి చేయడం.
ఏం చేయాలి?
జీవన నైపుణ్యాన్ని ఇలా పెంపొందించుకోవచ్చు.

* విషయంపై దృష్టి: కెరియర్‌ లక్ష్యం లేదా మనసుకు నచ్చిన విషయంపై దృష్టి నిలపడం, దాని గురించే ఆలోచించడం. స్వామి వివేకానంద ‘ఒక మంచి ఆలోచన చేయి. దాన్నే జీవితాశయంగా స్వీకరించు. మెలకువలోనూ, నిద్రలోనూ దానిపైనే ధ్యాస ఉంచు. దాన్ని సాధించేవరకూ విశ్రమించకు’ అని ఏకదృష్టి విధానాన్ని ఉద్బోధించారు.
* ఆసక్తి పెంచుకోవాలి: ఇందుకు ఉన్న మంచి మార్గం- సాధ్యమైనంత ఎక్కువ విషయ సేకరణ. అనురక్తి గల విషయంపై సమాచారం సేకరిస్తున్నకొద్దీ ఫోకస్‌ చేస్తున్న విషయానికి మనల్ని మరింత సన్నిహితం చేస్తుంది.
* సామర్థ్యాల పెంపు: దృష్టి పెడుతున్న అంశంతో మనకు విడదీయరాని అనుబంధం ఏర్పరచుకోవాలి. మనలో కొరవడుతున్న సామర్థ్యాలను పెంచుకోవడానికి సాధన చేయాలి. దీనివల్ల ఫోకస్‌ చేస్తున్న లక్ష్యంపై మన గురి ఇంకా పెరుగుతుంది.

* దారి మార్చొద్దు: లక్ష్యాన్ని సాధించే క్రమంలో అవరోధాలు, కష్టాలు ఎదురవొచ్చు. అయినా ఆ మార్గం వదలకూడదు. ఆటంకాలు ఎదురవుతున్నకొద్దీ ఏకదృష్టికి మరింత పదునుపెట్టి ముందుకు కదలాలి.

- యస్‌.వి. సురేష్‌


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని