close

తాజా వార్తలు

Published : 07/02/2021 01:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తళతళా గోదావరి.. మిలమిలా కృష్ణమ్మ!

ఇది ఆమె లక్ష్యం!

జీవనదుల పరిరక్షణనే లక్ష్యంగా పెట్టుకున్నారామె. గోదావరి, కృష్ణ, యమున, కావేరి సహా దేశంలోని నదులను శుభ్రం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. అలాగని ఆమె ఏ పర్యావరణవేత్తో అనుకుంటే పొరపాటు. ఏడో తరగతి చదువుకుని, పిండిమరని ఉపాధిగా చేసుకున్న ఓ సామాన్యురాలు. మరోపక్క అనాథలకూ అండగా ఉంటున్నారు హైదరాబాద్‌ మహిళ లక్ష్మీదుర్గ. ఆమె లక్ష్యాల వెనుక ఉన్న కథని వసుంధరతో పంచుకున్నారు.

మాది పశ్చిమగోదావరి జిల్లాలోని పైడిపర్రు గ్రామం. నాన్న చిన్న హోటల్‌ నడిపేవాడు. అమ్మ గృహిణి. ముగ్గురు పిల్లల్లో నేను పెద్దదాన్ని. ఏడో తరగతి వరకు చదివా. పదిహేనవ ఏటనే మా బంధువులబ్బాయినిచ్చి పెళ్లి చేశారు. ముగ్గురు పిల్లలు పుట్టిన తరువాత ఆయనకూ, నాకూ కలతలు రావడంతో నేను పిల్లల్ని, అమ్మానాన్నలని తీసుకుని హైదరాబాద్‌ చేరుకున్నాను. కుటుంబాన్ని నడిపించడం కోసం పిండిమర నడిపేదాన్ని. చాలీచాలని ఆదాయంతో చాలా కష్టాలు పడ్డాను. ఆ పరిస్థితుల మధ్యనే పిల్లలని పెంచి పెద్ద చేశాను. అందరికీ పెళ్లిళ్లు చేశాను. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో నా పెద్ద కొడుకు చనిపోయాడు. వాడి మరణం నన్ను బాగా కుంగదీసింది. ఆ సమయంలో పిల్లలకు దూరమై ఒంటరిగా కుంగిపోతున్న పెద్దవాళ్ల గురించి ఆలోచించాను. అలాంటి వాళ్లను చేరదీయాలనిపించింది. నాకున్న దాంట్లోనే తొమ్మిదేళ్లక్రితం హైదరాబాద్‌ శివారులో కాంచన వనసింగారం గ్రామంలో ఒక వృద్ధాశ్రమం స్థాపించా. మొదట్లో 30 మందికి ఆశ్రయం ఇచ్చాను. ఎన్జీవోలు ఇచ్చే ఆర్థికసాయంతో ఆ ఆశ్రమం ఏ లోటూలేకుండా నడిచిపోయేది. ఆ తర్వాత నా దృష్టి అనుకోకుండా నదుల ఒడ్డున పేరుకుంటున్న వ్యర్థాలపై పడింది.

చిన్నతనం నుంచీ పల్లెలో పుట్టి పెరిగిన నాకు నదులు వ్యర్థాలతో పాడైపోతుంటే మనసు చివుక్కుమంది. మా చిన్నప్పుడు ఊర్లో ఉండే వాగునీటిని అలాగే తాగేసేవాళ్లం. అయినా చిన్న జలుబు కూడా వచ్చేది కాదు. ఇప్పుడా పరిస్థితి మారింది. మంచినీటిని కూడా కొనుక్కొంటున్నాం. కారణం నదీజలాల్లో వ్యర్థాలు చేరి, కలుషితం కావడమే కదా అనిపించింది. నదులని ఎలా శుభ్రం చేయాలా అని ఆలోచించాను. అదే సమయంలో మా వృద్ధాశ్రమంలో ఒకాయన దీని గురించి మాట్లాడేవారు. ఆయనిచ్చిన స్ఫూర్తితో ‘జీవనది ఫౌండేషన్‌’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించా. 2018లో ‘పవిత్ర నదీజలాలు... ప్రాణాధారం... వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది’అంటూ అందరిలో అవగాహన తీసుకురావడం మొదలుపెట్టా. మొదట బాసరలోని నదీతీరంలో పేరుకున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించాం. నాకు తోడుగా తొమ్మిదిమంది స్వచ్ఛందంగా చేయూతనందించారు. ఆ తరువాత విజయవాడలోని కృష్ణానదీ తీరాన్ని శుభ్రపరిచాం. ఆ పని పూర్తయిన తరువాత నదీజలాల పరిశుభ్రతపై ఆయా ప్రాంతాల్లోని ప్రముఖులతో సదస్సులను నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు గోదావరి, కృష్ణ, యమునా, కావేరి, ప్రాణహిత, తుంగభద్ర నదీతీరప్రాంతాల్లోని వ్యర్థాలను తొలగించాం. స్థానిక ఎన్జీవోలు, ప్రజలు వాలంటీర్లుగా మారి ఈ పనిలో భాగస్వాములవుతున్నారు. జీవనదీ ఫౌండేషన్‌ కోసం దాదాపు 40మంది పనిచేస్తున్నారు. 

ఆలయాల శుభ్రతా చేస్తున్నాం...  మనదేశంలో పురాతన ఆలయాలెన్నో ఉన్నాయి. వాటిని పరిరక్షించడం ఎంత ముఖ్యమో, వాటి పరిశుభ్రత అంతే ముఖ్యం. ఆ దిశగా ఆలోచించి, ఆలంపూర్‌లోని జోగులాంబ శక్తిపీఠం సహా ప్రాచీన ఆలయాల్లో శుభ్రతా కార్యక్రమాలు చేపట్టాం.


 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని