close

తాజా వార్తలు

Published : 03/03/2021 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తాను గెలిచి.. ఇతరులను గెలిపించి..

ఎదురుగా బ్లాక్‌బోర్డుపై కనిపించే అక్షరాలన్నీ గజిబిజిగా, ఒకదానితో మరొకటి  అతుక్కుపోయినట్టుగా కనిపించేవి  నివేదితకు. కొన్ని అక్షరాలైతే తిరగబడి ఉండేవి. దాంతో ఆమె ప్రోగ్రెస్‌ కార్డు  ఎర్రటి గీతలతో నిండిపోయేది. ఇంతకీ నివేదితకు మాత్రమే ఎందుకు అక్షరాలు అలా కనిపిస్తున్నాయి? ఇందుకు ఆమె కనిపెట్టిన పరిష్కారం ఏంటి?
ఇలా అక్షరాలు తిరబడి, గజిబిజిగా, అస్పష్టంగా కనిపించడం డిస్లెక్సియా అనే వ్యాధి లక్షణం. కొన్నేళ్ల క్రితం అమిర్‌ఖాన్‌ కథానాయకుడిగా చేసిన ‘తారే జమీన్‌ పర్‌’ సినిమా ఈ నేపథ్యంతో వచ్చిందే. ఇదే సమస్యను చిన్నతనంలో ఎదుర్కొంది నివేదితా బి.వారియర్‌. ఓ మంచి టీచర్‌ అందించిన చేయూత ఆమెను ఈ సమస్య నుంచి బయటపడేసి ఎన్నో విజయాలు సాధించేలా చేసింది.
కేరళలోని త్రిశూరుకు చెందిన నివేదితకు చదువంటే ఇష్టం. కానీ ఎదురుగా ఉన్న బోర్డుని చూడాలంటేనే భయం. అక్షరాలు అర్థంకాని సమస్య కారణంగా చదువులో మార్కులు తక్కువ వచ్చేవి. ప్రోగ్రెస్‌ కార్డు అంతా ఎర్రటి గీతలతో నిండిపోయేది. ఇంట్లో అమ్మానాన్నల నుంచి తిట్లు తప్పేవి కావు. మరోపక్క స్నేహితులు దూరమయ్యారు. దాంతో రెట్టింపు కష్టపడి చదివేది. అయినా ఫలితం ఉండేది కాదు. ఎలాగోలా ఎనిమిదో తరగతి వరకు రాగలిగింది. అప్పుడే కొత్తగా వచ్చిన సోషల్‌సైన్స్‌ టీచర్‌ నివేదితకున్న సమస్యను ‘డిస్లెక్సియా’గా గుర్తించింది. దాన్నుంచి బయటపడేయటానికి స్కూల్‌ సమయం తర్వాత ప్రత్యేకంగా పాఠాలు చెప్పడం మొదలుపెట్టింది. ఆమె సహకారంతో తొమ్మిదో తరగతి నుంచీ మంచి మార్కులు తెచ్చుకోవడం ప్రారంభించింది. పదోతరగతిలో 78 శాతం మార్కులు సాధించింది. తర్వాత పీజీ పూర్తి చేసింది. మద్రాసు ఐఐటీలో డిస్లెక్సియాపై సమ్మర్‌ ఫెలోషిప్‌నూ చేసింది. యూజీసీ నెట్‌ అర్హత సాధించి...డిస్లెక్సియాపై పీహెచ్‌డీ చేస్తోంది. రెండేళ్లపాటు అళపుళా ఎస్‌డీ కాలేజీలో ఇంగ్లిష్‌ లెక్చరర్‌గా పాఠాలు చెప్పింది.  ‘సాధారణంగా అందరికీ అర్థమయ్యే ‘టైమ్స్‌, న్యూరోమన్‌’ ఫాంట్‌ అక్షరాలు మాలాంటి డిస్లెక్సియా సమస్య ఉన్నవారికి గుర్తించడం, చదవడం కష్టం. అందుకే ‘ఏరియల్‌’, ‘వెర్దనా’ ఫాంట్స్‌నే మేం ఎక్కువగా వినియోగిస్తాం. నా ఎసైన్‌మెంట్స్‌ అన్నింటినీ ఏరియల్‌లో ముందుగా రాసి, ఆ తర్వాత టైమ్స్‌ న్యూ రోమన్‌లోకి తర్జుమా చేసుకునేదాన్ని. ఈ పద్ధతిని నాలాంటి వారందరూ అనుసరించొచ్చు. ఇలాంటి మరికొన్ని వివరాలతో పుస్తకరచన చేస్తున్నా. ఇందులో చిన్నారుల మైండ్‌ మ్యాపింగ్‌ ఎలా ఉంటుంది. వాళ్లకు పాఠాలు చెప్పే విధానాన్ని ఇందులో రాస్తున్నా. దీంతోపాటు ‘నివీ వ్లోగ్స్‌’ పేరుతో ఓ ప్రాజెక్టునూ ప్రారంభించా. అలాగే యూట్యూబ్‌ వీడియోల ద్వారా నాలాంటివారి కథలు చెప్పాలనుకుంటున్నా’ అనే నివేదితకు తాజాగా ‘ఇంటర్నేషనల్‌ ఇన్‌స్పిరేషనల్‌ ఉమెన్‌ అవార్డు-2021’ లభించింది. నోయిడాకు చెందిన జీఐఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ ప్రకటించిన ఈ అవార్డు వివిధ సమస్యలపై పోరాడి గెలిచిన మహిళలకు అందిస్తారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని