
తాజా వార్తలు
బన్నీ సినిమా.. నో ఛాన్స్: ప్రియాప్రకాశ్
రియల్ లైఫ్ క్రష్ గురించి బయటపెట్టిన నటి
హైదరాబాద్: కొంటెగా కన్నుగీటి.. కుర్రకారు హృదయాలు కొల్లగొట్టి.. ఓవర్‌నైట్‌లోనే స్టార్ అయ్యారు కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్ వారియర్. వింకిల్ గర్ల్‌గా ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్న ఈ నటి కథానాయికగా తొలిసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. నితిన్ కథానాయకుడిగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘చెక్’ సినిమాలో ఆమె కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘చెక్’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ప్రియా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు, తనపై వచ్చిన రూమర్స్‌పై పెదవి విప్పింది.
‘‘స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ అంటే నాకెంతో అభిమానం. కేరళలో సైతం బన్నీకి ఎంతోమంది అభిమానులు ఉండడంతో ఆయన సినిమాలను మలయాళంలోకి డబ్ చేసేవాళ్లు. దాంతో చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలే చూస్తూ పెరిగాను. ఈ క్రమంలో ఆయనపై ప్రత్యేక అభిమానం ఏర్పడింది. బన్నీ టాలీవుడ్ స్టార్ అని కొన్ని సంవత్సరాల క్రితమే తెలిసింది. అయితే, బన్నీ సినిమాలో నటించే అవకాశం నాకు వచ్చిందంటూ ఇటీవల ఎన్నో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా నేను ఆ ఆఫర్‌ను తిరస్కరించానని అందరూ చెప్పుకున్నారు. ఆ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదు. ఒకవేళ బన్నీ పక్కన నటించే అవకాశం వస్తే వదులుకోను. తప్పకుండా యాక్ట్ చేస్తా’’
‘‘సినిమాల పరంగా పలువురు నటీనటులంటే నాకు అభిమానం ఉంది. హృతిక్ రోషన్ నా తొలి సెలబ్రిటీ క్రష్. నిజ జీవితంలో అయితే మూడో తరగతిలోనే నా ఫస్ట్ క్రష్ ఏర్పడింది. ఇప్పుడు ఏమీ లేవు. నా దృష్టి అంతా కేవలం కెరీర్‌పైనే ఉంది’’ అని ప్రియా ప్రకాశ్ వారియర్ పేర్కొన్నారు.