close

తాజా వార్తలు

Updated : 25/02/2021 13:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!

హీరో, విలన్‌ - నిర్మాత, దర్శకుడు. - జేడీ చక్రవర్తిలో ఇలా ఎన్నో కోణాలు కనిపిస్తాయి. ఎప్పుడు ఎలా తెరపై సందడి చేస్తారో ఊహించలేం. హిందీ మొదలుకొని దక్షిణాది భాషల వరకు అన్ని భాషల్లోనూ ఆయనకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. జేడీ కథానాయకుడిగా ఇటీవల ‘ఎమ్‌.ఎమ్‌.ఓ.ఎఫ్‌ ఉరఫ్‌ 70 ఎమ్‌.ఎమ్‌’ అనే చిత్రం తెరకెక్కింది. ఎన్‌.ఎస్‌.సి దర్శకత్వం వహించిన ఆ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా జేడీ హైదరాబాద్‌లో ‘ఈనాడు సినిమా’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విషయాలివీ..

పెళ్లి తర్వాత సినిమాలు చేయడంలో వేగం తగ్గినట్టుంది కదా...

వేగంగా ఎక్కువ సినిమాలు చేసేయాలని నేనెప్పుడూ అనుకోను. నాకు నా వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం రెండూ ప్రధానమే. పొద్దున లేచినప్పట్నుంచి రాత్రి వరకు, 31 రోజులు పరుగెత్తడం ఎందుకు? మా అమ్మతో కలిసి గడపడం నాకు ఇష్టం. నాకు స్నేహితులు పెద్దగా లేరు. నాకున్న ఏకైక స్నేహితుడు ఉత్తేజ్‌. తనని కలవాలనిపిస్తే అప్పటికప్పుడు వెళ్లి కలిసేలా జీవితం ఉండాలనుకుంటా. ఇక పెళ్లి గురించి అంటారా? ఎవరూ చేయనిది నేనేమైనా చేస్తే మీరు అడగాలి. ఎవరూ చేయని విధంగా ‘గులాబి’లో బైక్‌ రైడింగ్‌ చేశా. ఎవరూ చేయని ‘సత్య’లాంటి సినిమాలు నేను చేశా. ‘ఎమ్‌.ఎమ్‌.ఓ.ఎఫ్‌’ కోసం ఎవ్వరూ చేయని విధంగా ట్రైలర్‌ని నేను కట్‌ చేశా. ప్రతి ఒక్కరూ చేసే పని గురించి నేనెందుకు మాట్లాడటం? (నవ్వుతూ). పెళ్లి జీవితం గురించి మాట్లాడటం నాకు బోర్‌.

సరే... ఈ సినిమా ఎలా ఉండబోతోంది?

ప్రేక్షకులు అంటే... ‘ఈ సినిమా బాగుంది’ అని, లేదంటే ‘పరమ అసహ్యంగా ఉంద’నైనా అంటారు. మధ్యరకంగా మాత్రం ఉండదు. నిత్యం చూస్తున్న సినిమాల్లాగా ఇది కలర్‌ఫుల్‌గా ఏమీ ఉండదు. వాస్తవికతతో సాగే చిత్రమిది. మల్టీప్లెక్స్‌ థియేటర్ల హవా సాగుతున్న ఈ రోజుల్లో... సింగిల్‌ థియేటర్‌ నడిపించుకునే వ్యక్తిగా నేను కనిపిస్తా. పాత సినిమాలు, అప్పుడప్పుడు బిట్‌ సినిమాలు వేసుకుని నడిపించుకుంటూ కాలం వెళ్లదీస్తుంటా. అనుకోని పరిస్థితుల్లో అతని థియేటర్లో హత్యలు జరుగుతాయి. అలాగని ఇదేం హారర్‌ కాదు. వాస్తవికతతో, అక్కడక్కడా థ్రిల్‌ని రేకెత్తించే చిత్రం. 

కెరీర్‌ పరంగా వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మీ మదిలో ఎలాంటి ఆలోచనలు మెదులుతుంటాయి?

వెనక్కి తిరిగి చూసుకోవడం అనేది నా జీవితంలో ఎప్పుడూ లేదు. హీరో, విలన్, కమెడియన్, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌... ఇలా లెక్కలేవీ వేసుకోకుండా ఒక సినిమా నటుడిని అవుదామనుకున్నా. నా కల, నా జీవిత లక్ష్యం ‘శివ’తోనే తీరిపోయింది. దాని తర్వాత అంతా బోనస్‌గా అనిపించింది. చేయాలనుకున్నది చేశాక ఇక వెనక్కి తిరిగి ఎందుకు చూసుకుంటాం.  తెలుగులో కూడా మంచి కథలు, పాత్రలు వింటున్నా కానీ... వాటి కంటే తమిళం నుంచి మలయాళం నుంచి, కన్నడ నుంచి వచ్చిన కథలు కొంచెం ఎక్కువగా నచ్చుతుంటాయి.

మీ కెరీర్‌ పట్ల మీ అమ్మ ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు?

వ్యక్తిగత జీవితంలో అమ్మ చెప్పిందే వింటా. ఆవిడ సలహా సంప్రదింపులు లేకుండా ఏ పని చేయను. పెళ్లి కూడా అమ్మ చెప్పిందనే చేసుకున్నారా అని అడగబోతున్నారు కదా (నవ్వుతూ), అవును.. నిజమే. కెరీర్‌ గురించి నీ నిర్ణయాలు నువ్వే తీసుకో అంటుంటారు. ఆవిడ నా కెరీర్‌లో రెండే రెండుసార్లు సలహా ఇచ్చారు. నటుడిగా ఒక సినిమా చేయొద్దు అన్నారు. అది ఏ సినిమా అనేది చెప్పొచ్చు కానీ, ఆ దర్శకుడు ఇప్పుడు లేరు. ఆయనపై గౌరవంతో చెప్పడం లేదు. ఇంకోసారి దర్శకుడిగా ‘ఆల్‌ ది బెస్ట్‌’ అనే సినిమా చేయొద్దని చెప్పారు. కానీ నేను వినలేదు.

‘‘కరోనా రాకతో సినిమా పరిశ్రమకి మంచి జరిగింది. సినిమా పరిశ్రమలో అప్పటికే ఉన్న రొటీన్‌ అనే కరోనాని గుర్తించి సమూలంగా నిర్మూలించాం. ఓటీటీ వేదికల ప్రభావంతో  రకరకాల సినిమాలు చూడటం, మనం కూడా అలా కొత్తగా ఆలోచించాలని ఆ దారుల్లో ప్రయాణం చేస్తుండడం మంచి పరిణామం. కొత్త సినిమాలు, కొత్త దర్శకులు, కొత్త ఒరవడులు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఆర్జీవీ, ‘నక్షత్రం’ వేణుగోపాల్‌ కలిసి నిర్మించబోతున్న ఓ చిత్రానికి నేను దర్శకత్వం చేయబోతున్నా. నా స్వీయ నిర్మాణంలో తెలుగు, కన్నడ భాషల్లో ఓ సినిమాని తెరకెక్కించేందుకూ సన్నాహాలు చేసుకుంటున్నా’’.

‘‘మా అమ్మ తర్వాత నాకు ఇష్టమైన వ్యక్తి రామ్‌గోపాల్‌ వర్మ. ఆయనతో అంటే ఒప్పుకోరు కానీ... నాకు ఆయన దారి చూపిన గురువు. ఎప్పుడో ఏదో ఒక రకంగా కలిసి పనిచేస్తుంటా. అంత ఇష్టమైనా... నాపైన మా అమ్మ ప్రభావం ఉంటుందే కానీ, ఆర్జీవీ ప్రభావం లేదు. వ్యక్తిగత జీవితం గురించి ఆయన ఎప్పుడూ మాట్లాడరు. నీ జీవితం నీ ఇష్టం అంటారు. నా జీవితంలో నేనెప్పుడూ మద్యం ముట్టుకోలేదు. ఎందుకని ఆయన ఎప్పుడూ అడగలేదు. కుటుంబం, బంధాల విషయంలో నేను చాలా ఎమోషనల్‌. కానీ ఆర్జీవీ ఆ గొడవలకి దూరంగా ఉంటారు. సాయంత్రం కాగానే ఆయన ఆఫీస్‌ స్నేహితులతో సందడిగా మారిపోతుంది. నేను మాత్రం సాయంత్రం 7 దాటిందంటే నా ఆఫీస్‌కి ఎవ్వరినీ రానివ్వను. నాకు బాగా దగ్గరైన స్నేహితులతో ‘చచ్చిపోవాలనిపిస్తే సాయంత్రం 7లోపే చచ్చిపోండ్రా, ఆ తర్వాత పోతే నేను రాన’ని చెబుతుంటా (నవ్వుతూ). నా మాట తీరు చూసి ఆర్జీవీ ప్రభావం అనుకుంటారు. ముక్కుసూటిగా మాట్లాడటం నాకు చిన్నప్పట్నుంచీ అలవాటు. చాలామంది ఇలా ఉంటే సమస్యలొస్తాయని భావిస్తారు కానీ... నిజానికి చాలా సమస్యలు దూరం అవుతాయి’’.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని